పగటివేళ ‘ఆహార’ఎంపికలతో గుండెకు ముప్పు..
గుండె ఆరోగ్యానికి చేటు తెస్తున్న అధిక చక్కెరలు, కెఫిన్
నీళ్లు తాగకపోవడంతో జీవక్రియలకు అంతరాయం
జీవక్రియలను ప్రభావితం చేసే సర్కాడియన్ రిథమ్
గుండెకు హాని పగలే జరుగుతోందంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: పగటి పూట తీసుకునే ఆహారాలు శక్తి స్థాయిలు, జీవక్రియ, జీవ గడియారం తీరుపై (సర్కాడియన్ రిథమ్)పై తీవ్ర ప్రభావం చూపుతాయా? దీర్ఘకాలంలో ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూలమైన ప్రభావానికి కారణమవుతాయా? ఈ ప్రశ్నలకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్ల విషయానికి వస్తే, క్రమంతప్పని వ్యాయామం, ఎక్కువ మోతాదులో కూరగాయలు తినడం, ఏటా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు వంటి సమాధానాలు టక్కు న వస్తాయి.
ఇవి ఆరోగ్యపరిరక్షణకు దోహదం చేసినప్పటికీ, గుండె ఆరోగ్యం వీటిపై మాత్రమే ఆధారపడి ఉండదని, మరికొన్ని జాగ్రత్తలు అవసరమని తెలుస్తోంది. మధ్యాహ్నం అధిక మోతాదులో చక్కెరలు ఉన్న స్నాక్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, నీరు తాగకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత టీ, కాఫీ వంటివి (కెఫిన్ పదార్థాలు) తీసుకోవడం వల్ల నిద్ర ఆలస్యం కావడం వంటివి నిశ్శబ్ద ఆరోగ్య ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయని వైద్యనిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
క్రోనోన్యూట్రిషన్ అంటే ఏమిటి?
» క్రోనోన్యూట్రిషన్ అంటే ఆహారపుటలవాట్లలోని సమయం, క్రమబద్ధతలు శరీరం యొక్క అంతర్గత సర్కాడియన్ రిథమ్‌తో సంకర్షణ చెంది జీవక్రియను, ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే శాస్త్రం. మీరు ఏమి తింటారనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటారనే విషయం కూడా అంతే ముఖ్యమని ఈ శాస్త్రం చెబుతుంది.
సర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించేది ఏది?
» సర్కాడియన్ రిథమ్ శరీరం లోపల జన్యువులు, హార్మోన్ల ద్వారా నియంత్రితమవుతుంది. శరీరం బయటి నుంచి ప్రభావితం చేసే కూడా కారకాలున్నాయి. వాటిని జైట్ గేబర్స్ అంటారు. సూర్యరశ్మి, వ్యాయమం, ఆహారం వంటివి.
మన వెంట ఉన్న ప్రమాదాలివి..
» క్యాండీలు, పేస్ట్రీలు, చక్కెర వేసిన కాఫీల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.
» సాయంత్రం తర్వాత కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ‘అడెనోసిన్ రిసెప్టర్లు’ప్రేరేపితమై మనిషిని మెలకువగా ఉంచుతూ, సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తాయి.
» మధ్యాహ్న భోజనం చేయకపోతే సాయంత్రానికి అతిగా ఆకలి వేస్తుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తినేటట్లు ప్రేరేపించడంతోపాటు మనసును అనారోగ్యకరమైన ఆహారం మీదకు మళ్లిస్తుంది.
» పనిలో పడి పగలంతా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది మతిమరుపుకు, అతిగా తినడానికి, అనారోగ్యకరమైన చక్కెర పానీయాలను తాగేలా ప్రభావితం చేస్తుంది.
ఆహారపు అలవాట్లు ఇకపై ఇలా
» ప్రోటీన్, ఫైబర్‌పై దృష్టి పెట్టాలి. గ్రీక్ యోగర్ట్, నట్స్, పండ్లు, కూరగాయలతో కూడిన హమ్మస్ వంటి సమతుల ఆహారం తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన అనుభూతినివ్వడంతోపాటు నీరసం రానివ్వకుండా ఎక్కువ సేపు శక్తిని అందిస్తాయి.
» గంటకొకసారి 5 నిమిషాలపాటు దేహానికి కదలిక కోసం నడవాలి. మధ్యాహ్న భోజనం తర్వాత తేలికపాటి నడక వల్ల చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నిలువరించవచ్చు.
» రాత్రి భోజనం ఎనిమిది గంటలకు ముగిస్తే శరీర సహజ జీవప్రక్రియలు సజావుగా సాగుతాయి. ఈ అలవాటు కేలరీలను మెరుగ్గా దహించడానికి వీలు కల్పిస్తుంది.
» పగలంతా నీటిని కొద్దికొద్దిగా తాగడాన్ని అలవాటుగా పాటించాలి. శరీరంలో నీటిశాతం తగినంత ఉంటే కెఫిన్ డ్రింక్స్ తీసుకోవాలనే కోరిక కలగదు.


