ఫండే
ఈ వారం కథ
‘‘రేపు ఉదయమే కార్యక్రమం. ఇంకా గోవు సిద్ధం కాకపోతే ఎలా?’’
‘‘మీరేం ఆందోళన చెందకండి. అనుకున్నట్టుగానే కార్యక్రమం పూర్తవుతుంది’’.
‘‘పదిరోజుల నుంచి మీ వెంట పడుతున్నాను. ఇప్పటి వరకూ ఏదీ ముడిపడలేదు. అందుకే భయంగా ఉంది.’’
‘‘మీకిది మొదటిసారేమో! మేము ఎన్ని కార్యక్రమాలు చేయలేదు. ఉదయం చెప్పి ఆవు పంపమని అడిగినా క్షణాల్లో సిద్ధం చేసేస్తాం’’.
‘‘ఏదో మిమ్మల్నే నమ్ముకున్నాను... ’’.
‘‘మనకు ఎప్పుడూ సప్లై చేసేవాడి దగ్గర ఆవు చనిపోయింది. మనుషుల్లాగానే ఇప్పుడు ఆవులకు కూడా ఇన్సూరెన్సు ఉంటోంది. ఆ గొడవల్లో మునిగి ఉన్నాడతను.’’.
‘‘అతను కాకపోతే, ఇంకెవరయినా...’’.
‘‘మొన్న రెండు ఆవుల ఫొటోలు పంపాను కదండీ..’’
‘‘ఆ... తెల్లటిచర్మం పైన నల్లటి మచ్చలున్న ఆవు... చూడగానే అదోలా ఉంది. అందుకే...’’
‘‘ఫరవాలేదు. మీకు నచ్చిన ఆవునే అనుకున్న బడ్జెట్లో వచ్చేలా చూసే పూచీ నాది. మీరేం ఫికర్ కాకండి’’.
‘‘తెల్ల ఆవు అయితే బావుంటుందని చెప్పాను తప్ప రంగు పట్టింపు అంత లేదు. మంచి ఆరోగ్యంగా ఉన్న ఆవుని చూసి పంపండి.’’
‘‘సరేనండి...’’
‘‘మధ్నాహ్నం 12.30 కల్లా మీకు ఫొటోలు వచ్చేస్తాయి. మీకు నచ్చిన ఆవును ఎంపిక చేసుకోండి. మరణించిన మీ బంధువుల ఆత్మశాంతి కోసం ఈ పనికి పూనుకుంటున్నారు. మిమ్మల్ని అభినందించాలి’’.
‘‘అంతా సజావుగా జరిగితే ఫరవాలేదు, లేకపోతే నలుగురి ముందూ నవ్వుల పాలవుతాను.’’
‘‘ఆ విషయం నాకు వదిలెయ్యండి. మీరు చెప్పిన టైమ్ కంటే ఓ అర్ధగంట ముందే సత్రం దగ్గర ఆవు ఉంటుంది. నా మాట నమ్మండి’’.
∙∙
‘‘అయ్యా, సమయం 5.30 దాటుతోంది. ఆవు సంగతి తేలలేదు. అనుకున్న పని సజావుగా పూర్తవుతుందా లేదా అని భయంగా ఉంది?’’
‘‘నాకొదిలెయ్‌మన్నా కదా... జహీరాబాద్ వాడు ఫోన్ ఎత్తటం లేదు. చాలాసార్లు ట్రై చేశా. ఇప్పుడు చింతలకుంట మార్కెట్ అతను మాట్లాడాడు. ఇప్పుడే ఫొటోలు వచ్చాయి. పంపుతున్నాను.’’
‘‘మరి ధర విషయం?’’
‘‘కాస్త ఎక్కువ చెబుతున్నాడు.’’
‘‘మీరే మాట్లాడి నా బడ్జెట్ ప్రకారం తెగ్గొట్టండి.’’
‘‘నా వంతు ప్రయత్నం చేస్తాను.’’
‘‘మధ్యాహ్నం అనగా మాట్లాడాను. ఇప్పుడు రాత్రి 7.30 దాటింది. కొన్ని గంటల్లో కార్యక్రమం పెట్టుకుని ఆవు సిద్ధం కాకపోతే ఎలా?’’
‘‘తను ఆవు ధర చెప్పాడు. తగ్గటం కుదరదని బిగుసుకుపోయాడు. ఏం చేయాలో తోచక..’’
‘‘ఇంతకీ ఎంత చెబుతున్నాడేమిటి?’’
