
గత నెలలో అసాధారణ పరిణామాలు
హిమాలయాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
మధ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
కాలుష్యం, వాతావరణ మార్పులతో పెనుముప్పు
న్యూఢిల్లీ: దేశంలో సాధారణం కంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెలలో ఈ పరిణామం స్పష్టంగా కనిపించినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. చల్లగా ఉండే హిమాలయ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వేడిగా ఉండే మధ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని, ఈ అంశం నిగ్గుతేల్చారు. ‘వాటర్ టవర్ ఆఫ్ ఆసియా’గా భావించే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయి.
హిమానీనదాలు కరిగిపోతున్నాయి. మంచు చరియలు విరిగిపడుతున్నాయి. మొత్తంగా వాతావరణమే గతి తప్పుతోంది. ఎడారి రాష్ట్రమైన రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో గత నెలలో 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే 78 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాగా, 36 మిల్లీమీటర్ల అధిక వర్షం కురిసింది. హిమాలయాల్లో భాగమైన సిమ్లాలో 0.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 186 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యాయి. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఏకంగా 2.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 55 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డు కావడం గమనార్హం.
ఎందుకీ పరిస్థితి?
వాతావరణం గతి తప్పడానికి కాలుష్యం, వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. హిమాలయాలు వేగంగా కరిగిపోతే దిగువ ప్రాంతాలకు పెనుముప్పు తప్పదు. వరదలు ముంచెత్తుతాయి. ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాలు, టిబెట్ పీఠభూమిలో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
2015 నుంచి 2024 దాకా హిమాలయాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డయ్యాయి. 2016 నుంచి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. 2024లో 19.99 డిగ్రీల వార్షిక సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 0.77 డిగ్రీలు అధికం. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం చూస్తే.. 1901 నుంచి 2020 దాకా ఇండియాలో సగటు ఉష్ణోగ్రత 0.62 డిగ్రీలు పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రత 0.99 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 0.24 డిగ్రీలు పెరిగాయి. అడవులను నరికివేయడం, పట్టణీకరణ, శిలాజ ఇంధనాల వాడకం ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారుతుందనడంలో సందేహం లేదు.