
భూగోళానికి 9 ఆరోగ్య పరీక్షల్లో ఏడింట ఫెయిల్!
ప్రమాదకర స్థాయికి చేరిన సముద్ర ఆమ్లీకరణ
తాజా ‘ప్లానెటరీ హెల్త్ చెక్ 2025’ రిపోర్ట్ హెచ్చరిక
భూమికి బాగా సుస్తీ చేసింది. అవనికి ఆధారంగా నిలుస్తున్న 9 పర్యావరణ వ్యవస్థల్లో ఏడింటి ఆరోగ్యం క్షీణించింది. శాస్త్రవేత్తల పరిభాషలో వీటిని ‘ప్లానెటరీ బౌండరీస్’ అంటారు. తాజాగా.. భూగ్రహంపై 70% భూభాగాన్ని ఆక్రమించటమే కాకుండా జీవావరణాన్ని కంటికి రెప్పలా కాపాడే సముద్రం కూడా అనారోగ్యం పాలైంది. సముద్ర జలాల ఆమ్లీకరణ హద్దుమీరి ప్రమాద ఘంటికలు మోగించటం ఇదే మొదటిసారి! అయినప్పటికీ, ఇంకా ఆశ మిగిలి ఉందని, ఇప్పటికైనా మానవాళి మేలుకోవాలని ‘ప్లానెటరీ హెల్త్ చెక్ 2025’ తాజా నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, సాగుబడి
భూమి ఒక రోగి అయితే, అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పడి ఉండేదని పోట్స్‌డ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పీఐకే) వెలువరించిన ‘ప్లానెట్ హెల్త్ చెక్ 2025’ నివేదిక చెబుతోంది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. భూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనంలో చురుగ్గా పనిచేస్తోంది.
పరిశోధకులు గుర్తించిన తొమ్మిది పర్యావరణ సరిహద్దుల్లో మూడు ప్రమాదకర హద్దును దాటాయని 2009లో తొలుత గుర్తించారు. వీటి సంఖ్య 2023 నాటికి ఆరుకు, ప్రస్తుతం 9కి పెరిగింది. శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యాన్ని.. దాని ఉత్పాదకత, మానవులు వాడుకున్న తర్వాత మిగిలిన శక్తి అనే 2 సూచికలను ఉపయోగించి కొలుస్తారు.
1 వాతావరణ మార్పు
వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ (సీఓ2) 350 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) స్థాయిలో ఉంటే మంచిది. కానీ ఇది 423కి పెరిగింది. 450కి చేరితే మరింత ప్రమాదకరం. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి, విపత్తులు తీవ్రమవుతున్నాయి.
2 జీవావరణ సమగ్రతలో మార్పు
మనం చేసే పనులు జీవావరణ సమగ్రతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతిలో ఉన్న శక్తిలో 10 శాతాన్ని మనుషులు వాడుకుంటే ప్రకృతి తిరిగి దాన్ని పూడ్చుకొని తెప్పరిల్లుతుంది. కానీ, మనం 30% వాడేసుకుంటున్నాం. వ్యవసాయం, పశువుల పెంపకం, నగరీకరణ, పరిశ్రమల కోసం భూమి సహజ స్థితిని విపరీతంగా మార్చటం వల్ల.. జీవవైవిధ్యం ప్రమాదకర స్థాయిలో అంతరిస్తోంది.
3 భూ వ్యవస్థ మార్పు
అడవులు భూగోళంపై వాతావరణాన్ని స్థిరంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అసాధారణంగా అడవులు నరికివేసి భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాం. వ్యవసాయం, నగరీకరణ, పశుపోషణ కోసం తీవ్రస్థాయిలో భూ వినియోగ సహజ స్థితిని మార్చటం సమస్యగా మారింది. 2000–2018 మధ్యలో 90% అడవుల నరికివేత వ్యవసాయం (52%), పశుపోషణ (38%) కోసమే జరిగింది. ప్రపంచ భూభాగంలో అడవులు 75% ఉంటే మేలు. అయితే, ఇప్పుడు 59 శాతానికి తగ్గిపోయాయి.
4 మంచినీటి మార్పు
పరిమితి దాటిని మంచి నీటి వినియోగం జల చక్రాన్ని దెబ్బతీస్తోంది. నదుల్లో పారే నీటిని 12.9% వాడుకుంటే పర్వాలేదు. కానీ, ఇప్పుడు 22.6% వాడుతున్నాం. భూగర్భ జలాలను 12.4% వాడుకుంటే పర్వాలేదు.మనం 22% వినియోగిస్తున్నాం.
5 జీవ భౌతిక రసాయన మార్పులు
రసాయనిక ఎరువులను పంటలు ఉపయోగించుకునేది తక్కువ.. నీటిని, భూమిని కలుషితం చేసేదే ఎక్కువ. ఇవి చివరికి సముద్ర జలాల్లోకీ చేరి పర్యావరణ వ్యవస్థలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాయి. భాస్వరం ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 62 లక్షల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 11 కోట్ల టన్నులు వాడుతున్నాం. నత్రజని ఎరువును ఏటా 6.2 కోట్ల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 8.2 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఇతర ఆరు రకాల సరిహద్దులను కూడా ఈ ఎరువులు ప్రభావితం చేస్తున్నాయి.
6 సముద్రాల ఆమ్లీకరణ
వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌లో చాలా వరకు సముద్రాలే పీల్చుకుంటాయి. దీనివల్ల సముద్ర జలాల్లో ఆమ్లగుణం పెరిగిపోతుంది. ఇది ఒక స్థాయికి మించితే సముద్ర జీవ వ్యవస్థలకు ప్రమాదం. ఫలితంగా సీఓ2ను పీల్చుకునే శక్తి సముద్రాలకు తగ్గిపోతుంది. దీంతో భూగోళం మరింత వేడెక్కుతుంది.
7 వాయు కాలుష్యం
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు తీసుకోవటం వల్ల ఈ కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 9 సరిహద్దుల్లో సురక్షిత స్థాయిలో ఉన్న రెండింటిలో ఇదొకటి.
8 ఓజోన్ పొర
సౌర వ్యవస్థ నుంచి అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా వడకట్టేది ఆకాశంలోని ఓజోన్ పొర. గతంలో ఇది క్షీణించడంతో ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఓజోన్ పొర మందం ఇటీవల పెరుగుతోంది. తొమ్మిదింటిలో సురక్షిత స్థాయిలో ఉన్న రెండోది ఇదే.
9 నావల్ ఎంటిటీస్
మనుషులు తయారుచేసిన రసాయనాలు, ప్లాస్టిక్‌లు.. వీటి కిందికి వస్తాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు సముద్ర జంతువుల్లోకి, మన దేహాల్లోకి చేరి చేటు చేస్తున్నాయి. అయితే, వీటి ముప్పు ఎంత అనేది అంచనా వేయాల్సి ఉంది.