లీగలాటా
ట్రైలర్‌లో ఉన్న పాట సినిమాలో లేకపోతే ఏం చేస్తారు? తిట్టుకుంటూ బయటకు వస్తారా? డబ్బులు వృథా అయ్యాయని బాధపడతారా? అయితే ఓ మహిళా ప్రేక్షకురాలు ఇలా చేయలేదు. కోర్టుకెక్కింది... వినియోగదారుగా తన హక్కుల కోసం పోరాడింది. ఆ పాట కోసం ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ వరకు న్యాయ పోరాటం సాగించింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు శుభం కార్డు పడింది.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా యశ్‌రాజ్ ఫిలిమ్స్(వైఆర్‌ఎఫ్) 2016లో ‘ఫ్యాన్’ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలకు ముందు టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రమోషనల్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్‌లోని ‘జబ్రా’ ఫ్యాన్ పాట సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఔరంగాబాద్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ ఈ ట్రైలర్ చూసి కుటుంబంతో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తయినా ఆ పాట మాత్రం రాలేదు. దీంతో ఆమె నిరుత్సాహానికి గురై జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.
ట్రైలర్‌లోని పాటను తొలగించి చిత్ర నిర్మాణ సంస్థ మోసం చే సిందని , దీనివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. రూ. 60,500 నష్టపరిహారం కోరారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన నిర్మాత నేరుగా సేవలందించే సంస్థగా మారడని ఫోరం పేర్కొంది. వినియోగదారుడికి..సంస్థకు మధ్య ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేదని.. కేసు చెల్లదని కేసు తిరస్కరించింది.
ఫిర్యాదుదారుకు అనుకూలంగా..
ఆ తీర్పుపై ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. .సినిమా ప్రదర్శన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలోని ‘సేవ’ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, వైఆర్‌ఎఫ్ ఆ సేవను అందించే సంస్థగా కమిషన్ పేర్కొంది. జబ్రాఫ్యాన్ పాటను తొలగించి సంస్థ ప్రేక్షకులను పక్కదోవ పట్టించింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని అభిప్రాయపడింది. . పరిహారంగా రూ. 10,000, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 పిర్యాదుదారుకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్‌సీడీఆర్‌సీ)ను సంస్థ ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ అభిప్రాయాన్నే ఎన్‌సీడీఆర్‌సీ కూడా సమర్థించింది.
ఆఫర్.. అంగీకారం ఉండాలి..
ఈ తీర్పుపై వైఆర్‌ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైలర్ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది. అయితే మోసపూరితమైన, అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ప్రభావితం కావొచ్చు..కానీ చట్టబద్ధమైన హామీగా దీన్ని భావించలేమని కోర్టు వివరించింది. టికెట్ కొని సినిమా చూసే ప్రతీ వ్యక్తి వినియోగదారుడే అనడంలో సందేహం లేదని పేర్కొంది. సేవల్లో లోపం జరిగిందా? లేదా? అనేదే ఈ కేసులో కీలకాంశమని చెప్పింది.
అసంపూర్ణత, నాణ్యతలో నాసిరకం, పనితీరు సక్రమంగా లేకపోవడం, తయారీలో తగిన ప్రమాణాలు పాటించకపోవడాన్నే సేవల్లో లోపంగా గుర్తించాలని పేర్కొంది. సినిమాలో ఆ పాట తప్పనిసరిగా ఉంటుందనేది ఫిర్యాదుదారు వ్యక్తిగత అంచనా మాత్రమే అని తెలిపింది. దీన్ని చట్టపరంగా సేవల్లో లోపంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
చట్టబద్ధమైన ఒప్పందం ఏర్పడాలంటే ‘ఆఫర్’ ఉండాలి..ఆ ఆఫర్‌ను మరో పక్షం అంగీకరించాలని చెప్పింది. ట్రైలర్‌ను ‘ఆఫర్’గా భావించలేమని అందువల్ల కాంట్రాక్టు చట్టం ప్రకారం ఈ వాదన సరైంది కాదని తేల్చింది. ప్రతి చిన్న తేడా లేదా ప్రతి నిరాశ ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ నిర్వచనం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం, ప్రకటన, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడే అది ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ఇవేవీ రుజువు కాలేదని వివరించింది.
యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకులను మోసం చేసిందని, తప్పుదోవ పట్టించిందని నిరూపించే బలమైన ఆధారాలను ఫిర్యాదుదారు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ ప్రక్రియలో ఉన్న పలు అంశాలు చివరి దశలో మారడం సహజమేనని కళాత్మక సేవలను సాధారణ సేవలతో పోల్చలేమని వివరించింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్‌సీడీఆర్‌సీ ఉత్తర్వును రద్దు చేసింది. ప్రచార ట్రైలర్‌లో కనిపించిన పాట సినిమాలో లేకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు రాదని తీర్పు ఇచ్చింది.
- దిలీప్ మాదిరెడ్డి


