breaking news
health check
-
గుండెకు బ్యాడ్ మార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పగటి పూట తీసుకునే ఆహారాలు శక్తి స్థాయిలు, జీవక్రియ, జీవ గడియారం తీరుపై (సర్కాడియన్ రిథమ్)పై తీవ్ర ప్రభావం చూపుతాయా? దీర్ఘకాలంలో ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూలమైన ప్రభావానికి కారణమవుతాయా? ఈ ప్రశ్నలకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్ల విషయానికి వస్తే, క్రమంతప్పని వ్యాయామం, ఎక్కువ మోతాదులో కూరగాయలు తినడం, ఏటా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు వంటి సమాధానాలు టక్కు న వస్తాయి. ఇవి ఆరోగ్యపరిరక్షణకు దోహదం చేసినప్పటికీ, గుండె ఆరోగ్యం వీటిపై మాత్రమే ఆధారపడి ఉండదని, మరికొన్ని జాగ్రత్తలు అవసరమని తెలుస్తోంది. మధ్యాహ్నం అధిక మోతాదులో చక్కెరలు ఉన్న స్నాక్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, నీరు తాగకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత టీ, కాఫీ వంటివి (కెఫిన్ పదార్థాలు) తీసుకోవడం వల్ల నిద్ర ఆలస్యం కావడం వంటివి నిశ్శబ్ద ఆరోగ్య ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయని వైద్యనిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్రోనోన్యూట్రిషన్ అంటే ఏమిటి? » క్రోనోన్యూట్రిషన్ అంటే ఆహారపుటలవాట్లలోని సమయం, క్రమబద్ధతలు శరీరం యొక్క అంతర్గత సర్కాడియన్ రిథమ్‌తో సంకర్షణ చెంది జీవక్రియను, ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే శాస్త్రం. మీరు ఏమి తింటారనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటారనే విషయం కూడా అంతే ముఖ్యమని ఈ శాస్త్రం చెబుతుంది. సర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించేది ఏది? » సర్కాడియన్ రిథమ్ శరీరం లోపల జన్యువులు, హార్మోన్ల ద్వారా నియంత్రితమవుతుంది. శరీరం బయటి నుంచి ప్రభావితం చేసే కూడా కారకాలున్నాయి. వాటిని జైట్ గేబర్స్ అంటారు. సూర్యరశ్మి, వ్యాయమం, ఆహారం వంటివి. మన వెంట ఉన్న ప్రమాదాలివి.. » క్యాండీలు, పేస్ట్రీలు, చక్కెర వేసిన కాఫీల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. » సాయంత్రం తర్వాత కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ‘అడెనోసిన్ రిసెప్టర్లు’ప్రేరేపితమై మనిషిని మెలకువగా ఉంచుతూ, సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తాయి. » మధ్యాహ్న భోజనం చేయకపోతే సాయంత్రానికి అతిగా ఆకలి వేస్తుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తినేటట్లు ప్రేరేపించడంతోపాటు మనసును అనారోగ్యకరమైన ఆహారం మీదకు మళ్లిస్తుంది. » పనిలో పడి పగలంతా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది మతిమరుపుకు, అతిగా తినడానికి, అనారోగ్యకరమైన చక్కెర పానీయాలను తాగేలా ప్రభావితం చేస్తుంది. ఆహారపు అలవాట్లు ఇకపై ఇలా » ప్రోటీన్, ఫైబర్‌పై దృష్టి పెట్టాలి. గ్రీక్ యోగర్ట్, నట్స్, పండ్లు, కూరగాయలతో కూడిన హమ్మస్ వంటి సమతుల ఆహారం తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన అనుభూతినివ్వడంతోపాటు నీరసం రానివ్వకుండా ఎక్కువ సేపు శక్తిని అందిస్తాయి. » గంటకొకసారి 5 నిమిషాలపాటు దేహానికి కదలిక కోసం నడవాలి. మధ్యాహ్న భోజనం తర్వాత తేలికపాటి నడక వల్ల చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నిలువరించవచ్చు. » రాత్రి భోజనం ఎనిమిది గంటలకు ముగిస్తే శరీర సహజ జీవప్రక్రియలు సజావుగా సాగుతాయి. ఈ అలవాటు కేలరీలను మెరుగ్గా దహించడానికి వీలు కల్పిస్తుంది. » పగలంతా నీటిని కొద్దికొద్దిగా తాగడాన్ని అలవాటుగా పాటించాలి. శరీరంలో నీటిశాతం తగినంత ఉంటే కెఫిన్ డ్రింక్స్ తీసుకోవాలనే కోరిక కలగదు. -
ఐసీయూలో భూమి!
భూమికి బాగా సుస్తీ చేసింది. అవనికి ఆధారంగా నిలుస్తున్న 9 పర్యావరణ వ్యవస్థల్లో ఏడింటి ఆరోగ్యం క్షీణించింది. శాస్త్రవేత్తల పరిభాషలో వీటిని ‘ప్లానెటరీ బౌండరీస్’ అంటారు. తాజాగా.. భూగ్రహంపై 70% భూభాగాన్ని ఆక్రమించటమే కాకుండా జీవావరణాన్ని కంటికి రెప్పలా కాపాడే సముద్రం కూడా అనారోగ్యం పాలైంది. సముద్ర జలాల ఆమ్లీకరణ హద్దుమీరి ప్రమాద ఘంటికలు మోగించటం ఇదే మొదటిసారి! అయినప్పటికీ, ఇంకా ఆశ మిగిలి ఉందని, ఇప్పటికైనా మానవాళి మేలుకోవాలని ‘ప్లానెటరీ హెల్త్ చెక్ 2025’ తాజా నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, సాగుబడిభూమి ఒక రోగి అయితే, అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడి ఉండేదని పోట్స్‌డ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పీఐకే) వెలువరించిన ‘ప్లానెట్ హెల్త్ చెక్ 2025’ నివేదిక చెబుతోంది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. భూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనంలో చురుగ్గా పనిచేస్తోంది. పరిశోధకులు గుర్తించిన తొమ్మిది పర్యావరణ సరిహద్దుల్లో మూడు ప్రమాదకర హద్దును దాటాయని 2009లో తొలుత గుర్తించారు. వీటి సంఖ్య 2023 నాటికి ఆరుకు, ప్రస్తుతం 9కి పెరిగింది. శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యాన్ని.. దాని ఉత్పాదకత, మానవులు వాడుకున్న తర్వాత మిగిలిన శక్తి అనే 2 సూచికలను ఉపయోగించి కొలుస్తారు.1 వాతావరణ మార్పువాతావరణంలో కార్బన్డయాక్సైడ్ (సీఓ2) 350 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) స్థాయిలో ఉంటే మంచిది. కానీ ఇది 423కి పెరిగింది. 450కి చేరితే మరింత ప్రమాదకరం. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి, విపత్తులు తీవ్రమవుతున్నాయి.2 జీవావరణ సమగ్రతలో మార్పుమనం చేసే పనులు జీవావరణ సమగ్రతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతిలో ఉన్న శక్తిలో 10 శాతాన్ని మనుషులు వాడుకుంటే ప్రకృతి తిరిగి దాన్ని పూడ్చుకొని తెప్పరిల్లుతుంది. కానీ, మనం 30% వాడేసుకుంటున్నాం. వ్యవసాయం, పశువుల పెంపకం, నగరీకరణ, పరిశ్రమల కోసం భూమి సహజ స్థితిని విపరీతంగా మార్చటం వల్ల.. జీవవైవిధ్యం ప్రమాదకర స్థాయిలో అంతరిస్తోంది.3 భూ వ్యవస్థ మార్పుఅడవులు భూగోళంపై వాతావరణాన్ని స్థిరంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అసాధారణంగా అడవులు నరికివేసి భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాం. వ్యవసాయం, నగరీకరణ, పశుపోషణ కోసం తీవ్రస్థాయిలో భూ వినియోగ సహజ స్థితిని మార్చటం సమస్యగా మారింది. 2000–2018 మధ్యలో 90% అడవుల నరికివేత వ్యవసాయం (52%), పశుపోషణ (38%) కోసమే జరిగింది. ప్రపంచ భూభాగంలో అడవులు 75% ఉంటే మేలు. అయితే, ఇప్పుడు 59 శాతానికి తగ్గిపోయాయి. 4 మంచినీటి మార్పుపరిమితి దాటిని మంచి నీటి వినియోగం జల చక్రాన్ని దెబ్బతీస్తోంది. నదుల్లో పారే నీటిని 12.9% వాడుకుంటే పర్వాలేదు. కానీ, ఇప్పుడు 22.6% వాడుతున్నాం. భూగర్భ జలాలను 12.4% వాడుకుంటే పర్వాలేదు.మనం 22% వినియోగిస్తున్నాం.5 జీవ భౌతిక రసాయన మార్పులురసాయనిక ఎరువులను పంటలు ఉపయోగించుకునేది తక్కువ.. నీటిని, భూమిని కలుషితం చేసేదే ఎక్కువ. ఇవి చివరికి సముద్ర జలాల్లోకీ చేరి పర్యావరణ వ్యవస్థలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాయి. భాస్వరం ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 62 లక్షల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 11 కోట్ల టన్నులు వాడుతున్నాం. నత్రజని ఎరువును ఏటా 6.2 కోట్ల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 8.2 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఇతర ఆరు రకాల సరిహద్దులను కూడా ఈ ఎరువులు ప్రభావితం చేస్తున్నాయి. 6 సముద్రాల ఆమ్లీకరణవాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌లో చాలా వరకు సముద్రాలే పీల్చుకుంటాయి. దీనివల్ల సముద్ర జలాల్లో ఆమ్లగుణం పెరిగిపోతుంది. ఇది ఒక స్థాయికి మించితే సముద్ర జీవ వ్యవస్థలకు ప్రమాదం. ఫలితంగా సీఓ2ను పీల్చుకునే శక్తి సముద్రాలకు తగ్గిపోతుంది. దీంతో భూగోళం మరింత వేడెక్కుతుంది. 7 వాయు కాలుష్యంగత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు తీసుకోవటం వల్ల ఈ కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 9 సరిహద్దుల్లో సురక్షిత స్థాయిలో ఉన్న రెండింటిలో ఇదొకటి.8 ఓజోన్ పొరసౌర వ్యవస్థ నుంచి అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా వడకట్టేది ఆకాశంలోని ఓజోన్ పొర. గతంలో ఇది క్షీణించడంతో ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఓజోన్ పొర మందం ఇటీవల పెరుగుతోంది. తొమ్మిదింటిలో సురక్షిత స్థాయిలో ఉన్న రెండోది ఇదే.9 నావల్ ఎంటిటీస్మనుషులు తయారుచేసిన రసాయనాలు, ప్లాస్టిక్లు.. వీటి కిందికి వస్తాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు సముద్ర జంతువుల్లోకి, మన దేహాల్లోకి చేరి చేటు చేస్తున్నాయి. అయితే, వీటి ముప్పు ఎంత అనేది అంచనా వేయాల్సి ఉంది. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్యపరీక్షలు
ఆదిలాబాద్ : ఎంపికైన కానిస్టేబుళ్ల అభ్యర్థులకు రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఆదిలాబాద్ ఏఎస్పీ పనసారెడ్డి అభ్యర్థుల వైద్యపరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. శిక్షణకేంద్రం డీఎస్పీ సీతారాములు, ఇద్దరు ఎస్సైల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతీరోజు 60 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 418మంది అభ్యర్థులకు పరీక్షలు పూర్తయ్యాయన్నారు. మిగతా 125 మంది అభ్యర్థులకు మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రిమ్స్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో వైద్యులు సహకారం అందిస్తున్నారన్నారు. సమయానుసారంగా అభ్యర్థులు రిమ్స్‌లో హాజరుకావాలన్నారు. వైద్య పరీక్షలతో పాటు అభ్యర్థుల ఉద్యోగ పరిశీలన కొనసాగుతుందన్నారు. 12 ప్రత్యేక పోలీసు బృందాలు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల పూర్వపరాలు, విద్యాభ్యాసం, వ్యక్తిత్వం, నిజపత్రాలను పరిశీలిస్తోందన్నారు. త్వరలో శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ డీఎస్పీ సీతారాములు, ఎస్సైలు గంగాధర్, విష్ణుప్రకాశ్, పోలీస్ డాక్టర్ గంగారాం, వైద్యులున్నారు.


