breaking news
Atmosphere changes
-
గతి తప్పిన వాతావరణం
న్యూఢిల్లీ: దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెలలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిగా ఉండే మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని, ఈ అంశం నిగ్గుతేల్చారు. ‘వాటర్ టవర్ ఆఫ్ ఆసియా’గా భావించే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి. హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మంచు చరియలు విరిగిపడుతున్నాయి. మొత్తంగా వాతావరణమే గతి తప్పుతోంది. ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో గత నెలలో 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే 78 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, 36 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. హిమాలయాల్లో భాగమైన సిమ్లాలో 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 186 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏకంగా 2.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 55 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి? వాతావరణం గతి తప్పడానికి కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హిమాలయాలు వేగంగా కరిగిపోతే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు తప్పదు. వరదలు ముంచెత్తుతాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, టిబెట్ పీఠభూమిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2015 నుంచి 2024 దాకా హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. 2016 నుంచి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2024లో 19.99 డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 0.77 డిగ్రీలు అధికం. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం చూస్తే.. 1901 నుంచి 2020 దాకా ఇండియాలో సగటు ఉష్ణోగ్రత 0.62 డిగ్రీలు పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రత 0.99 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0.24 డిగ్రీలు పెరిగాయి. అడవులను నరికివేయడం, పట్టణీకరణ, శిలాజ ఇంధనాల వాడకం ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతుందనడంలో సందేహం లేదు. -
విశాఖలో అరుదైన వాతావరణం.. నగరమంతా మసకబారినట్టుగా..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో శుక్రవారం అరుదైన వాతావరణం నెలకొంది. వేకువ జాము నుంచే వర్షం మొదలైంది. తెల్లారేసరికి దానికి పొగమంచు కూడా తోడైంది. ఇలా ఉదయం ఆరంభమైన వాన 10 గంటల వరకు కురిసి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. కానీ పొగమంచు మాత్రం మధ్యాహ్నం దాటే దాకా కొనసాగింది. దీంతో విశాఖ నగరమంతా మంచు ముసుగు తొడుక్కుని మసకబారినట్టుగా మారిపోయింది. మంచు వర్షం కురిసినట్టు అగుపించింది. దీంతో కాస్త దూరంగా ఉన్న వాహనాలు, వాటి కదలికలు స్పష్టత లేకుండా పోయాయి. వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. విశాఖ నగరంతో పాటు ఉమ్మడి విశాఖలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఇలాంటి వాతావరణ పరిస్థితి కనిపించలేదు. సాధారణంగా ఈ సీజనులో తరచూ మన్యం ప్రాంతంలోనే చిరుజల్లులు, పొగమంచు ఏర్పడుతుంటుంది. కానీ అందుకు భిన్నంగా విశాఖలో మన్యాన్ని తలపించే వాతావరణం అందరిలోనూ ఒకింత ఆశ్చర్యానికి, ఆసక్తికి గురిచేసింది. ఇదీ కారణం..! గాలిలో తేమ ఎక్కువగా ఉండడం, పొడి గాలులు లేకపోవడం వల్ల పొగమంచు ఏర్పడడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి శనివారం కూడా కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ‘సాక్షి’కి చెప్పారు. రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తూ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
భారత్‌లో ఏటా లక్షకుపైగా మరణిస్తారట!
లండన్: పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ మార్పుల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలతోపాటు భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా 2050 సంవత్సరం నాటికి భారత్‌లో ఏటా 1,60,000 మంది మరణిస్తారని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ యూనివర్శిటీ పరిశోధకులు 155 దేశాలపై అధ్యయనం జరపగా క్లైమేట్ ఛేంజ్ కారణంగా మరణాలు సంభవించే దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏడాదికి 2,48,000 మంది మరణాలతో చైనా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, వియత్నాం, అమెరికా దేశాలు ఉన్నాయి. వ్యయసాయోత్పల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్ల ధరలు పెరిగిపోవడం, సరకులు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం, ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, మాంసం వినియోగం గణనీయంగా పడిపోవడం, పర్యవసానంగా తలెత్తే పౌష్టికాహార లోపం, బరువు తగ్గి పోవడం అనారోగ్య సమస్యలు తలెత్తడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మరణాలను అంచనావేసినట్లు పరిశోధకులు తెలిపారు. గుండె, క్యాన్సర్ లాంటి జబ్బులోకాకుండా మలేరియా, డెంగ్యూ వ్యాధులు, అంటురోగాల వల్ల మరణాలు సంభవిస్తాయని నేచర్ పత్రిక లాన్సర్‌లో ప్రచురించిన వ్యాసంలో ఆక్స్ఫర్డ్ పరిశోధకులు వివరించారు. 2050 నాటికి అహారోత్పత్తుల అందుబాటు 3.2 శాతం, పండ్లు, కూరగాయలు 4 శాతం, మాంసం ఉత్పత్తులు 0.7 శాతం తగ్గిపోతాయని పరిశోధకులు అంచనా వేశారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మరణాలను అరికట్టేందుకు భారత్ లాంటి దేశాల్లో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కూడా పరిశోధకులు కొన్ని సూచనులు చేశారు. పలు రకాలుగా వ్యవసాయోత్పత్తుల సాగును ప్రోత్సహించాలని, బియ్యం, గోధుమ పంటలపైనే దృష్టిని కేంద్రీకరించకుండా పండ్లు, కూరగాయల సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని వారు సూచించారు. ఆరోగ్య స్కీమ్‌లను పటిష్టం చేసి ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని, ముఖ్యంగా ఎప్పటికప్పుడు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని కనుగొనేందుకు వారి బరువును తూచే అంగన్వాడి వ్యవస్థను విస్తరించాలని సిఫార్సు చేశారు.