‘‘మీకు మెసేజ్ పెట్టాను. వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి.’’
‘‘అమ్మో.. ఇంతా? బడ్జెట్ పదివేలు దాటుతుంది’’.
‘‘అందుకే నేనే తగ్గించమని బతిమాలుతున్నా’’.
‘‘ఎలాగోలా అయ్యేటట్టు చూడండి’’.
‘‘చూద్దాం. మనకు బానే పరిచయం ఉన్నవాడు. తగ్గుతాడనే అనుకుంటున్నాను’’.
‘‘ప్లీజ్. ఏదో రకంగా సెటిల్ చేయండి.’’
∙∙
‘‘రెండు గంటల నుంచి మీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ టెన్షన్ భరించటం నా వల్ల కావటం లేదు. ఎంతో కొంతకి సెట్ చేయండి. ఇప్పుడు రాత్రి 9 అవుతోంది’’
‘‘చాలాసార్లు మాట్లాడి చూశాను. ధర తగ్గించటం కుదరదంటున్నాడు. మీరే ఆలోచించి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి.’’
‘‘ఇప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏముంది?’’
‘‘అలా కాదు. మీ ఇద్దరికీ కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటు చేస్తాను. మీరు కూడా మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తే బావుంటుంది.’’
‘‘ఆ అవసరం ఎంత మాత్రం లేదు. మీపైన బాధ్యత పెట్టాను. అతను తగ్గనంటే నేను మాత్రం ఏం చేస్తాను. ఆ రేటుకే కానిచ్చేయండి.’’
‘‘సరే. వాట్సాప్‌లో లొకేషన్ పంపితే వచ్చి మీ ఇంటికొచ్చి డబ్బులు తీసికెళతాడు. పురోహితుడు కూడా కావాలన్నట్టున్నారు. మాకు తెలిసిన ఓ పెద్దాయన్ని పంపుతాను.’’
‘‘ఆయనకు సంభావన, ఇతర ఖర్చులు..’’
‘‘గోదానానికి రెండువేల నుంచి మూడువేల వరకూ తీసుకుంటారు. దానితో పాటు పెట్రోలు ఖర్చులు నాలుగైదు వందలు ఉంటుందేమో? అంత వరకూ ముట్టచెప్పండి చాలు...’’
‘‘అలాగే. సత్రం చిరునామా పంపుతాను. ఉదయం 8, 8.30 కల్లా వచ్చెయ్యమని చెప్పండి.
‘‘అలాగే..’’
∙∙
‘‘అదేంటి? ఉదయం ఆరుగంటలకే బయలుదేరతానన్నావు కదా?’’
‘‘మీరు చెప్పిన ధరకయితే రాలేను.’’
‘‘అదేంటి? బేరం మాట్లాడుకున్న తర్వాత ఇలా చేస్తారా ఎవరైనా?’’
‘‘ఓసారి మీరన్నది గుర్తు చేసుకోండి. ఆవుకు డబ్బులిచ్చాను. మళ్లీ ట్రాన్సుపోర్టుకు అదనమని నాకు తెలీదు అని మీరు వాదించారు..’’
‘‘అవును, గుర్తుంది. ఆవు అమ్మిన అతన్ని దగ్గర నంబరు తీసుకుని నీతో మాట్లాడాను. ఇప్పటికే ఖర్చు తడిసిమోపెడయ్యింది. నేను ఇంతే ఇస్తాను. మిగతా ఎమౌంట్ అతని దగ్గర తీసుకోమన్నాను.’’
‘‘ఆ..’’
‘‘అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా, ఇప్పుడు పంచాయతీ చేస్తున్నావేంటి?’’
‘‘బాడుగ గిట్టదు..’’
‘‘సరే, ఏం చేస్తాం? నువ్వడిగినదంతా ఇస్తాను, ఆవు, దూడలతో వచ్చెయ్యి’’
‘‘డబ్బులు ఫోన్ పే చెస్తే.. బయలుదేరతా.’’
∙∙
‘‘అయ్యా, కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆవుని, దూడని పసుపు, కుంకుమలతో చక్కగా అలంకరించండి.’’
రామశర్మ కారు దిగి అక్కడ అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
నుదుటిన పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్ష మాల, చేతికి బంగారు కడియాలు, వేళ్లకు తళతళా మెరుస్తున్న ఉంగరాలు, ఖరీదైన సిల్కులాల్చీ... బాగా ఖరీదయిన మనిషిలాగా కనిపించాడు.
