తాజా భూకంపాలకు ఇదే కారణమా?
అవుననే సమాధానమిస్తున్న తాజా అధ్యయనం
న్యూఢిల్లీ: భూఉపరితలం మాత్రమేకాదు భూ అంతర్భాగం, అందులోని పొరలు సైతం ఎంతో సంక్లిష్టతతో కూడిన ఒక అమరిక. అలాంటి అమరికలో ఇప్పుడు కొత్తతరహా మార్పులు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హిమాలయ పర్వతాల అడుగున హిందూ భూపలకం అత్యంత నెమ్మదిగా రెండుగా చీలుతోందని తాజా అధ్యయనం ఒకటి బహిర్గతం చేసింది.
కొనల వెంట ఢీకొని, రాపిడి కారణంగా టిబెటన్ భూపలకం కిందకు హిందూ భూపలకం వెళ్తోందని అధ్యయనంలో వెల్లడైంది. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ప్రీ– ప్రింట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హిమాలయాలు, టిబెటన్ భూపలకాల తీరుతెన్నులను భూ అంతర్గత బలాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే కొత్త అంశాలను తెల్సుకునేందుకు ఈ పరిశోధన కొత్త బాటలు వేస్తోంది.
హిమాలయాల ఎత్తును పెంచేస్తూ..
అధ్యయనం ప్రకారం.. హిమాలయాల ఎత్తును మరింత పెంచేస్తూ ఈ హిమాలయాల దిగువన హిందూ భూపలకం వంగిపోతోంది. యూరేసియా భూపలకం, హిందూ భూపలకం ఢీకొనడం వల్లే హిమాలయాలు ఉద్భవించాయని తెల్సిందే. ఇది దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం మొదలైంది. ఇటీవల కొత్తగా త్రిమితీయ సిస్మిక్ డేటాను సేకరించి విశ్లేషించగా హిందూ భూపలకం కదలికల్లో వైరుధ్యాలను గుర్తించారు. ముఖ్యంగా 90 నుంచి 92 డిగ్రీల తూర్పు రేఖాంశం పొడవునా హిందూ భూపలకం టిబెటన్ భూపలకం కిందకు చొచ్చుకుపోతోంది. అలా వెళ్లే క్రమంలో చీలిపోతోంది. ఇది యాడోంగ్–గులు, కోనా–సాంగ్రి జోన్‌లో జరుగుతోంది.
ఇక పశ్చిమహిమాలయా వైపు గమనిస్తే ఇక్కడ పెద్దగా ఎలాంటి మార్పు లేదు. భారత్, టిబెట్ సరిహద్దుల వెంబడి ఉండే యార్లాంగ్–జాంగ్బోకు ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో ఈ రెండు పొరలు కలుస్తున్నాయి. తూర్పు వైపున మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. హిందూ భూపలకంలోని దిగువ పొర అయిన లిథోస్ఫిరిక్ మాంటెల్ మరింత లోతుల్లోకి చొచ్చుకుపోతోంది. దీంతో టిబెటన్ లిథోస్ఫిరిక్ విస్తరిస్తోంది. ఈ కారణంగానే హీలియం వాయువు ఉద్గారాలు, లోతుల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజా అధ్యయనం అనేది భూపలకాల కదలికలను మాత్రమే కాదు కొత్త ప్రాంతాల్లో పర్వతాల ఆవిర్భావ అవకాశాలను వెల్లడిస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు.


