breaking news
Himalayan hills
-
హిమానీనదీ విలయంపై ఐరాస సంచలన హెచ్చరిక!
న్యూఢిల్లీ: హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో సంభవించే హిమానీనదీ సరస్సుల విస్ఫోటన వరదల వల్ల సంభవించిన మరణాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆరు దేశాల నిపుణులు రూపొందించిన ‘హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్ఫోటన వరద ముప్పు, నిర్వహణ వ్యూహాలు, అనుసరణ లోపాలు’ అనే నివేదిక 1835 నుండి 2025 వరకు గల గణాంకాలను విశ్లేషించింది.ఈ అధ్యయనం ప్రకారం, హిందూకుష్ హిమాలయ పరిధిలోని 8 దేశాల్లో సంభవించిన వరదల ఘటనల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 199, పాకిస్థాన్‌లో 152, భారత్‌లో 62, నేపాల్‌లో 58 ఘటనలు నమోదయ్యాయి. అయితే, ప్రాణనష్టం విషయంలో భారత్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంది. భారత్‌లో అత్యధికంగా 6,119 మంది మరణించగా, పాకిస్థాన్‌లో 1,991, చైనాలో 625 మరణాలు సంభవించాయి. ప్రజల నిర్వాసితుల సంఖ్యలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది.1950 తర్వాత వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మిక వరదల తీవ్రత గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 1950కి ముందుతో పోలిస్తే దశాబ్దానికి సగటున 34 ఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 50 శాతం విస్ఫోటనాలకు మంచు చరియలు విరిగిపడటం, 25 శాతం ఘటనలకు భారీ వర్షాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దాదాపు 70 శాతం ఘటనలు వేసవి, వర్షాకాలంలోనే సంభవించాయి. పర్వత లోయల్లోని రాళ్ల వ్యర్థాలు, మంచు ఆనకట్టల వెనుక ఏర్పడే సరస్సులలో నీటి మట్టం పెరిగి సహజ ఆనకట్టలు తెగిపోవడమే ఈ విపత్తుకు కారణం. భారత్‌లో ముందస్తు రక్షణ చర్యలు, సన్నద్ధత సరిపోకపోవడం వల్లే ఘటనలు తక్కువైనా మరణాల సంఖ్య భారీగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2023 తీస్తా వరదలు, 2025 చమోలీ ఘటనల నుండి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రాణనష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య -
నేపాల్‌లో ఆగని మృత్యుఘోష
కఠ్మాండు/బీజింగ్: సుందర హిమాలయ దేశం నేపాల్‌లో మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఆకస్మిక వరదల ధాటికి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 579కు చేరింది. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. భోటెకోశి నదీ ప్రాంతంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో మరోసారి వరదలు వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుధవారం ఆకస్మిక వరద సంభవించిన చోటే బురదతో కూడిన నీటి మట్టం పెరిగిందని, ఇక్కడ మళ్లీ వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భోటెకోశి, త్రిశూలి ప్రాంతాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం ఎదురైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. రసువా, సెంట్రల్ నేపాల్‌లోని ఇతర ప్రాంతాలను బుధవారం ముంచెత్తిన భారీ ఆకస్మిక వరదల కారణంగా వందల మంది మరణించడంతో పాటు భారీగా నివాస ప్రాంతాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.ఎనిమిది జిల్లాల్లో ఇప్పటిదాకా 579 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. వేలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరావడం లేదు. నవల్పరాసి ఈస్ట్‌లో 154, చిత్వాన్‌లో 233, గోర్ఖాలో 46, నువాకోట్‌లో 37 మృతదేహాలను వెలికితీశారు. అలాగే ధాడింగ్‌లో 40, తానాహులో 30, నవల్పరాసి వెస్ట్‌లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు. టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని గిరోంగ్ కౌంటీలో ఐదుగురు మరణించారు. వరదలు సంభవించినప్పటి నుంచి 86 మంది భద్రతా సిబ్బంది, 517 మంది విదేశీ పర్యాటకులు, 127 మంది నేపాలీ ప్రయాణికులతో సహా