భారీ ఉగ్రకుట్ర భగ్నం | Jammu Kashmir, Haryana,UP terror module busted, 2,900 kg of explosives seized | Sakshi
Sakshi News home page

భారీ ఉగ్రకుట్ర భగ్నం

Nov 11 2025 4:47 AM | Updated on Nov 11 2025 4:47 AM

Jammu Kashmir, Haryana,UP terror module busted, 2,900 kg of explosives seized

వైద్యుల ముసుగులో విధ్వంస రచన 

వైట్‌కాలర్‌ ఉగ్రనెట్‌వర్క్‌ గుట్టురట్టు

ఒకే చోట 2,913 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం

ముగ్గురు వైద్యులు సహా ఎనిమిది మంది అరెస్ట్‌

వైద్యరంగంలోని వ్యక్తులపైనా ఉగ్రభావజాలాన్ని రుద్దుతున్న ముష్కరులు

నిషేధిత జైషే మొహమ్మద్, అన్సార్‌ ఘజ్‌వాత్‌–ఉల్‌–హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధాలు

మూడు రాష్ట్రాల ఉగ్రమాడ్యూల్‌ను ఛేదించిన పోలీసుల బృందం

శ్రీనగర్‌/ఫరీదాబాద్‌: దేశంలో భారీ మారణ హోమం సృష్టించేందుకు పన్నాగం పన్నిన ఒక ముష్కరమూక గుట్టుమట్లను మూడు రాష్ట్రాల పోలీసు బృందం విజయవంతంగా ఛేదించింది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ముమ్మర సోదాలు, దాడుల్లో ఏకంగా 2,913 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఏకే–56 రైఫిల్, ఏకే క్రిన్‌కోవ్‌ పిస్టల్, ఒక చైనీస్‌ స్టార్‌ పిస్టల్, ఇటలీ తయారీ బెరెట్టా పిస్టల్, ఒక సబ్‌మెషీన్‌ గన్, బుల్లెట్లు, మందుగుండుతోపాటు పేలుడు సంబంధ ముడి సరుకులు, రసాయనాలు, మండే ధాతు వులు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్‌ కంట్రోల్స్, టైమర్లు, వాకీటాకీ, మెటల్‌ షీట్లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నేరమయ డాక్యుమెంట్లతోపాటు ఐఈడీ వంటి పేలుడుపదార్థాల తయారీ విధాన పత్రాలను పోలీసులు పట్టుకెళ్లారు. 

ఇటీవలికాలంలో ఇంత మొత్తంలో పేలుడు పదార్థాలను కశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. జైషే మొహమ్మద్, అన్సార్‌ ఘజ్‌వాత్‌–ఉల్‌–హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులుసహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. వీళ్లలో ఒక మహిళా డాక్టర్‌ సైతం ఉండటం గమనార్హం. 

వీళ్లకు సంబంధించిన నివాసాలు, అద్దె ఇళ్లు, స్థలాల్లో సోదాల తర్వాత భారీ ఎత్తున పేలుడుపదార్థాల జాడను పోలీసులు కనుగొన్నారు. 350 కేజీల పేలుడు పదార్థం, అసాల్ట్‌ రైఫిల్, హ్యాండ్‌గన్‌ జాడను ఆదివారమే కనిపెట్టగా సోమవారం 2,563 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లలో జరిగిన విస్తృతస్థాయి దాడుల్లో వీళ్లందరినీ అరెస్ట్‌చేశారు. అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురు కశ్మీరీలే కావడం గమనార్హం.

 అరిఫ్‌ నిసార్‌ దార్‌ అలియాస్‌ సాహిల్, యాసిర్‌ ఉల్‌ అష్రఫ్, మఖ్సూద్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ షాహీద్‌(నౌగమ్‌), మౌల్వీ ఇర్ఫాన్‌ అహ్మద్‌( షోపియాన్‌), జమీర్‌ అహ్మద్‌ అహంగీర్‌ అలియాస్‌ ముత్లాషా(వకురా), డాక్టర్‌ ముజామిల్‌ అహ్మద్‌ ఘనీ అలియాస్‌ ముసేబ్‌(పుల్వామా), డాక్టర్‌ ఆదిల్‌(కుల్గామ్‌)లతోపాటు లక్నోకు చెందిన వైద్యురాలు షాహీన్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. అత్యంత గౌరవప్రద వైద్యవృత్తిలోని నిపుణులు, విద్యార్థులను ఉగ్రవాదంలోకి దింపి ముష్కరులు వైట్‌కాలర్‌ ఉగ్రనెట్‌వర్క్‌ను సృష్టించగా దాని గుట్టుమట్లను విజయవంతంగా ఛేదించామని సోమవారం జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగం ప్రకటించింది. 