నిన్న ఉదయం నుంచి పడిన శ్రమ సార్థకమయ్యే సమయం వచ్చింది. క్రతువు ఘనంగా చేయాలనే సంకల్పంతో ఉన్నా. అందుకే మనసులో ఆందోళనగా ఉన్నా, మిగతా అన్ని ఆలోచనలను పక్కకు నెట్టి చేస్తున్న పనిమీద మనసు నిలిపాను. చుట్టూ ఉన్న వాళ్లని హుషారు చేశాను. ఆవు అలంకరణ పూర్తి కావటానికి ఎంతో సమయం పట్టలేదు. పసుపు, కుంకుమ అలంకరించిన తర్వాత కొత్తగా కొన్న చీర, బ్లౌజ్ పైన పరిచాం. రామశర్మ పెదవులు కదులుతున్నాయి. బయటకు వినిపించటం లేదు గానీ ఆయన ఏవో మంత్రాలు చదువుతున్నాడని అర్థమైంది. ఓ పదినిముషాల తర్వాత ‘‘మీ కుటుంబ సభ్యులంతా దంపతులుగా వచ్చి ముమ్మారు ప్రదక్షిణ చేయండి’’ గట్టిగా చెప్పారు.
ఆయన ఆదేశాలు తు.చ. తప్పకుండా అమలు చేశాం. అపరకర్మల కోసం అక్కడకు వచ్చిన వాళ్లు, సత్రం గదుల్లో ఉన్న వాళ్లు బిలబిలమంటూ బయటకు వచ్చి ఈ తంతు చూడటం ప్రారంభించారు. యూట్యూబ్ వచ్చిపడ్డ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. దానిని భక్తి అనాలో, మరొకటనలో.. అంతమందిని చూడగానే రామశర్మలో ఎక్కడలేని హుషారు వచ్చింది.
‘‘మీకు గోదానం ప్రాశస్త్యాన్ని వివరిస్తాను’’ ఆయన కంఠం ఖంగుమంది.
‘‘గోవులను దానం చేయటం వల్ల దారిద్య్రం తొలగి సంపదలు కలుగుతాయి. అనారోగ్య, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. గృహదోషాలు మాయమవుతాయి. జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. మరణానంతరం ‘వైతరణి’ దాటే క్రమం సులభమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమగతులు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.’’
రామశర్మ చెప్పేది అందరూ సావధానంగా వింటున్నారు. టీవీ కార్యక్రమాల్లో ప్రయోక్త మాదిరిగా హావభావాలను ప్రదర్శిస్తూ ఆయన సంభాషణను రక్తికట్టిస్తున్నాడు.
‘‘గోవు సకల దేవతా స్వరూపం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తర్వాత, కన్నతల్లి తర్వాత, ఒక్క ఆవును మాత్రమే గోమాత అని పిలుస్తారు...’’ అని వివరించిన తర్వాత.. కాస్త విరామం ఇచ్చి.. ‘‘గోమాత నమోనమో నమోనమో నమః’’ అన్నాడు రామశర్మ.
‘‘ఈ నామాన్ని మీరంతా మూడుసార్లు అనండి’’ అని అందరి చేత అనిపించాడు.
అందరి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఈ క్షణంలో ఇక్కడ లేకపోయుంటే ఎంత పుణ్యాన్ని కోల్పోయేవాళ్లమో అనుకున్నారు.
‘‘మీలో చాలా మందికి గోదానం చేయాలని ఉంటుంది. అదెలాగో తెలియదు. అలాగే కొందరికి ఆసక్తి ఉంటుంది కాని, ఆర్థికంగా స్తోమత ఉండదు. అలాంటి వాళ్లందరి కోసం నా దగ్గర చిట్కా ఉంది. మీరు నెలనెలా వెయ్యి రూపాయలు ఖర్చుపెడితే చాలు, మీ పేరుతో ఆవుకి మేత వేస్తాం. ఆవుల సంతతి పెరుగుతుంది. మీకు పుణ్యం వస్తుంది. వెయ్యి అనే కాదు. ఇవ్వగలిగిన వాళ్లు అంతకంటే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు.’’
‘‘మీకు ఆవులు ఉన్నాయా పంతులు గారూ?’’ ఎవరో ఒకావిడ అడిగింది.
‘‘ఎంతమాట అన్నావమ్మా! పెద్ద గోశాలనే నడుపుతున్నా. అక్కడ చాలా ఆవులు ఉంటాయి. దానాలు అవసరం అయిన వాళ్లు ఫోన్ చేయవచ్చు. కావాలనుకుంటే వచ్చి చూడొచ్చు’’.
లాల్చీ జేబులో నుంచి విజిటింగ్ కార్డుల కట్ట బయటకు తీశాడు. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా మీద పడ్డారు.
‘‘వెయ్యి కష్టం అనుకున్న వాళ్లు కనీసం ఐదు వందలయినా ఇవ్వండి. పుణ్యం మూటకట్టుకోండి.’’ అప్పటికప్పుడు రాయితీ కూడా ప్రకటించారు.
రామశర్మ మాటలతో మైకం కమ్మిందో, అప్పటికే పుణ్యం అన్న మాట చాలాసార్లు విని ఉండటం వల్లనో తెలియదు అందరికీ పూనకం వచ్చిందో తెలియదు గాని, వెనకా ముందు చూసుకోలేదు. జేబుల్లో నుంచి నోట్లు తీసి రామశర్మ చేతుల్లో కుక్కారు. మరికొందరు డిజిటల్ పేమెంట్ మోడ్‌లోకి వెళ్లారు. రామశర్మ ఓ వైపు నోట్లు సరిచూసుకుంటూ దాతలకు అక్షతలు వేసి ఘనంగా దీవించారు. అందరూ తలో వైపు వెళ్లిపోయారు. ఇది ప్రైవేటు కార్యక్రమం. మా కుటుంబానికి పరిమితమైన వ్యవహారం. దానిని పక్కన పెట్టి ఆయన తన సొంత బిజినెస్‌లో నిమగ్నం కావటం నాకు ఇబ్బంది అనిపించింది. అయినా నోరు మెదపలేకపోయాను. మా కుటుంబంలో మిగతావాళ్లదీ దాదాపుగా అదే పరిస్థితి. అంతలోనే ఆయన నా వైపు చూస్తూ ‘కార్యక్రమం ముగిసింది’ అన్నట్టుగా కళ్లతోనే చెప్పాడు. నేను పర్సులో నుంచి డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టాను.
వాటిని లెక్క పెట్టుకుని ‘‘ఇదేంటి?’’ అన్నాడు సీరియస్‌గా.
‘‘నేను ఒప్పుకున్నది అంతకేగా.. ఆవు పంపిన వ్యక్తి.. పేరు చెప్పాను. ఆయన చెప్పిన మొత్తం ఇదేగా?’’ అన్నాను అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తూ.
‘‘ఈ చిల్లర తీసుకోవటానికి నేనేం ఆషామాషీ వ్యక్తిని కాదండీ.’’
ఎంత ఇవ్వాలో అంకె చెప్పాడు. అది వినేసరికి నా కళ్లు బైర్లు కమ్మాయి.
‘‘జంటనగరాల్లో నేను ఫేమస్. సినిమావాళ్లు, పొలిటీషియ¯Œ ్స, బిజినెస్ బిగ్ షాట్స్ అందరూ నా క్లయింట్స్. వాళ్లందరికీ నా మాట మీద గురి. నేను చెప్పినట్టల్లా నడుచుకుంటారు. నా నాలిక మీద సరస్వతి నాట్యం చేస్తుంది. నేను ఒక మాట అన్నానంటే అంతే...’’
ప్రవాహంలా ఆయన మాటలు సాగుతున్నాయి. ఆ సొద వినటం నాకు ఇబ్బందిగా ఉంది.
‘‘నేను సోషల్ మీడియా చూడను. నాకు ఇవేమీ తెలియవు’’ అన్నాను చికాకు బయటకు కనపడకుండా.
‘‘నా యూట్యూబ్ చానల్‌కి లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.’’ అన్నాడు దర్పాన్ని ప్రదర్శిస్తూ.
అప్పటి వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ పన్నెండేళ్ల కుర్రాడు మొబైల్‌లో వీడియో తీయటాన్ని ఇంతకు ముందు గమనించాను. ఇప్పుడు ఆయన చెబుతుంటే అర్థం అవుతోంది. ఒకేసారి స్వామికార్యం, స్వకార్యం పూర్తి చేస్తున్నాడన్నమాట. డబ్బు పుచ్చుకుని కార్యక్రమాలు చేయటానికి వస్తాడు. వాటిని షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టి తిరిగి డబ్బు సంపాదిస్తాడు.
