సంరక్షణ.. సమస్యగా మారిన వేళ
భూ అయస్కాంత క్షేత్రం. రోదసీ నుంచి వేల కిలోమీటర్ల వేగంతో మనవైపు దూసుకొచ్చే సూక్షస్థాయి గ్రహశకలాలను మరింత వేగంగా లాగేసుకుని భూ వాతావరణంలో మండిపోయేలా చేసి వాటిని నాశనంచేసే అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా భూ అయాస్కాంత క్షేత్రానికి పేరుంది. అంతరిక్ష ప్రమాదాల నుంచి భూమిని, పరోక్షంగా మానవాళిని కాపాడుతున్న రక్షణ ఛత్రమది. వాస్తవానికి ఈ అయస్కాంత క్షేత్రం మన కంటికి కనిపించదు.
అదృశ్యంగా ఉంటూ అందర్నీ కాపాడే ఇదే అయస్కాంత క్షేత్రం ఇప్పుడు చాలా చాలా నెమ్మదిగా ప్రమాదకారిగా పరిణమిస్తోందని భౌతికశాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి ‘స్వార్మ్’కృత్రిమ ఉపగ్రహ కూటమి సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు సమగ్రస్థాయిలో పరిశీలించారు. దీంతో భూ అయస్కాంత క్షేత్రం దక్షిణ అట్లాంటిక్ సముద్రంపై బలహీనపడుతోందని స్పష్టమైంది. 2014 ఏడాది నుంచి చూస్తే గత 11 ఏళ్లలో అక్కడ ఏకంగా యురప్ ఖండమంత పరిమాణంలో అయస్కాంత క్షేత్రం బలహీనపడిందని తేలింది.
అంటే కృత్రిమ ఉపగ్రహాలు తమ కక్షలో తిరుగుతూనే ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించినప్పుడు వాటికి అయాస్కాంత క్షేత్ర రక్షణ బాగా తగ్గిపోతుంది. అంటే అంతరిక్ష నుంచి వెలువడే రేడియోధార్మికత అనేది నేరుగా ఉపగ్రహాలపై పడుతుంది. దాంతో శాటిలైట్‌లోని భాగాలు వేడెక్కి, బాగా దెబ్బతింటాయి. వాటి సామర్థ్యం సైతం క్షీణిస్తుంది. అప్పటికే అవి సేకరించిన డేటా సైతం నాశనంకావచ్చు. శాటిలైట్లు పనికిరాకుండా పోయే ప్రమాదముంది. దీంతో శాటిలైట్లతో భూమికి అనుసంధానం తెగిపోవచ్చు.
అసలు ఈ అయాస్కాంత క్షేత్రం ఎక్కడిది?
విశాలమైన రహదారి కింద పేద్ద డ్రైనేజీ కాలువ, అందులో వేగంగా మురుకు ప్రవహిస్తోందనకుందాం. ఆ మురుగు మనకు కనిపించకపోయినా కొన్ని మ్యాన్‌హోల్‌ల వద్ద వాసన ముక్కుపుటాలను అదరగొడుతుంది. అచ్చం అలాగే మన భూమిలోపల అంటే 3,000 కిలోమీటర్ల లోతులో మొత్తం భూమి అంతటా ద్రవరూప ఇనుము ప్రవహిస్తోంది. అయస్కాంతానికి ఇనుము అతుక్కున్నట్లే భూమి లోపలి ఈ ఇనుముకు సంబంధించిన అయాస్కాంత క్షేత్రం బయట గాలి ఆవరణలో పరుచుకుంది. ఈ అయస్కాంత క్షేత్రం దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో క్షీణిస్తోంది. దీనినే సౌత్ అట్లాంటిక్ అనామలీ(ఎస్‌ఏఏ)గా పేర్కొంటారు.
19వ శతాబ్దంలో దక్షిణ అమెరికాలోని ఆగ్నేయ దిశలో దీనిని తొలిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆఫ్రికా ఖండం దిశగా క్షీణిస్తూ వస్తోంది. భూమి ద్రవరూప బయటి పొరకు, శిలాద్రవం ఉన్న పొరకు మధ్య వైవిధ్యాల కారణంగా అయస్కాంత క్షేత్రం ఈ ప్రాంతంలో క్షీణిస్తోందని స్పష్టమైంది. సైబీరియా వద్ద అయస్కాంత క్షేత్రం బలంగా, కెనడా సమీపంలో బలహీనంగా మారుతోంది. ఉత్తర ధృవ అయస్కాంత క్షేత్ర నాభి నెమ్మదిగా సైబీరియా వైపునకు మారుతుండటమే ఈ మార్పులకు కారణం. రక్షణాత్మక క్షేత్రానికి ఏ స్థాయిలో బీటలు పడుతున్నాయని ఎప్పటికప్పుడు విశ్లేషించడం ద్వారా కృత్రిమ ఉపగ్రహాలను, వాటిపై ఆధారపడిన పౌర, సైనిక సేవల పునరుద్ధరణ చర్యలను చేపట్టవచ్చు.
– వాషింగ్టన్