కనీసం 1,924 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు వివిధ ప్రభావిత ప్రాంతాల నుంచి 4,451 మందిని రక్షించారు. వీరిలో 85 మంది భారతీయులతో సహా మొత్తం 129 మంది విదేశీయులు, అలాగే వివిధ జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకుపోయిన 191 మంది ఉన్నారు. గాయపడిన 101 మంది రాజధాని కఠ్మాండులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తమ వారి కోసం ఆసుపత్రుల్లో వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించాం వరద ప్రభావిత ప్రాంతాల నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 85 మంది భారతీయులు, 9 మంది దక్షిణ కొరియన్లు, 16 మంది చైనా పౌరులతో సహా మొత్తం 121 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్లు నేపాల్ పర్యాటక బోర్డు ప్రకటించింది. గాలింపు, సహాయక చర్యలు మూడో రోజు మరింత ముమ్మరంగా కొనసాగాయని, ఇందులో 2,391 మంది నేపాల్ సైనిక సిబ్బందితో సహా మొత్తం 7,451 మంది భద్రతా సిబ్బంది భాగస్వాములయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. బాధితులను తరలించడానికి హెలికాప్టర్లను ఉపయోగించగా, భూతల బృందాలు నదీ తీరాల్లో, దిగువన ఉన్న నివాస ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చడానికి తగినంత స్థలం లేకపోవడం సమస్యగా మారింది. విపత్తు సహాయ నిధికి తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా, ఆయన మంత్రివర్గ సభ్యులు నిర్ణయించారు. ఆకస్మిక వరదల వల్ల నష్టపోయిన పౌరులు, వ్యాపార సంస్థల కోసం సహాయం, రాయితీతో కూడిన పునరావాస ప్యాకేజీని రూపొందించాలని మంత్రివర్గం ఆర్థిక శాఖను ఆదేశించింది. గిరోంగ్ కౌంటీ నుంచి వెయ్యి మంది తరలింపు టిబెట్–నేపాల్ సరిహద్దు సమీపంలోని గిరోంగ్ కౌంటీ నుంచి 555 మంది పర్యాటకులతో సహా 1,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం అక్కడ పర్యాటకులెవరూ లేరని చెప్పారు. చైనా వైపున ఉన్న ఓడరేవుకు వెళ్లే రహదారులు ఆకస్మిక వరదల వల్ల తెగిపోయాయి. దీనివల్ల సమాచార వ్యవస్థలు, విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. మరో 10 టన్నుల సహాయక సామగ్రి వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మూడో విడత కింద 10 టన్నుల సహాయక సామగ్రిని, 11 మంది సభ్యులతో కూడిన వైద్యులు, పారామెడిక్స్ బృందాన్ని, అలాగే సొరంగంలో సహాయక చర్యలను అంచనా వేసే బృందాన్ని భారత్ శుక్రవారం పంపించింది. ఇందులో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక, రక్షణ చర్యలకు భారత్ మద్దతును కొనసాగిస్తోందని పేర్కొన్నారు. బుధవారం 10 టన్నుల మానవతా సహాయం, విపత్తు సహాయక సామగ్రిని, గురువారం మరో 37.5 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు భారత్ పంపింది. నేపాల్‌కు అన్ని విధాలా సహాయం అందిస్తామని భారత ప్రధాని మోదీ ఇప్పటికే భరోసా ఇచ్చారు. 320 మంది భారతీయులు మిస్సింగ్ నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా కనీసం 320 మంది భారతీయులు గల్లంతయ్యారని, మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారని, వారంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్ సాధ్యమైనంత సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. చైనా వైపు చిక్కుకుపోయిన 96 మంది భారతీయులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్‌కు చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 21 మంది తమిళనాడు వాసులను ఢిల్లీకి చేర్చినట్లు చెప్పారు. వీరికి ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వాగతం పలికారు. ఈ 21 మంది కైలాస మానసరోవర్ యాత్ర వెళ్లి వరదల్లో చిక్కుకోగా నేపాల్ సైన్యం రక్షించింది. ఎస్.జైశంకర్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నేపాల్‌లో గల్లంతైన భారతీయుల ఆచూకీ సాధ్యమైనంత త్వరగా గుర్తించాలని ఆదేశించారు. -
వందల అస్థిపంజరాల వెనుక అసలు కథేంటి?