పోస్టర్‌లతో మొదలై.. అరెస్ట్‌ల దాకా..
కశ్మీర్‌కు చెందిన ఒక డాక్టర్‌ అరెస్ట్‌తో ఈ మొత్తం నెట్‌వర్క్‌ అంశం వెలుగులోకి వచ్చింది. కుల్గాంలోని వాన్‌పురాకు చెందిన డాక్టర్‌ ఆదిల్‌ అహ్మద్‌ రాటర్‌ భారత భద్రతాబలగాలను బెదిరిస్తూ శ్రీనగర్, బాన్‌పొరా నౌగామ్‌సహా పలుచోట్ల అక్టోబర్‌ 19న పోస్టర్లు అంటించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇతడిని గుర్తించి పోలీసులు నవంబర్‌ ఏడో తేదీన అరెస్ట్‌చేశారు. అతడిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఆదిల్‌కు చెందిన లాకర్‌ను తెరవగా అందులో ఏకే–47 రైఫిల్‌ లభించింది. 

మరింతగా విచారించగా ముజామిల్‌ ఘనీ షకీల్‌ అనే మరోవైద్యుడు సైతం ఈ ఉగ్రకుట్రలో భాగస్వామి అని తేలింది. తర్వాత అతడినీ అరెస్ట్‌చేశారు. షకీల్‌ ఇచ్చిన సమాచారంతో హరియాణాలోని ఫరీదాబాద్‌లో మూడేళ్లుగా అద్దె కడుతున్న ఒక లాడ్జ్‌లోని గదిలో పోలీసు బృందం ముమ్మర తనిఖీలుచేసి 8 పెద్ద, 4 చిన్న సూట్‌ కేసులు, ఒక బకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఏకంగా 2,563 కేజీల ఐఈడీ పేలుడుపదార్థాలున్నాయి. దీనిని అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌గా భావిస్తున్నారు. వాస్తవానికి షకీల్‌ కశ్మీర్‌లోని పుల్వామాలోని కోలీవాసి. ప్రస్తుతం ఇతను హరియాణాలోని ఆల్‌–ఫలాహ్‌ మెడికల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో సీనియర్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఢిల్లీలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే మా లక్ష్యం
ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) లో మత కల్లోలాలు, విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా దాడులతో తెగబడాలని పాకిస్తాన్, కశ్మీర్‌లోని హ్యాండ్లర్‌ల నుంచి ఆదేశాలు వచ్చాయని అరెస్టయిన షకీల్, ఆదిల్‌ విచారణలో బయటపెట్టారు. అయితే ఏఏ లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారో వాళ్లకు ఇంకా ఆదేశాలు రాలేదు. ‘‘ ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో వైద్యులను ఉగ్రకోణంలో ఎవరూ అనుమానించబోరు. అందుకే మమ్మల్నే ఈ పనికి ఎంచుకున్నారు. లక్ష్యాలను నిర్దేశించేదాకా వేచి ఉండాలని మాకు ఆదేశాలు అందాయి. ఈ ఉగ్రమాడ్యూల్‌కు పథకరచన పాకిస్తాన్‌లో జరిగింది. ఆదేశాలు మాత్రం కశ్మీర్‌ హ్యాండ్లర్‌ల నుంచే వస్తాయి. మేం గతంలో కశ్మీర్‌లో డాక్టర్‌లుగా పనిచేసిన కాలంలో 2018–2021 భద్రతా బలగాలతో పోరాడి గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స చేశాం’’అని షకీల్, ఆదిల్‌ పోలీసు విచారణలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement