విద్యుత్ స్తంభం ఎక్కి.. కనెక్షన్లు తొలగించి
అప్రకటిత కోతలపై వినూత్న నిరసన
ప్రజల కష్టాలు అధికారులకు తెలియాలంటే, వాళ్లు కూడా అదే కష్టాన్ని అనుభవించాలి.. ఇదే సూత్రాన్ని నమ్మారు ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జతి. తన నియోజకవర్గంలో గంటల తరబడి విధిస్తున్న విద్యుత్ కోతలపై ఆయన విసిగిపోయారు. దీంతో ఆయన, ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కి అధికారుల ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించి సంచలనం సృష్టించారు.
నిచ్చెన, కటింగ్ ప్లేయర్లతో బయల్దేరి..
మంగళవారం హరిద్వార్ జిల్లా రూరీ్కలో ఈ హైడ్రామా చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి నిచ్చెన, కటింగ్ ప్లేయర్లు పట్టుకుని నేరుగా విద్యుత్ శాఖ అధికారుల నివాసాలకు చేరుకున్నారు. మొదట సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ రాజ్‌పుత్ ఇంటి బయట ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి కనెక్షన్‌ను తొలగించారు. ఆ తర్వాత ఏకంగా చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండేల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
మీకు గంట.. మాకు 8 గంటలా?
‘మా ప్రాంతంలో రోజుకు ఐదు నుండి ఎనిమిది గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు, వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. పది రోజులుగా మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కేవలం గంటసేపు విద్యుత్ లేకపోతేనే అధికారులకు చెమటలు పడుతున్నాయి.. మరి గంటల తరబడి విద్యుత్ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి?’.. అని వీరేంద్ర జతి ఘాటుగా ప్రశ్నించారు.
ఎమ్మెల్యేపై విద్యుత్ శాఖ ఫిర్యాదు
ఎమ్మెల్యే చర్యపై విద్యుత్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు ’షట్‌డౌన్’ తీసుకోకుండా విద్యుత్ తీగలు కట్ చేయ డం వల్ల పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇది ప్రభుత్వ పనిలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపిస్తూ రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధి స్వయంగా విద్యుత్ స్తంభమెక్కి నిరసన తెలపడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు ఏసీ గదుల నుంచి బయటికొచ్చి ప్రజల కష్టాలను చూడాలని నెటిజన్లు ఎమ్మెల్యే చర్యను సమర్థిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


