breaking news
fan movie
-
సినిమాలో పాట లేదని కోర్టు మెట్లు ఎక్కిన మహిళ
ట్రైలర్లో ఉన్న పాట సినిమాలో లేకపోతే ఏం చేస్తారు? తిట్టుకుంటూ బయటకు వస్తారా? డబ్బులు వృథా అయ్యాయని బాధపడతారా? అయితే ఓ మహిళా ప్రేక్షకురాలు ఇలా చేయలేదు. కోర్టుకెక్కింది... వినియోగదారుగా తన హక్కుల కోసం పోరాడింది. ఆ పాట కోసం ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ వరకు న్యాయ పోరాటం సాగించింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు శుభం కార్డు పడింది.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా యశ్‌రాజ్ ఫిలిమ్స్(వైఆర్ఎఫ్) 2016లో ‘ఫ్యాన్’ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలకు ముందు టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రమోషనల్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్‌లోని ‘జబ్రా’ ఫ్యాన్ పాట సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఔరంగాబాద్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ ఈ ట్రైలర్ చూసి కుటుంబంతో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తయినా ఆ పాట మాత్రం రాలేదు. దీంతో ఆమె నిరుత్సాహానికి గురై జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.ట్రైలర్‌లోని పాటను తొలగించి చిత్ర నిర్మాణ సంస్థ మోసం చే సిందని , దీనివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. రూ. 60,500 నష్టపరిహారం కోరారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన నిర్మాత నేరుగా సేవలందించే సంస్థగా మారడని ఫోరం పేర్కొంది. వినియోగదారుడికి..సంస్థకు మధ్య ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేదని.. కేసు చెల్లదని కేసు తిరస్కరించింది.ఫిర్యాదుదారుకు అనుకూలంగా..ఆ తీర్పుపై ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. .సినిమా ప్రదర్శన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలోని ‘సేవ’ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, వైఆర్ఎఫ్ ఆ సేవను అందించే సంస్థగా కమిషన్ పేర్కొంది. జబ్రాఫ్యాన్ పాటను తొలగించి సంస్థ ప్రేక్షకులను పక్కదోవ పట్టించింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని అభిప్రాయపడింది. . పరిహారంగా రూ. 10,000, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 పిర్యాదుదారుకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ను సంస్థ ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ అభిప్రాయాన్నే ఎన్సీడీఆర్సీ కూడా సమర్థించింది.ఆఫర్.. అంగీకారం ఉండాలి..ఈ తీర్పుపై వైఆర్ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైలర్ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది. అయితే మోసపూరితమైన, అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ప్రభావితం కావొచ్చు..కానీ చట్టబద్ధమైన హామీగా దీన్ని భావించలేమని కోర్టు వివరించింది. టికెట్ కొని సినిమా చూసే ప్రతీ వ్యక్తి వినియోగదారుడే అనడంలో సందేహం లేదని పేర్కొంది. సేవల్లో లోపం జరిగిందా? లేదా? అనేదే ఈ కేసులో కీలకాంశమని చెప్పింది.అసంపూర్ణత, నాణ్యతలో నాసిరకం, పనితీరు సక్రమంగా లేకపోవడం, తయారీలో తగిన ప్రమాణాలు పాటించకపోవడాన్నే సేవల్లో లోపంగా గుర్తించాలని పేర్కొంది. సినిమాలో ఆ పాట తప్పనిసరిగా ఉంటుందనేది ఫిర్యాదుదారు వ్యక్తిగత అంచనా మాత్రమే అని తెలిపింది. దీన్ని చట్టపరంగా సేవల్లో లోపంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధమైన ఒప్పందం ఏర్పడాలంటే ‘ఆఫర్’ ఉండాలి..ఆ ఆఫర్‌ను మరో పక్షం అంగీకరించాలని చెప్పింది. ట్రైలర్‌ను ‘ఆఫర్’గా భావించలేమని అందువల్ల కాంట్రాక్టు చట్టం ప్రకారం ఈ వాదన సరైంది కాదని తేల్చింది. ప్రతి చిన్న తేడా లేదా ప్రతి నిరాశ ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ నిర్వచనం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం, ప్రకటన, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడే అది ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ఇవేవీ రుజువు కాలేదని వివరించింది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకులను మోసం చేసిందని, తప్పుదోవ పట్టించిందని నిరూపించే బలమైన ఆధారాలను ఫిర్యాదుదారు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ ప్రక్రియలో ఉన్న పలు అంశాలు చివరి దశలో మారడం సహజమేనని కళాత్మక సేవలను సాధారణ సేవలతో పోల్చలేమని వివరించింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును రద్దు చేసింది. ప్రచార ట్రైలర్లో కనిపించిన పాట సినిమాలో లేకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు రాదని తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
వెక్కి వెక్కి ఏడ్చిన షారుఖ్
-
స్వీట్ వివాదంలో చిక్కుకున్న షారుక్ 'ఫ్యాన్'..!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్'. ఈ మూవీతో గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేశాడు షారుక్. అయితే 'ఫ్యాన్' మూవీ పెద్దలకు ఢిల్లీకి చెందిన ఓ మిఠాయివాలా షాకిచ్చాడు. నిర్మాతలు, హీరో షారుక్, మరికొందరికి లీగల్ నోటీసులు పంపిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వీట్ బ్రాండ్ కు సంబంధించి మూవీలో ఉన్న సీన్లు, డైలాగ్స్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే... ఫ్యాన్ మూవీలో గౌరవ్ పాత్రలో కనిపించే షారుక్ స్వీట్ బాక్స్ తీసుకుని హీరో ఆర్యన్ ఖన్నా(హీరో షారుక్)ను కలిసేందుకు వెళ్లే సీన్ గుర్తుంది కదా. ఆ స్వీట్ బాక్స్ పై 'ఘంటేవాలా' అనే పేరు కనిపిస్తుంది. ఈ స్వీట్ షాపు ఓనర్ సుశాంత్ జైన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. తన అనుమతి లేకుండా, తమను సంప్రదించకుండా తమ బ్రాండ్ ఎలా వాడుకుంటారంటూ ప్రశ్నిస్తూ యశ్‌రాజ్ ఫిల్మ్స్, ఆదిత్యా చోప్రా, దర్శకుడు మనీష్ శర్మ, రైటర్స్ హబీబ్ ఫైజల్, శరత్ కథారియా, హీరో షారుక్ ఖాన్ కు లీగల్ నోటీసులు పంపించాడు. -
ఈ ఏడాదిలో ఇదే బంపర్ రికార్డు..
షారుక్ ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్' సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విడుదలైన తొలి వారాంతంలోనే రూ.52.35 కోట్లు కలెక్ట్ చేసి.. 2016లో తొలి వీకెండ్లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రూ.44.30 కోట్ల కలెక్షన్లతో తొలి స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్ 'ఎయిర్ లిఫ్ట్' ను ఫ్యాన్ అధిగమించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 52 కోట్ల అదిరే కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆర్యన్ ఖన్నా అనే సినీ హీరోను అమితంగా అభిమానించే గౌరవ్ అనే కుర్రాడు.. కొన్ని సంఘటనల అనంతరం అతడిని ద్వేషించడం మొదలుపెడతాడు. సదరు ఫ్యాన్‌కి, సినీ హీరోకి మధ్య జరిగే కథే 'ఫ్యాన్' సినిమా. షారుక్.. ఆర్యన్గా, గౌరవ్గా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తన చిన్న కుమారుడు అబ్ రామ్ సినిమా చూస్తూ 'టూ టూ పప్పాస్' (ఇద్దరిద్దరు నాన్నలు) అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసిన విషయాన్ని మురిసిపోతూ ట్వీట్ చేశాడు కింగ్ ఖాన్. ఫ్యాన్ సృష్టిస్తున్న రికార్డులను చూసి కింగ్ ఖాన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. కాగా 2015లో సల్మాన్ 'భజరంగీ భాయ్ జాన్' రూ.102.6 కోట్ల తొలి వీకెండ్ కలెక్షన్లతో సునామీ సృష్టించగా.. ఆమిర్ 'పీకే' రూ. 95.21 కోట్ల కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. చూడబోతే ఫ్యాన్ ఈ ఏడాది భారీ వసూళ్ల లిస్ట్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. -
వాళ్ల కౌగిలింతలు మిస్సవుతున్నా!
ఫ్యాన్ సినిమా సూపర్‌హిట్ కావడంతో మంచి ఉత్సాహంగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం షూటింగులకు కాస్తంత విరామం ఇచ్చి కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే, ఇదే సమయంలో ఎవరినో మిస్సవుతున్నానని, వాళ్ల కౌగిలింతలు కూడా మిస్సవుతున్నానని కాస్తంత వాపోతున్నాడు. వాళ్లెవరన్న విషయాన్ని షారుక్ స్పష్టంగా చెప్పకపోయినా.. తన సినిమాలో నటించే హీరోయిన్లు అయి ఉంటారని అభిమానులు అంటున్నారు. హీరోయిన్లను, షూటింగులో వాళ్లిచ్చే కౌగిలింతలను మిస్సవుతున్నట్లుగా షారుక్ ట్వీట్ చేశాడని చెబుతున్నారు. ఇంతకీ షారుక్ తన ట్వీట్లో ఏం చెప్పాడో తెలుసా... ''చాలా రోజుల తర్వాత నా పిల్లలతో కలిసి కూర్చుని.. అలా టీవీ చూస్తున్నా, సంగీతం వింటున్నా. ఇంత ఆనందకరమైన సెలవు రోజున చాటింగ్ కూడా చేస్తున్నా. ఇలాంటి సెలవు కావాల్సిందే. అయితే వాళ్లను, వాళ్ల కౌగిలింతలను మాత్రం మిస్సవుతున్నా'' అని చెప్పాడు. ఇంతకీ మరి ఆ విషయం ఏమిటో గౌరీఖాన్ చూసుకోవాల్సిందే. After days sitting with my kids & just…watching tv..listening to music..chatting..heavenly day off. Needed it. Will miss them & their hugs — Shah Rukh Khan (@iamsrk) 17 April 2016 -
మొదటి రోజే రూ. 19 కోట్ల వసూళ్లు
షారుక్ ఖాన్ ఓ సినిమా హీరోగా, అభిమానిగా ద్విపాత్రాభినయం చేసిన ఫ్యాన్ సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. విడుదలైన మొదటిరోజే దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 19.20 కోట్లు వసూలుచేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. శని, ఆదివారాలు కూడా వసూళ్లు బాగుంటేనే మంచి బిజినెస్ అవుతుందని చెప్పాడు. ఈ సినిమా మొత్తం షారుక్ ఖాన్ షో లాగే నడిచిందని, బాలీవుడ్ బాద్షా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడని విమర్శకులు ప్రశంసలు గుప్పించిన విషయం తెలిసిందే. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.


