ఆహార భద్రత అంటే పొలాల్లో పంటలు బాగా పండటం, పశువులు ఆరోగ్యంగా పెరగడం. అంతే కదా! ఇక సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు అక్కడ వరుసగా సర్ది ఉన్న తాజా పండ్లు, కూరగాయలు, నాణ్యమైన ధాన్యాలను చూసినప్పుడు మన ఆహార సరఫరా వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయాక.. ఈ సమృద్ధి, సరఫరాల వెనుక ఒక ప్రమాదం పొంచి ఉండటం కూడా కనిపిస్తుంది. అదే.. ‘డేటాబేస్ వైఫల్యం’! కంప్యూటర్ చెప్పినట్లుగా డేటాబేస్ ‘రైట్, రైట్’ అని అనకపోతే.. పండ్లు, కాయగూరలు, ఇతర ఆహార పదార్థాల లోడ్‌తో ఉన్న ట్రక్కులు ఎన్నాళ్లయినా ఎక్కడివక్కడే ఉండిపోతాయి! కదలటం ఆలస్యం అయ్యే కొద్దీ ట్రక్కులోని ఆహార, పంట పదార్థాలు పాడైపోతాయి.
మన ఆహార సరఫరా వ్యవస్థలు పైకి ఎంత స్థిరంగా, ఆధునికంగా కనిపిస్తాయో... లోపల అంతకంటే ఎక్కువగా డిజిటల్ సిస్టమ్‌లు, సాఫ్ట్‌వేర్లు, కంప్యూటర్ నెట్‌వర్క్‌ల పైన ఆధారపడి ఉంటున్నాయి. ఈ డిజిటల్ సదుపాయాలలో ఒక చిన్న సాఫ్ట్‌వేర్ లోపం వచ్చినా లేదా సైబర్ దాడి జరిగినా, లారీలకు లారీల ఆహారం మన కళ్లముందే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ దృశ్యాన్ని ఊహించుకోండి
గోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం, చికెన్, తాజా పండ్లు సిద్ధంగా ఉన్నాయి. బయట లారీలు హార్న్ కొడుతూ రవాణాకు రెడీగా ఉన్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ మీద చేతులు వేసి ‘ఎప్పుడు బయలుదేరాలి?’ అని వేచి చూస్తున్నారు. కానీ, లోపల డిజిటల్ సిస్టంలో పని నడవటం లేదు. అది నడిస్తేనే లారీ ముందుకు కదిలేందుకు అనుమతి లభిస్తుంది. సరకు రవాణా పత్రాలు ఎంతకూ రావు. ఆ పత్రాలు ఇవ్వవలసిన కంప్యూటర్.. ‘‘నా డేటాబేస్‌లో ఈ షిప్‌మెంట్‌కు ఇంకా ఆమోదం రాలేదు, కాబట్టి రవాణా పత్రాలను ఇవ్వలేను’’ అని సైలెంట్ అయిపోతుంది. అలా, ప్రజా పంపిణీకి వెళ్లవలసిన ఆహారం... కంప్యూటర్ పచ్చజెండా ఊపకపోవటం వల్ల – ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. ఎందుకంటే, ఈ రోజుల్లో ఏదైనా ఒక కంటెయినర్ ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లాలన్నా, అందులోని సరకు పంపిణీ కావాలన్నా లేదా ఇన్సూరెన్స్ పరిధిలోకి రావాలన్నా... అది తప్పనిసరిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఆటోమేటిక్ కంప్యూటర్ వ్యవస్థల ద్వారా ‘ధ్రువీకరణ’ పొంది ఉండాలి.
డిజిటల్ సిస్టమ్ ధ్రువీకరించకుంటే..?
ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆహారం ఎంత నాణ్యమైనదైనా, డిజిటల్ రికార్డుల్లో ఆ నాణ్యత నమోదు కాకపోతే దానిని సూపర్ మార్కెట్లు అంగీకరించవు. చట్టబద్ధమైన పంపిణీ అయినా సరే నిలిచిపోతుంది. సరైన సమయంలో గోదాముల నుండి బయటకు రాని పండ్లు, మాంసం, పాల వంటి తక్కువ కాలపరిమితి గల ఆహార పదార్థాలు గంటల వ్యవధిలోనే పాడైపోతాయి. ఇక చివరి నిమిషంలో సరఫరా చేసే ఆధునిక పద్ధతుల్లో ఒక్క చోట సిస్టమ్ ఆగిపోయినా, మొత్తం నెట్‌వర్క్ స్తంభించిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. డిజిటల్ వ్యవస్థల కంటికి ‘కనపడని‘ (గుర్తింపు పొందని) ఆహారం ఎంత ఉన్నా, అది నిరుపయోగంగానే మిగిలిపోతుంది.
ప్రధానమైన ముప్పులు
నేడు వ్యవసాయం నుండి ఆహార పంపిణీ వరకు ప్రతి దశలోనూ కీలక నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ డిజిటల్ సిస్టమ్‌లే నిర్దేశిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత ఆహారానికి డిమాండ్ ఉందో లెక్కిస్తున్నాయి. పంటలను ఎప్పుడు వేయాలో, ఎప్పుడు కోత కోయాలో మార్గనిర్దేశం చేస్తున్నాయి. గోదాముల్లో ఎంత సరుకు ఉంది, ఎప్పుడు పంపాలి అనే రవాణా ప్రాధాన్యాలను నిర్ణయిస్తున్నాయి. ఇలా, అత్యంత వేగంగా పనులు జరగడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఏఐ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ ఇందులో రెండు ప్రధాన ముప్పులు ఉన్నాయి. ఒకటి : మనుషులు తమ నిర్ణయాధికారం కోల్పోతారు. ఆహార పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సాఫ్ట్‌వేర్ ఏ ప్రాతిపదికన తీసుకుందో మనుషులు సులభంగా అర్థం చేసుకోలేరు, ప్రశ్నించలేరు. రెండవది : సైబర్ దాడుల భయం. శత్రుదేశాలు లేదా హ్యాకర్లు మన డిజిటల్ ఫుడ్ నెట్‌వర్క్‌లపై సైబర్ దాడులు జరిపితే, దేశం మొత్తం ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అత్యవసర సమయాలు
సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఈ డిజిటల్ విప్లవంలో అతిపెద్ద లోపం– మానవ వనరులను పక్కన పెట్టటం. కంప్యూటర్‌లతో కాకుండా మనుషులతో పని చేయించటం అనేది అనవసరమైన ఖర్చుతో కూడుకున్నదని భావించి, కంపెనీలు పాత పద్ధతులను పూర్తిగా రద్దు చేస్తున్నాయి. అత్యవసర సమయాల్లో కంప్యూటర్ సిస్టమ్‌తో పనిలేకుండా చేసి, చేతితో రికార్డులు రాసి పనులు జరిపేలా సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. ఈ కారణంగా అత్యవసర సమయంలో తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ఆహారాన్ని గోదాము నుండి బయటకు పంపే రిలీజ్ కోడ్‌లు నిలిచిపోతాయి. ముందే చెప్పినట్లు... డ్రైవర్‌లు లారీలతో సిద్ధంగా ఉన్నా, ఆమోదముద్ర లేక వేచి చూడక తప్పదు. గోదాములో టన్నుల కొద్దీ ఆహారం ఉన్నా, సర్వర్లలో సరుకు ‘సున్నా’ అని చూపించవచ్చు. కొన్ని పరిశోధనల నివేదికల ప్రకారం, సిస్టమ్ నిలిచిపోయిన 72 గంటల (3 రోజుల) తర్వాత తప్పనిసరిగా మనుషులు జోక్యం చేసుకుని కాగితాల ద్వారా రవాణా ప్రారంభించాలి. కానీ, ప్రస్తుత సిబ్బందికి కాగితపు పద్ధతులపై కనీస అవగాహన కూడా ఉండటం లేదు!
నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి?
కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆహార రంగానికి కచ్చితమైన వ్యవసాయ సమాచారం అందుతుంది. ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి? అనే వివరాలు తెలుసుకుని దిగుబడిని పెంచుకోవడం మంచిదే. అయితే సమస్యల్లా సాంకేతికతను వాడటంలో లేదు... ఆ సాంకేతికతను ఎవరు నియంత్రిస్తున్నారు? అత్యవసరంలో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? అనే దానిలోనే ఉంది. అందుకు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార వ్యవస్థల్లో ప్రతి దశలోనూ మనుషుల పర్యవేక్షణ ఉండాలి. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు పాత పద్ధతుల్లో పనులు నిర్వహించేలా సిబ్బందికి నిరంతరం మాక్ డ్రిల్స్, శిక్షణ ఇస్తుండాలి. ఆహార పంపిణీకి వాడే సాఫ్ట్‌వేర్ కోడ్‌లను, ఆల్గారిథమ్‌లను ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఆడిట్ చేసేలా పారదర్శకత ఉండాలి. కంపెనీల వ్యాపార రహస్యాల కంటే ప్రజల ఆహార భద్రతే ముఖ్యం. రైతులు, స్థానిక ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.
సేవకులే కాదు, యజమానులు కూడా!
సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి గొప్ప సేవకులు. కానీ అత్యంత ప్రమాదకరమైన యజమానులు కూడా! మనం వేగం, డబ్బు ఆదా చేసుకోవడానికి డిజిటల్ సిస్టమ్‌లపై ఆధారపడటంలో తప్పులేదు. కానీ, మన కడుపు నింపే ఆహారాన్ని బతికించేది నేల, రైతు, మనిషి శ్రమ మాత్రమే తప్ప ఒక కంప్యూటర్ కోడ్ కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.
అసలు ప్రశ్న ‘కంప్యూటర్లు లేదా డిజిటల్ వ్యవస్థలు విఫలమవుతాయా లేదా?’ అనేది కాదు... ‘ఒకవేళ కంప్యూటర్ వ్యవస్థలు విఫలమైనా తట్టుకుని నిలబడి, ప్రజలకు ఆహారాన్ని అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయా లేదా?’ అన్నదే. సాంకేతికత సమస్య వచ్చినప్పుడు కంప్యూటర్ ‘సిస్టమ్ డౌన్’ అనవచ్చు. కానీ, మానవత్వంతో కడుపు నింపే వ్యవస్థలు ఎప్పటికీ డౌన్ కాకూడదు.
– సాక్షి స్పెషల్ డెస్క్
నిజంగా జరిగిన రెండు ఘటనలు
సైబర్ దాడులు, డేటాబేస్ వైఫల్యం వంటివి భవిష్యత్తులో ఎప్పుడో రాగల అవకాశం ఉన్న ఊహాజనిత ప్రమాదాలైతే కాదు. ఇప్పటికే ప్రపంచంలో పలుచోట్ల సంభవించిన నిజమైన సంఘటనలు కొన్ని, హెచ్చరికలుగా మన కళ్ల ముందే ఉన్నాయి.
జేబీఎస్ ఫుడ్స్‌పై దాడి (2021)
బ్రెజిల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీ అయిన జేబీఎస్ ఫుడ్స్‌పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. పశువులు, పనిచేసే సిబ్బంది, గోదాములు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ... కంప్యూటర్ సిస్టమ్‌లు హ్యాక్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా, అమెరికాలోని ప్లాంట్లు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు సిస్టమ్‌ను పక్కనపెట్టి సొంతంగా పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల భారీగా ఆహారం వృథా అయ్యింది. ఇటీవల యూకేలోని ప్రధాన సూపర్ మార్కెట్ నెట్‌వర్క్‌లకు సరుకు అందించే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తటం వల్ల, షెల్ఫ్‌లు ఖాళీగా మారిపోయాయి. ఆహారం దగ్గరలోని గోదాముల్లోనే ఉన్నప్పటికీ, డెలివరీ కోడ్‌లు జనరేట్ కాకపోవడం వల్ల ప్రజలకు ఆహారం అందలేదు.