ఆయన నా ఆలోచనలు తుంచేస్తూ. ‘‘సర్సరే. అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. డబ్బులిస్తే బయలుదేరతాను’’ అన్నాడు దబాయించినట్టుగా. ఆయన అడిగిన మొత్తం చేతిలో పెట్టి నమస్కారం చేశాను. ఆ డబ్బుల్ని లాల్చీలోకి నెట్టుకుని క్షణాల్లోనే మాయమయ్యాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికే నాకు ఓర్పు సడలింది. పని ముగించుకుని ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తోంది. కాని అదంత సజావుగా ముగిసేటట్టు లేదు.
∙∙
‘‘ఉదయం 8గంటలకు రమ్మని పిలిచారు. నాలుగు గంటలు వెయిట్ చేయించారు. ఇంకో వెయ్యి అదనంగా ఇవ్వండి’’ ఆవును వెంట తెచ్చిన వ్యాన్ డ్రైవర్ డిమాండ్ చేశాడు.
‘‘ఓ ఐదొందలు.. కాదంటే అదనంగా ఇంకో వంద.. తప్ప అంత కంటే ఎక్కువ ఇవ్వలేను. అంతా లెక్క వేసుకుని డబ్బులు తెచ్చాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు’’ బతిమాలుతున్నట్టుగా అడిగాను.
‘‘మీరిచ్చే దానిలో రెండు వందలు చీటీకే పోతుంది’’ నిర్లక్ష్యంగా చెప్పాడతను.
‘చీటీ అంటే..?’’
‘‘సంతలో ఆవును కొన్నప్పుడు దానికి రిసీప్టు ఇస్తారు. మీ పేరుతో తీసుకున్నాను. కావాలంటే చూడండి’’ చీటీ తీసి నా చేతిలో ఉంచాడు.
‘‘పరిస్థితి చాలా అన్యాయంలా ఉందే. ఆవు కొన్నందుకు డబ్బు చెల్లించటం కాకుండా మళ్లీ అదనంగా ఇంకో ఖర్చా? నా దగ్గర ఉన్నవి ఇవే. వీటితో సర్దుకో. విసిగించొద్దు’’.
‘‘మిగిలిన డబ్బులు గూగుల్ పే చేయండి’’.
‘‘బాబూ, నీకో దండం. ఈ పని తలకెత్తుకుని నేను పడ్డ నరకయాతన చాలు. ఇచ్చింది పుచ్చుకుని వెళ్లు’’.
‘‘ఛీ... వెధవ బేరం’’
అతని నోటి నుంచి వచ్చిన బూతులు విన్న తర్వాత డబ్బులు ఇచ్చినా బావుండేదని అనిపించింది.
∙∙
ఈ తంతులో ఆఖరి ఘట్టంలోకి ప్రవేశించాం. ఓ వైపు భోజనాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, మునిమనవరాళ్లు... అటూ ఇటూ ఐదు తరాల వాళ్లు ఒకచోట చేరారు. అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు.
‘‘ఆవిడ పరిపూర్ణ జీవితాన్ని గడిపింది. ఇన్ని తరాల వాళ్లను చూసుకుంది అదృష్టవంతురాలు...’’
‘‘పెట్టుపోతలంటే ఆవిడ తర్వాతనే ఇంకెవరయినా. ఇంటికొస్తే ఎంగిలిపడకుండా తిరిగి వెళ్లనిచ్చేది కాదు..’’
‘‘ఎవరు ఎన్ని మాటలన్నా మౌనంగా ఊరుకునేది. పరుషంగా ఒక్కరిని నిందించటం చూళ్లేదు..’’
‘‘ఇంత పెద్ద సంసారాన్ని ఒంటి చేతిమీద నెట్టుకొచ్చింది.’’
నాకు తెలిసి నిన్న మొన్నటి వరకూ వీళ్లంతా ‘ఈ ముసలమ్మ నస భరించలేకపోతున్నాం’ అని విసుక్కున్న వాళ్లే. మరి ఇప్పుడేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు? వ్యక్తుల మరణంతో అన్నీ తుడిచిపెట్టుకుపోయాయా? ఈ సంభాషణ ఒక వైపు సాగుతూండగానే మాకు కొద్ది దూరంలో.. తోడికోడళ్లు నలుగురు పోగయి మాట్లాడుకుంటున్నారు. అక్షరం పొల్లుపోకుండా అవన్నీ నా చెవిలో పడుతున్నాయి.
‘‘ఇదంతా పెద్ద షో అక్కా? నెలనెలా జీతం రాళ్లతో బతికేవాళ్లు... వేలకు వేలు పోసి ఆవు కొనగల సత్తా ఉందా? ఎక్కడో ఆవును, దూడను తెచ్చి తంతు ముగించేసి ఉంటారు. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదట!’’
‘‘ఈ ముసల్ది కూతురికి పెద్ద మూట ఇచ్చి ఉంటుంది. అందుకే ఘనంగా గోదానం చేస్తున్నారు. ’’
‘‘అమ్మ బతికున్నప్పుడు ఉన్న ఊళ్లోనే అయినా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు గానీ, టింగురంగా అంటూ ఇప్పుడొచ్చి ప్రేమ ఉన్నట్టు వేషాలేస్తోంది చూడు. ఆ అల్లుడుగాడు ఏదో గొప్ప పని చేసినట్టు ఫోజు కొడుతున్నాడు. పాపం ఊరికే పోతుందా? వీళ్లను కట్టి కుడపదూ?’’
‘‘అత్తగారి వైపు నుంచి బాగా ఆస్తి వచ్చి ఉంటుంది? కొడుకు అమెరికాలో ఉన్నాడుగా.. నెలనెలా డాలర్లు పంపుతూ ఉండుంటాడు. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక, నలుగురి ముందు గొప్ప చాటుకోవాలని..’’
‘‘ఇవన్నీ కాదు అక్కా... ముసలమ్మ వాటా కొట్టెయ్యటానికి ప్లాన్ చేశారేమో?’’
‘‘మేం చేతగాని వాళ్లమా? అదెలా జరగుతుందో చూస్తాం...’’
మా దంపతుల్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి కొనసాగుతోంది. ఇతరుల ప్రశంసల కోసమో, గొప్ప కోసమో ఈ పని చేయలేదు. అసలు గోదానం కొడుకులు చేయవలసిన పని అన్న స్పృహ కూడా నాకు లేదు. నా సమక్షంలో గోదానం గురించి చర్చ సాగుతున్నప్పుడు ‘నేను చూసుకుంటాను’ అని చెప్పి ఇందులోకి దిగాను. అంతకు తప్ప... పక్కనే ఉన్న నా భార్య ఈ మాటలు విన్నట్టుంది. గట్టిగా శోకాలు అందుకుంది. ఆమెను అక్కడ నుంచి పక్కకు తీసికెళ్లి ఓదార్చాక గాని తను మామూలు కాలేకపోయింది. భోజనాలు ముగిశాయి. ఆ తర్వాత ఆశీర్వచన కార్యక్రమం పూర్తయ్యింది.
‘‘ఎవరికీ వెళ్లొస్తామని చెప్పకూడదు. పొద్దుగూకక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’’
అక్కడున్న వాళ్లెవరో చెప్పారు. ఒక్కొక్కళ్లు లేవటం మొదలుపెట్టారు.
ఏ కర్మఫలం నన్ను ఇందుకు పురిగొల్పిందో? నా పుర్రెకు పుట్టిన బుద్ధి... నా భార్యతో సహా మిగిలిన వాళ్లందరినీ ఆశ్చర్యపరచి ఉండొచ్చు. నాకు మా అత్తగారి వైపు వాళ్లతో అంత సాన్నిహిత్యం లేదు. పండగలు, పెట్టుపోతలు లాంటి వాటికి దూరంగా ఉన్న వాడిని. ఇప్పుడిలా.. ఓ మంచి పని చేయటంలో ఉండే తృప్తిని మిగుల్చుకోవాలన్న తాపత్రయం తప్ప దీని వెనక నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఈ మాటలు బయట పెట్టి నేను చేసిన పని విలువను దిగజార్చుకోదలచుకోలేదు.
‘‘మరణించిన పెద్దావిడకు భగవంతుడు సద్గతులు ప్రసాదించాలి’’ అనుకున్నాను.
రామశర్మ చెప్పినట్టు.. ‘‘ఆమె హాయిగా వైతరణి దాటాలి. దానం చేసిన ఈ గోవు ఆమెకు దీపధారిగా నిలవాలి’’ అని వేడుకున్నాను.
ఓ సత్కార్యం చేయటానికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని మనసారా ధన్యవాదాలు చెప్పుకుని నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటపడ్డాం.
సూర్యుడు పడమటి కొండల్లోకి దిగుతున్నాడు.
- డాక్టర్ పార్థసారథి చిరువోలు