అది 1942 సంవత్సరం... రెండో ప్రపంచ యుద్ధ సమయం...సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉన్న అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌లోని రూప్‌కుండ్ ప్రాంతం. గడ్డకట్టే చలి– చుట్టూ తెల్లటి మంచు పర్వతాలు– ఆ కొండల నడుమ ఒక చిన్న సరస్సు– ప్రకృతి అందం అంతా అక్కడే ఉందా అని పరవశించేంత సోయగం ఆ ప్రాంతం సొంతం. ‘నందాదేవి అభయారణ్యం’ ఫారెస్ట్ రేంజర్ హరికిషన్ మధ్వాల్ రోజువారీ విధుల్లో భాగంగా పరిసరాలను పరిశీలిస్తున్నారు. వేసవి కాలం కావడం వల్ల సరస్సులోని మంచు కొద్దికొద్దిగా కరుగుతోంది.అలా చూస్తూ వెళ్తున్న హరికిషన్‌కు సరస్సులో నుంచి తెల్లగా మెరుస్తున్న వస్తువు ఒకటి బాగా ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూశారు. అక్కడి దృశ్యం చూడగానే కాళ్లూ చేతులూ వణికిపోయి, అంతటి చలిలోనూ ముచ్చెమటలు పట్టేశాయ్. సరస్సు అంచున, నీటి లోపల వందలాది మానవ కంకాళాలు, కపాలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంచు వాతావరణం వల్ల కొన్ని శవాలకు ఇంకా మాంసం, జుట్టు కూడా అలాగే ఉండిపోయాయి.సరస్సులో కేవలం అస్థిపంజరాలే కాదు, మంచు తీవ్రత వల్ల వందల ఏళ్లు గడిచినా చెడిపోకుండా భద్రంగా ఉన్న కొన్ని అద్భుతమైన పురాతన వస్తువులను కూడా గుర్తించారు. చనిపోయిన వారు ధరించిన తోలు చెప్పులు, బూట్లు, ఉన్ని దుస్తుల ముక్కలు గడ్డకట్టిన మంచు వల్ల అలాగే ఉండిపోయాయి. మహిళలు ధరించిన గాజులు, వెండి, రాగి నగలు లభించాయి. రక్షణ లేదా వేట కోసం ఉపయోగించిన ఇనుప ఈటెలు, కత్తుల ముక్కలు, బాణాలు కూడా దొరికాయి.కొండలు ఎక్కడానికి వారు ఉపయోగించిన గట్టి వెదురు కర్రల ముక్కలు కూడా బయటపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వార్త వినగానే ఉలిక్కిపడింది. ఆ సమయంలో భారతదేశంపై దాడి చేయడానికి రహస్యంగా వస్తున్న జపాన్ సైనికుల బృందం ఏమైనా ఇక్కడ చనిపోయిందా? అని అనుమానించింది. వెంటనే సైనిక నిపుణులు రంగంలోకి దిగి ఆ ఎముకలను పరీక్షించారు. అవి దాదాపు 600 నుంచి 800 మందివి అయి ఉండొచ్చని అంచనాకు వచ్చారు. కానీ, అవి ఇటీవలివి కావని, శతాబ్దాల క్రితం నాటివని పరీక్షల్లో తేలడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల దృష్టి ఈ ‘అస్థిపంజరాల సరస్సు’పై పడింది.ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీతోపాటు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యాధునిక డీఎన్ఏ, కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు. అందులో తేలిన విషయాలు పరిశోధకులను నివ్వెరపరచాయి. వారంతా ఒకేసారి చనిపోలేదని, ఎక్కువ శాతం మంది క్రీ.శ. 800 ప్రాంతంలో (1200 ఏళ్ల క్రితం) చనిపోగా.. కొంతమంది క్రీ.శ. 1800 (226 ఏళ్ల క్రితం) ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు.మరింత విచిత్రం ఏమిటంటే, అక్కడ దొరికిన పుర్రెలు, ఎముకలపై ఎలాంటి కత్తుల గాయాలు కానీ, బుల్లెట్ గుర్తులు కానీ లేవు. అంటే అక్కడ ఎలాంటి యుద్ధం జరగలేదు. మరి అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? ఎముకల తీరును పరిశీలించిన నిపుణులు ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఆ పుర్రెల పైభాగంలో లోతైన ఫ్రాక్చర్లు ఉన్నాయి. అంటే తలపై గట్టి వస్తువు ఏదో బలంగా తాకడం వల్లే వారు చనిపోయినట్టు నిర్ధారించారు.ఆ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన నందాదేవి యాత్రకు వెళ్తున్న బృందంలోని వారివే ఆ మృతదేహాలు అయి ఉంటాయని అంచనా వేశారు. అకస్మాత్తుగా వచ్చిన భయంకరమైన తుఫానులో భారీ వడగళ్లు ఆకాశం నుంచి బాంబుల్లా కురిసి ఉండొచ్చని, తల దాచుకోవడానికి చెట్లు కూడా లేని ఆ గుట్టలపై, ఆ వడగళ్ల దెబ్బలకు తాళలేక వారంతా అక్కడికక్కడే ప్రాణాలు విడిచి ఉండొచ్చని భావించారు.డీఎన్ఏ పరీక్షల్లో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అక్కడ చనిపోయిన వారిలో మన భారతీయులతో పాటు వేల మైళ్ల దూరంలో ఉన్న తూర్పు మధ్యధరా ప్రాంతానికి (గ్రీస్, క్రేట్ దీవుల పరిసరాలు) చెందిన ప్రజల డీఎన్ఏ కూడా ఉండటంతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అసలు 1800ల కాలంలో అక్కడి ప్రజలు అంత ఎత్తైన హిమాలయ పర్వతాల పైకి ఎందుకు వచ్చారు? ఎలా చనిపోయారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.రూప్‌కుండ్ చుట్టుపక్కల గ్రామాల్లో శతాబ్దాలుగా ఒక జానపద కథ ప్రచారంలో ఉంది. కన్నౌజ్ దేశానికి చెందిన రాజా జస్ధవాల్, తన గర్భిణి భార్య రాణి బాలాంపాతో కలిసి నందాదేవి యాత్రకు వెళ్లారు. అయితే యాత్ర నియమాలను ఉల్లంఘించి.. వారు సంగీత నృత్యాలతో, ఆడంబరాలతో ఆ పవిత్ర పర్వతాలపై ప్రయాణించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన నందాదేవి... ఇనుప గుండ్ల లాంటి వడగళ్ల వానను కురిపించి రాజును, అతని సైన్యాన్ని సర్వనాశనం చేసిందని స్థానికులు నమ్ముతారు.రూప్‌కుండ్ సరస్సు కేవలం ఒక మిస్టరీ మాత్రమే కాదు, అదొక ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతం కూడా. ట్రెక్కర్లు ఇప్పటికీ అక్కడికి వెళ్లినప్పుడు సరస్సు చుట్టూ ఎముకలు కనిపిస్తుంటాయి. అయితే, చాలామంది పర్యాటకులు ఆ పురాతన అస్థిపంజరాలను నాశనం చేయడం లేదా లగేజీల్లో దొంగిలించుకుపోతుండటం వల్ల ఈ చారిత్రక సంపద క్రమంగా కనుమరుగవుతోంది.ఎముకలు కొరికే చలిలో, మంచుకొండల మధ్య పడి ఉన్న ఆ అస్థిపంజరాలు... సహజ విపత్తుకు సాక్ష్యాలా లేక ఇంకా ఛేదించని చరిత్రకు ఆనవాళ్లా? సై న్స్ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నా.. రూప్‌కుండ్ సరస్సు రహస్యం ఇప్పటికీ మానవాళికి అంతుచిక్కని మిస్టరీనే!- సత్యకిశోర్ -
ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..
నూట నలభై ఆరు సంవత్సరాల డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (డీహెచ్ఆర్) చరిత్రలో తొలి మహిళా టికెట్ కలెక్టర్ (టీసి)గా సరితా యోల్మో చరిత్ర సృష్టించింది. ప్లస్ టు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం రావడంతో పై చదువులు చదువుకోలేకపోయింది సరిత. ఆమె భర్త దవా యోల్మో కూడా రైల్వేలో పనిచేసేవారు. ఆయన సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యారు.‘సరిత అంకితభావం ఉన్న ఉద్యోగి మాత్రమే కాదు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను ఎలా సమన్వయం చేసుకోవాలో బాగా తెలిసిన మహిళ. డీహెచ్‌ఆర్‌లో ఫస్ట్ ఉమెన్ ట్రైయిన్ టికెట్ కలెక్టర్‌గా సరితను చూడడం గర్వంగా ఉంది’ అంటున్నాడు దవా యోల్మో.న్యూ జల్పైగురి నుండి నడిచే బ్రాడ్–గేజ్ రైళ్లలోటికెట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది సరిత.‘డీహెచ్‌ఆర్‌లో టీసిగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొంత భయం కూడా ఉంది. న్యూ జల్పైగురి, డార్టిలింగ్ల మధ్య పది గంటల ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం నా ఉద్యోగ జీవితంలో కొత్త ఎపిసోడ్’ అంటుంది సరిత.టికెట్ కలెక్టర్ యూనిఫామ్‌లో ఉన్న సరితను ఆసక్తికరంగా చూస్తుంటారు ప్రయాణికులు. కొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు.‘కుర్సియాంగ్‌లోని రైల్వే ప్రెస్‌లో పనిచేయడం నాకు సంతోషంగా ఉండేది. అయితే ఆ ప్రెస్ మూసివేయడంతో విధి నాకు వేరే దారి చూపింది. న్యూ జల్పైగురికి బదిలీ కావడంతో కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వచ్చింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని వాణిజ్య విభాగంలో చేరకపోతే, నాకు కొత్త అవకాశాలు వచ్చేవి కావు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది సరిత. View this post on Instagram A post shared by The CSR Journal (@thecsrjournal) (చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..) -
హిందూ భూపలకం చీలుతోందా?
న్యూఢిల్లీ: భూఉపరితలం మాత్రమేకాదు భూ అంతర్భాగం, అందులోని పొరలు సైతం ఎంతో సంక్లిష్టతతో కూడిన ఒక అమరిక. అలాంటి అమరికలో ఇప్పుడు కొత్తతరహా మార్పులు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వతాల అడుగున హిందూ భూపలకం అత్యంత నెమ్మదిగా రెండుగా చీలుతోందని తాజా అధ్యయనం ఒకటి బహిర్గతం చేసింది. కొనల వెంట ఢీకొని, రాపిడి కారణంగా టిబెటన్ భూపలకం కిందకు హిందూ భూపలకం వెళ్తోందని అధ్యయనంలో వెల్లడైంది. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ప్రీ– ప్రింట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హిమాలయాలు, టిబెటన్ భూపలకాల తీరుతెన్నులను భూ అంతర్గత బలాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే కొత్త అంశాలను తెల్సుకునేందుకు ఈ పరిశోధన కొత్త బాటలు వేస్తోంది. హిమాలయాల ఎత్తును పెంచేస్తూ..అధ్యయనం ప్రకారం.. హిమాలయాల ఎత్తును మరింత పెంచేస్తూ ఈ హిమాలయాల దిగువన హిందూ భూపలకం వంగిపోతోంది. యూరేసియా భూపలకం, హిందూ భూపలకం ఢీకొనడం వల్లే హిమాలయాలు ఉద్భవించాయని తెల్సిందే. ఇది దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం మొదలైంది. ఇటీవల కొత్తగా త్రిమితీయ సిస్మిక్ డేటాను సేకరించి విశ్లేషించగా హిందూ భూపలకం కదలికల్లో వైరుధ్యాలను గుర్తించారు. ముఖ్యంగా 90 నుంచి 92 డిగ్రీల తూర్పు రేఖాంశం పొడవునా హిందూ భూపలకం టిబెటన్ భూపలకం కిందకు చొచ్చుకుపోతోంది. అలా వెళ్లే క్రమంలో చీలిపోతోంది. ఇది యాడోంగ్–గులు, కోనా–సాంగ్రి జోన్లో జరుగుతోంది. ఇక పశ్చిమహిమాలయా వైపు గమనిస్తే ఇక్కడ పెద్దగా ఎలాంటి మార్పు లేదు. భారత్, టిబెట్ సరిహద్దుల వెంబడి ఉండే యార్లాంగ్–జాంగ్బోకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో ఈ రెండు పొరలు కలుస్తున్నాయి. తూర్పు వైపున మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. హిందూ భూపలకంలోని దిగువ పొర అయిన లిథోస్ఫిరిక్ మాంటెల్ మరింత లోతుల్లోకి చొచ్చుకుపోతోంది. దీంతో టిబెటన్ లిథోస్ఫిరిక్ విస్తరిస్తోంది. ఈ కారణంగానే హీలియం వాయువు ఉద్గారాలు, లోతుల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజా అధ్యయనం అనేది భూపలకాల కదలికలను మాత్రమే కాదు కొత్త ప్రాంతాల్లో పర్వతాల ఆవిర్భావ అవకాశాలను వెల్లడిస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. -
అత్యంత తీవ్ర అస్థిర పరిస్థితుల్లో నేపాల్‌ను ఐక్యంగా ఉంచారు..!
