విదేశాలకు మన ‘మేధ’.. వేల కోట్ల సంపద ఆవిరి | NITI Aayog sensational report on higher education | Sakshi
Sakshi News home page

విదేశాలకు మన ‘మేధ’.. వేల కోట్ల సంపద ఆవిరి

Dec 26 2025 5:59 AM | Updated on Dec 26 2025 5:59 AM

NITI Aayog sensational report on higher education

ఉన్నత విద్యపై నీతి ఆయోగ్‌ సంచలన నివేదిక

విదేశీ విద్యలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం

పంజాబ్, మహారాష్ట్రలను వెనక్కి నెట్టిన వైనం

2047 నాటికి 5 లక్షల మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా భారత్‌ ప్రణాళిక

న్యూఢిల్లీ: మన దేశ యువత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోటెత్తుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉంది. 2012లో విదేశాలకు వెళ్లిన వారు కొద్ది మందే ఉండగా.. 2024 నాటికి ఈ సంఖ్య ఏకంగా 13.3 లక్షలకు చేరింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు సరిహద్దులు దాటుతుండడంతో.. మన ’మేధ’తో పాటు వేల కోట్ల రూపాయల సంపద కూడా విదేశాల పాలవుతోంది. 

ఈ ఆందోళనకర పరిస్థితులకు చెక్‌ పెట్టి, భారత్‌ను ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం ‘ఇంటర్నేషనలైజేషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో నీతి ఆయోగ్‌ ఓ సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్‌ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు, కీలక విషయాలు ఉన్నాయి. 

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగా, విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నివేదిక సూచించింది. 2025 నాటికి భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే ఖర్చు దాదాపు 70 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6 లక్షల కోట్లు) దాటుతుందని అంచనా. ఇది మన దేశ విద్యాబడ్జెట్‌ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

విదేశీ విద్యలో ఏపీదే అగ్రస్థానం
దశాబ్దాలుగా విదేశీ విద్యకు చిరునామాగా ఉన్న పంజాబ్, ఆర్థికంగా బలీయమైన మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సాధారణంగా కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లడంలో పంజాబ్‌ విద్యార్థులు ముందుంటారని ప్రచారం ఉంది. కానీ నీతి ఆయోగ్‌ లెక్కలు ఆ అపోహను తొలగించాయి. 

2018 గణాంకాల ప్రకారం.. ఏపీ (62,771) మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్‌ (60,331), మహారాష్ట్ర (58,850) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2016లో దేశవ్యాప్తంగా విదేశాలకు వెళ్లిన వారిలో ఏపీ నుంచి 46,818 మంది విద్యార్థులు ఉండగా.. అప్పటికే ఏపీ అగ్రస్థానంలో ఉంది. 2018లో ఈ సంఖ్య ఏకంగా 62,771కి చేరింది. ఇది దేశంలోనే ఆల్‌ టైమ్‌ రికార్డ్‌. 

2020లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా, ఆ ఏడాది కూడా 35,614 మంది విద్యార్థులతో ఏపీ తన హవా కొనసాగించింది. కేవలం ఉత్తరాది రా>ష్ట్రాలే కాకుండా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే ఆంధ్రప్రదేశ్‌ చాలా ముందంజలో ఉంది. 2016లో ఏపీ నుంచి 46,818 మంది వెళ్లగా.. తమిళనాడు (27,518), కేరళ (18,428), కర్ణాటక (17,719) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మన చదువులకు విదేశీయులు ‘అంతంతే’
మనం లక్షల మందిని విదేశీ విద్య కోసం పంపిస్తుంటే.. మన దేశానికి చదువుకోవడానికి వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేవలం 46,878 మంది విదేశీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. చైనా, అమెరికా వంటి దేశాలతో పోలి స్తే ఇది చాలా తక్కువ. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ‘ఇంటర్నేషనలైజేషన్‌ ఎట్‌ హోమ్‌’ అనే వ్యూ హాన్ని నీతి ఆయోగ్‌ తెరపైకి తెచ్చింది. 

2047 నాటికి భారతీయ విద్యాసంస్థల్లో 5 లక్షల మంది విదేశీ విద్యార్థులను చేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరోవైపు 2012–13లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కేవలం 679 మంది విదేశీ విద్యార్థులు ఉండగా 2021–22 నాటికి ఆ సంఖ్య 3,106కు పెరిగింది. దీంతో విదేశీ విద్యా ర్థులను ఆకర్షించే టాప్‌ – 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ 7వ స్థానానికి ఎగబాకింది. 

2012–13లో విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో తెలంగాణ (2,700 మందితో 4వ స్థానం) ఏపీ కంటే చాలా ముందు ఉండేది. కానీ 2021–22 నాటికి టాప్‌– 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ స్థానం కోల్పో గా, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం 3,106 మంది విద్యా ర్థులతో 7వ స్థానానికి ఎగబాకడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement