40 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది
ముంబై: ముంబై మహానగరం అంధేరి వెస్ట్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వీర దేశాయ్ రోడ్డులో ఉన్న 23 అంతస్తుల సొర్రెంటో టవర్‌లో ఉదయం 10 గంటల సమయంలో మంటలు మొదల య్యాయి. దీంతో, 16వ అంతస్తులో చిక్కు కున్న 30 నుంచి 40 మందిని మెట్ల మార్గం ద్వారా రక్షించినట్లు ఓ అధికారి చెప్పారు. ఒక మహిళ సహా ముగ్గురిని 15వ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్ నుంచి సురక్షితంగా కిందికి దించామని చెప్పారు.
మంటల కారణంగా 10, 21వ అంతస్తుల మధ్యలోని విద్యుత్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. 12, 13, 14వ అంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. 14వ అంతస్తులో ఉంటున్న ప్రముఖ సినీ నిర్మాత సందీప్ సింగ్ నివాసం కూడా దెబ్బతింది. ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన ఆయన ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. అనంతరం సందీప్ సింగ్‌ను నటి అంకిత లొఖాండే, ఆమె భర్త వికీ జైన్ తమ ఇంటికి తీసుకెళ్లారు.


