8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే | dowry incident In karnataka | Sakshi
Sakshi News home page

8 కేజీలకు పైగా బంగారమిచ్చినా కట్న వేధింపులే

Feb 11 2026 10:13 AM | Updated on Feb 11 2026 10:13 AM

dowry incident In karnataka

భర్త, అత్తమామలపై నవ వివాహిత ఫిర్యాదు  

నిందితులకు కటకటాలు  

సింధనూరులో సంచలనం

రాయచూరు( కర్ణాటక ): కేజీల కొద్దీ బంగారం, లక్షల రూపాయల డబ్బు తీసుకుని పెళ్లి చేసుకున్న తరువాత కూడా మరింత కట్నం తేవాలని వేధిస్తున్న ధనదాహపు భర్త, అత్తమామల ఉదంతమిది. నవ వివాహితను వేధిస్తున్న కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు. ఈ విషయంపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరారెడ్డి వివరాలను వెల్లడించారు.  

కళ్లుచెదిరే కట్న కానుకలు.. 
జిల్లాలోని సింధనూరులోని రామ్‌ కిశోర్‌ కాలనీలో నివాసముంటున్న సూర్యబాబు కుమార్తెకు బళ్లారి జిల్లా కృష్ణా నగర క్యాంప్‌ నివాసి ఆలపాటి కృష్ణ చైతన్యతో గత ఏడాది జూన్‌ 7న వివాహమైంది. కృష్ణచైతన్య బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో కృష్ణ చైతన్యకు అక్షరాలా 8.5 కేజీల బంగారం, 4.5 కేజీల వెండి, రూ.6 లక్షల నగదు, రూ.8 లక్షలు దుస్తులకు, రూ.15 లక్షలు విలువ చేసే కారు, వంట సామగ్రి కోసం రూ.3 లక్షలు, కుటుంబ సభ్యుల ఖర్చులకు రూ.15 లక్షలు ఇచ్చి అత్యంత ఆర్భాటంగా పెళ్లివేడుకను జరిపించారు.  

నవంబరు నుంచి నరకం 
అయితే నవంబర్‌ నెలలో మరింత కట్నం తేవాలని భర్త, అత్తమామలు, అతని అక్క, బావ, మరిది తదితరులు నవ వధువును చిత్రహింసలు పెట్టసాగారు. ఇది తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసి ఉంటోంది. పుట్టింటి నుంచి ఆస్తిలో సగ భాగం తెచ్చేవరకు ఇంటికి రావద్దంటూ భర్త హుకుం జారీ చేశాడని సీఐ తెలిపారు. వారి సతాయింపులను తట్టుకోలేక  సూర్యబాబు, కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గృహ హింస కేసు నమోదు చేశామన్నారు. భర్త కృష్ణచైతన్య, అత్త అనంతలక్ష్మి, మామ ఆలపాటి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గీతాశ్రీ, వెంకటకృష్ణ, శ్రీకాంత్, కృష్ణవంశీలను అరెస్ట్‌ చేశామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement