రింకూ సింగ్ (PC: PTI)
టీమిండియా సెలక్టర్ల నమ్మకాన్ని రింకూ సింగ్ నిజం చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు తన ఎంపిక సరైందేనని నిరూపిస్తున్నాడు. తాజాగా వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఫామ్‌ను కొనసాగిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.
ఈ టోర్నమెంట్లో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రింకూ సింగ్ (Rinku Singh).. బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 48 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఇతడికి తోడు ధ్రువ్ జురెల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. ఫలితంగా యూపీ 84 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం అందుకుంది.
ఆర్యన్ జుయల్ సెంచరీ
గ్రూప్-బిలో భాగంగా తాజాగా చండీగఢ్‌తో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో రాజ్‌కోట్ వేదికగా టాస్ ఓడిన యూపీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్ అభిషేక్ గోస్వామి (1) ఈసారి విఫలం కాగా.. ఆర్యన్ జుయల్ మాత్రం మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 118 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 134 పరుగులు సాధించాడు.
రింకూ సింగ్ విధ్వంసకర శతకం
ఇక వన్‌డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (57 బంతుల్లో 67) మరోసారి హాఫ్ సెంచరీతో మెరవగా.. సమీర్ రిజ్వి (32) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఐదో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ రింకూ సింగ్ విధ్వంసకర శతకంతో చండీగఢ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కేవలం 56 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రింకూ.. మొత్తంగా 60 బంతుల్లో 106 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇటీవల ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు పెట్టి కొన్న ప్రశాంత్ వీర్ (14 బంతుల్లో 12).. రింకూతో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.
367 పరుగులు
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో యూపీ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 367 పరుగులు చేశాడు. చండీగఢ్ బౌలర్లలో తరణ్‌ప్రీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, నిషుంక్ బిర్లా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు దక్కిన విషయం తెలిసిందే.


