
ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ ఘనత
భారత్‌లో శిక్షణ పొందిన అధికారి
న్యూఢిల్లీ: హిమాలయ రాజ్యం నేపాల్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నది. ఈ సమయంలో హుందాగా వ్యవహరించి, దేశాన్ని ఒక్క తాటిపై నడపడంలో కీలకంగా వ్యవహరించారు దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్. ఆందోళన తీవ్రతకు ప్రభుత్వ యంత్రాంగం పునాదులే కదిలిపోయాయి. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి 8న పదవి నుంచి వైదొలిగారు. దేశంలో అధికారి శూన్యత ఏర్పడింది.
అల్లకల్లోలం కొనసాగుతున్న వేళ నేపాల్ ఆర్మీ ముందుకు వచ్చింది. శాంతి, భద్రతలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకుంది. శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్డెల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హింసను విడనాడి చర్చలకు రావాలని ఆయన యువ ఆందోళనకారులకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకు, దౌత్య ప్రతినిధులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడిన ఆయన.. నేపాల్ వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నేపాల్ వ్యాప్తంగా జరిగిన తీవ్ర నిరసనలు, పోలీసు కాల్పుల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఈ సమయంలో మరింత రక్తపాతాన్ని నివారించడానికి గద్దె దిగాలని ప్రధాని ఓలీకి సలహా ఇచ్చింది జనరల్ సిగ్డెల్ అని సమాచారం. రూపందేహి జిల్లాలో 1967లో జన్మించిన అశోక్ రాజ్ సిగ్డెల్ 1986లో నేపాల్ ఆర్మీలో చేరారు. ఆ తర్వాతి సంవత్సరం ఉద్యోగంలో చేరారు. ఈయన మంచి బాక్సర్ మాత్రమే కాదు తైక్వాండో, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు కూడా. 2024లో సిగ్డెల్ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా భారత ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకోవడం విశేషం.
భారత్, చైనా సైనిక కార్యక్రమాలకు భాగస్వామి
నేపాల్‌లోని త్రిభువన్ వర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్న సిగ్డెల్ భారత్, చైనాల్లో జరిగిన పలు సైనిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. చైనాలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ నుంచి స్ట్రాట జిక్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అదేవిధంగా, సికింద్రాబాద్‌లో డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీ నుంచి డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివారు. నేపాల్ సైన్యంలోని వివిధ బెటాలియన్లు, బ్రిగేడ్లు, డివిజ న్లకు నాయకత్వం వహించారు.
2023లో లెఫ్టినెంట్ జనరల్‌గా పదో న్నతి పొందిన సిగ్డెల్ ఆర్మీ స్టాప్ వైస్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2024లో ఆర్మీ 45వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024లో భారత్‌కు అధికారిక పర్యటనకు వచ్చిన సిగ్డెల్‌ను రాష్ట్రపతి ముర్ము భారత్ ఆర్మీ గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. నేపాల్, భారత్‌లు తమ మధ్య కొనసాగుతున్న సన్నిహిత సంబంధాలకు గుర్తుగా ఆర్మీ చీఫ్‌లకు గౌరవ జనరల్ హోదా ప్రదానం చేయడమనే ఆనవాయితీ 1950నుంచి కొనసాగుతూ వస్తోంది.