న్యూఢిల్లీ: హిమాలయ రాజ్యం నేపాల్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నది. ఈ సమయంలో హుందాగా వ్యవహరించి, దేశాన్ని ఒక్క తాటిపై నడపడంలో కీలకంగా వ్యవహరించారు దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్. ఆందోళన తీవ్రతకు ప్రభుత్వ యంత్రాంగం పునాదులే కదిలిపోయాయి. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి 8న పదవి నుంచి వైదొలిగారు. దేశంలో అధికారి శూన్యత ఏర్పడింది. అల్లకల్లోలం కొనసాగుతున్న వేళ నేపాల్ ఆర్మీ ముందుకు వచ్చింది. శాంతి, భద్రతలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకుంది. శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్డెల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసను విడనాడి చర్చలకు రావాలని ఆయన యువ ఆందోళనకారులకు పిలుపునిచ్చారు. దేశ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు, దౌత్య ప్రతినిధులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడిన ఆయన.. నేపాల్ వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నేపాల్ వ్యాప్తంగా జరిగిన తీవ్ర నిరసనలు, పోలీసు కాల్పుల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో మరింత రక్తపాతాన్ని నివారించడానికి గద్దె దిగాలని ప్రధాని ఓలీకి సలహా ఇచ్చింది జనరల్ సిగ్డెల్ అని సమాచారం. రూపందేహి జిల్లాలో 1967లో జన్మించిన అశోక్ రాజ్ సిగ్డెల్ 1986లో నేపాల్ ఆర్మీలో చేరారు. ఆ తర్వాతి సంవత్సరం ఉద్యోగంలో చేరారు. ఈయన మంచి బాక్సర్ మాత్రమే కాదు తైక్వాండో, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు కూడా. 2024లో సిగ్డెల్ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా భారత ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకోవడం విశేషం.భారత్, చైనా సైనిక కార్యక్రమాలకు భాగస్వామినేపాల్లోని త్రిభువన్ వర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్న సిగ్డెల్ భారత్, చైనాల్లో జరిగిన పలు సైనిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. చైనాలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ నుంచి స్ట్రాట జిక్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అదేవిధంగా, సికింద్రాబాద్‌లో డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీ నుంచి డిఫెన్స్ మేనేజ్మెంట్ కోర్సు చదివారు. నేపాల్ సైన్యంలోని వివిధ బెటాలియన్లు, బ్రిగేడ్లు, డివిజ న్లకు నాయకత్వం వహించారు. 2023లో లెఫ్టినెంట్ జనరల్‌గా పదో న్నతి పొందిన సిగ్డెల్ ఆర్మీ స్టాప్ వైస్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2024లో ఆర్మీ 45వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో భారత్‌కు అధికారిక పర్యటనకు వచ్చిన సిగ్డెల్‌ను రాష్ట్రపతి ముర్ము భారత్ ఆర్మీ గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. నేపాల్, భారత్‌లు తమ మధ్య కొనసాగుతున్న సన్నిహిత సంబంధాలకు గుర్తుగా ఆర్మీ చీఫ్‌లకు గౌరవ జనరల్ హోదా ప్రదానం చేయడమనే ఆనవాయితీ 1950నుంచి కొనసాగుతూ వస్తోంది. -
Himalayan Glaciers: హిమాలయాల నుంచి పొంచి ఉన్న భారీ ముప్పు
-
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
త్వరలో కీలక నిర్ణయం?
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో తమ సత్తా చాటేందుకు అగ్ర హీరోలు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ఆరంగ్రేటం గురించి క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్ నేడో.. రేపో... పార్టీపై ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో రజనీ హిమాలయాలకు వెళ్లటం తెలిసిందే. అక్కడ కొన్ని రోజులు ధ్యానంలో మునిగిపోయాక తిరిగి వచ్చి కీలక నిర్ణయాలు తీసుకోవటం తలైవాకు పరిపాటే. అయితే అనారోగ్య కారణాల రీత్యా గత కొన్నేళ్లుగా ఆయన ఆ పని చేయటం లేదు. తిరిగి కాలా చిత్రం షూటింగ్ తర్వాత రజనీ తిరిగి అక్కడికే వెళ్లబోతున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకునేందుకే ఆయన హిమాలయాలకు వెళ్లబోతున్నాడని తమిళనాట చర్చించుకుంటున్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని రజనీ గతంలో అభిమానుల సమక్షంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దైవ ధ్యానం తర్వాతే రజనీ రాజకీయ ఆరంగ్రేటంపై స్పష్టత ఇవ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆచరణే అసలు పాఠం!
కాలిఫోర్నియాలో స్వామీ రామా అనే ఉత్తర హిందుస్థానీయుడు, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అనే సంస్థను నడిపాడు. హిమాలయాల్లో యోగిగా జీవిస్తూ, గురువువద్ద చాలా కఠినమైన శిక్షణ పొందాడు. ఆ శిక్షణలో తాను పొందిన అనుభవాలను, వాటినుంచి తాను నేర్చుకున్న అంశాలను ఆయన చెప్పారు. ఒకసారి స్వామీ రామాతో గురువు ‘ఆకాశం వంక చూస్తూ నడువు’ అన్నాడు. ‘అదేమిటి అలా అంటారు? ఆకాశం వంక చూస్తూ నడుస్తూంటే తడబడి కింద పడనా?’ అని అన్నాడు రామా. ‘అయితే, తల దించుకుని నడువు. అప్పుడు తడబడాల్సిన అవసరం లేకుండా నడవవచ్చు. ప్రమాదభరిత యాత్రలో ముందుకు సాగడానికి నీవు నమ్రత కలిగివుండాలి. నమ్రత లేకపోతే ఏమీ నేర్వలేవు. నీ ఎదుగుదల అక్కడికక్కడే ఆగిపోతుంది’ అని గురువు చెప్పారు. హిమాలయ కొండల్లో రోజుకొకసారే భోజనం అంటారు స్వామీ రామా. ఒక్క చపాతీ, కాసిని కూరముక్కలు, ఓ కప్పు పాలు. ‘నేను అన్నానికి కూచొని ప్రారంభించబోతుండగా మా గురువు వచ్చి నాతో ఇలా అన్నారు: ‘వృద్ధుడైన ఓ స్వామి వచ్చారు. ఆకలిగొని ఉన్నాడు. నీ ఆహారం అతడికివ్వాల్సి ఉంటుంది’. ‘నేనూ ఆకలిగానే ఉన్నాను. ఇది వదులుకున్నానంటే, రేపటిదాకా నాకింకేమీ ఉండదు. అందువల్ల ఇవ్వలేను’ అన్నాను. ‘ఆ కాస్తకూ చచ్చిపోవులే. అతడికిచ్చెయ్. ఇచ్చేటపుడు ఇప్పటి ఈ మనసుతోకాక, నీ ప్రేమ కానుకగా ఇవ్వు’ అన్నాడు. ‘నేను ఆకలితో ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని ఇంకొకరికి ప్రేమ కానుకగా ఎలా ఇవ్వను?’ అన్నాను. ఎంత చెప్పినా నేను వినకపోయేసరికి, ‘నిన్నిలా చేయమని ఆజ్ఞాపిస్తున్నాను!’ అన్నారు మా గురువు. వచ్చిన వృద్ధుడి గడ్డం తెల్లగా ఉంది. కాళ్లకి పావుకోళ్లు, కంబళీ, చేతికర్రతో కనిపించాడు. కొండల్లో ఒంటరిగా తిరుగుతున్నాడట. ‘మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కుర్రవాణ్ణి ఆశీర్వదించండి’ అన్నారు గురువు. ‘అతడికి మంచినీళ్లిచ్చి, నీళ్లతో కాళ్లుకడుగు’ అన్నాడు నా గురువు. నాకిష్టం లేకపోయినా ఆయన చెప్పినట్లు చేశాను. దాని అర్థమేమిటో అప్పటికి నాకు తెలియలేదు. ఆయన్ని కూర్చోబెట్టి నేను తినబోయిన ఆహారం అతనికి పెట్టాను. అతడు నాలుగురోజులుగా ఆహారం లేకుండా ఉండిపోయిన సంగతి తర్వాత తెలిసింది. అతడు ఆహారం పుచ్చుకున్న తర్వాత ఇలా అన్నాడు, ‘భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఆహారం నీ ముందుకువచ్చినప్పుడు తప్పితే జీవితంలో నువ్వెన్నడూ ఆకలిగొనకుందువుగాక, ఇదీ నా దీవెన’ అన్నాడు. ఆ దీవెన ఫలించింది. ‘అతడి కంఠస్వరం ఈ నాటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆనాటినుంచీ కోరికలతో సతమతమయ్యే నా తత్వంనుంచి విముక్తి చెందాను’ అంటాడు స్వామీ రామా. - నీలంరాజు లక్ష్మీప్రసాద్


