పుండరీకుడి వృత్తాంతం: తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు! | Pundarika Kapila Maharshi Moksha Funday Special Devotion Story | Sakshi
Sakshi News home page

పుండరీకుడి వృత్తాంతం: తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు!

Aug 16 2026 8:32 AM | Updated on Aug 16 2026 8:32 AM

Pundarika Kapila Maharshi Moksha Funday Special Devotion Story

భక్తి

పూర్వం పుండరీకుడు అనే మహారాజు ఒకనాడు వేటకు వెళ్లాడు. అడవిలో యథేచ్ఛగా జంతువులను వేటాడుతూ, కపిల మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అప్పటికి మిట్టమధ్యాహ్నమైంది. వేటలో పుండరీకుడు బాగా అలసిపోయాడు. కపిలుడి ఆశ్రమానికి చేరువలో ఒక సరోవరం కనిపించింది.

పుండరీకుడు ఆ సరోవరంలో నీళ్లు తాగి, దప్పిక తీర్చుకున్నాడు. ఇంతలోనే ఒక లేడికూన ఆ సమీపంలోనే పరుగుతీస్తూ కనిపించింది. వేట ఉత్సాహం తగ్గని పుండరీకుడు వెంటనే, విల్లంబులు అందుకుని, దానిని గురిచూసి బాణం విడిచాడు. బాణం తగిలిన లేడికూన గాయపడి, ఒక్క పరుగున కపిల మహర్షి ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ ప్రాణాలు విడిచింది.

ఆ దృశ్యం చూసిన కపిలుడు ఉగ్రుడయ్యాడు. ‘ఎవడా మూర్ఖుడు? ఆశ్రమ పరిసరాల్లో ఇంతటి హింసకు పాల్పడినవాడు’ అని బిగ్గరగా అరిచాడు. ఇంతలో లేడిని తరుముతూ పుండరీకుడు అక్కడకు చేరుకున్నాడు. కపిలుడి ఉగ్రరూపం చూసి, భయంతో గడగడ వణుకుతూ, ‘మునివర్యా! నా అపరాధాన్ని మన్నించండి’ అంటూ కాళ్ల మీద పడ్డాడు.

కపిలుడు కొంత శాంతించాడు. పుండరీకుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు.
కపిలుడు తీక్షణంగా పుండరీకుని చూశాడు. ‘క్షణభంగురమైన తుచ్ఛ శరీరంపై ఆశలు పెట్టుకుని, ఇంతటి పాపానికి ఒడిగట్టావే, దీనికి కారణమేమిటి? నీ విలాసం కోసం ఒక లేడికూన నిండుప్రాణాన్ని బలిగొనడం ఏమి న్యాయం?’ అని పలికి, పుండరీకుడికి వైరాగ్యబోధ చేశాడు.

కపిలుడి మాటలకు పుండరీకుడు పశ్చాత్తాపంతో దహించుకుపోయాడు. పాపిష్టి దేహాన్ని ఇక్కడే త్యాగం చేయడం మంచిదని తలచి, తన తల నరుక్కుని, ఆత్మాహుతి చేసుకోవడానికి ఒర నుంచి కత్తి దూశాడు. కపిలుడు అతడి ప్రయత్నాన్ని నివారించాడు. పుండరీకుడికి హితబోధ చేశాడు.

‘మోక్షేతి జ్ఞానం అన్యత్ర విజ్ఞానం’ అని పలికి, ‘రాజా! మానవునకు మోక్షమే పరమావధి. మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదానఫలం వల్ల కలిగే సంపదలు క్షణికమైనవని, పరహింసాపరాయణత్వం పాపహేతువని తెలుసుకుని, గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారానే తత్త్వాన్ని తెలుసుకుని, ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించాలి’ అని బోధించి, రాజధానికి వెళ్లి రమ్మని చెప్పి సాగనంపాడు.

రాజధానికి తిరిగి వెళ్లినా, పుండరీకుడి మనసు మనసులో లేదు. తన శరాఘాతంలో మరణించిన లేడికూన, ఆ తర్వాత కపిల మహర్షి చేసిన ఉద్బోధ అతడి మనసులో మెదలసాగాయి. రాజ్యపాలనపై దృష్టిపెట్టడం అతడి దుస్సాధ్యంగా మారింది. వ్యాకులచిత్తుడైన పుండరీకుడు తన రాణికి, మంత్రులకు సైతం చెప్పకుండా, అన్నీ విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరాడు.
కొద్దిరోజుల్లోనే పుండరీకుడు కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.
కపిలుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన వెంటనే, అతడికి నమస్కరించాడు.
‘మహర్షీ! నా రాజ్యాన్ని, సర్వసంపదలను విడిచిపెట్టి మీ చెంతకు వచ్చాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి, అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు.

కపిలుడు అతడిని కన్నెత్తి చూడక, పన్నెత్తి పలుకరించక తృణీకరించాడు.
అయినా, పుండరీకుడు అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఆశ్రమ ప్రాంగణంలోనే కూర్చుని, ధ్యానం చేయడం ప్రారంభించాడు. పద్నాలుగు రోజులు అలాగే అన్నపానాదులు లేకుండా, ధ్యానంలో ఉన్నాడు. అతడి పరిస్థితి చూసి, కపిలుడి మనసు కరిగింది.
శిష్య సమేతంగా పుండరీకుడి వద్దకు వెళ్లి, అతడిని పలకరించాడు.

పుండరీకుడు కన్నీళ్లతో కపిలుడికి నమస్కరించాడు. తనను అనుగ్రహించాలని ప్రార్థించాడు.
కపిలుడు అతడికి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించాడు.
పుండరీకుడు కపిలుడినే గురువుగా భావించి, అతడు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తూ, చిరకాలం తపస్సు కొనసాగించాడు.
పుండరీకుడి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు అతడికి ప్రత్యక్షమయ్యాడు.
పుండరీకుడు కోరుకున్నట్లుగానే అతడికి మోక్షాన్ని అనుగ్రహించాడు.
- సాంఖ్యాయన

పురావిశేషం..
శ్రావణమాసంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఇవి చాలామందికి తెలిసిన ఆచారాలే! కొంకణ ప్రాంతంలో శ్రావణమాసంలో ‘చుడీపూజ’ పేరుతో గాజుల పూజ చేస్తారు. తులసికోట వద్ద గాజులు, పువ్వులు, పండ్లు ఉంచి పూజ జరిపి, మహిళలకు ఫలతాంబూలాలతో పాటు గాజులను కూడా పంచిపెడతారు. శ్రావణమాసంలో శుక్రవారం, ఆదివారం రోజుల్లో తులసికోటకు, సూర్యుడిని పూజించి, మహిళలకు గాజులు కానుకగా ఇస్తారు. ఇవే రోజుల్లో కొందరు ‘దేవీసాధన’ పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement