శవపేటిక: షాప్‌లో కెమెరా ఆఫ్‌.. శ్మశానంలో కెమెరా ఆన్‌! | Funday Story On Brother Kills Brother For Property Coffin Murder Mystery | Sakshi
Sakshi News home page

శవపేటిక: షాప్‌లో కెమెరా ఆఫ్‌.. శ్మశానంలో కెమెరా ఆన్‌!

Aug 16 2026 10:25 AM | Updated on Aug 16 2026 10:25 AM

Funday Story On Brother Kills Brother For Property Coffin Murder Mystery

క్లూషియల్‌

నగర శివార్లలో శవపేటికలు తయారు చేసే డేవిడ్, తన తమ్ముడు జోసెఫ్‌ కనిపించడం లేదని ఆందోళనగా పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చాడు. ‘సార్, జోసెఫ్‌ రోజూలాగే షాప్‌కు వచ్చాడు, కానీ రాత్రికి ఇంటికి రాలేదు. నేను షాప్‌ మూసేసి వెళ్లాను కానీ, అనుమానం వచ్చి తిరిగి చూస్తే జోసెఫ్‌ లేడు.’ అని ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ములు ఇద్దరూ నగర శివార్లలో శవపేటికలు తయారు చేసే వృత్తిలో ఉన్నారు. ‘రాత్రి నా ఒంట్లో నలతగా ఉంటే పెందరాళే ఇంటికి వెళ్ళాను.’ అని డేవిడ్‌ చెప్పాడు ఆందోళన నిండిన స్వరంతో...

క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌ స్పెక్టర్‌ అభిమన్యు డేవిడ్‌ వైపు పరిశీలనగా చూశాడు. నిజం బయటపడే వరకు, సరైన సాక్ష్యం దొరికేవరకు అందరూ అనుమానితులే అని బలంగా నమ్ముతాడు అభిమన్యు.
ఇన్‌ స్పెక్టర్‌ అభిమన్యు నేరుగా శవపేటికల తయారీ షాప్‌కు చేరుకున్నాడు. షాప్‌ మొత్తం వెతికిన అభిమన్యుకు ఒక కీలక విషయం తెలిసింది. ఆ రోజు రెండు శవపేటికలకు ఆర్డర్‌ వచ్చింది. అయితే, దర్యాప్తులో తేలిందేంటంటే, ఆర్డర్‌ తీసుకున్న వ్యక్తి రెండు శవపేటికలు తీసుకువెళ్లలేదు, కేవలం ఒకటే తీసుకువెళ్లాడు. మరి రెండో శవపేటిక ఏమైంది? అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అదే రోజు పని చేయకపోవడం అనుమానానికి తావిచ్చింది. ఎవరో కావాలనే వాటిని నిలిపివేశారని అభిమన్యు గ్రహించాడు.

అభిమన్యు తన పరిశోధనను మరింత లోతుగా పెంచాడు. అతను కేవలం ఫిర్యాదుపై ఆధారపడకుండా, ఆ ప్రాంతంలోని ఇతర వ్యాపారులను విచారించాడు. జోసెఫ్‌ చివరిగా ఎవరితో మాట్లాడాడో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. శవపేటికల ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించినప్పుడు, అతనికి ఒక  విషయం స్పష్టమైంది.

వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, నగరం శివార్లలోని శ్మశానవాటిక ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించాడు. దూరంగా ఉన్న ఒక కెమెరాలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. అర్ధరాత్రి, ముఖానికి మాస్క్‌ వేసుకున్న వ్యక్తి ఒక శవపేటికను తీసుకువచ్చి అక్కడ పాతిపెడుతున్నాడు. ఆ వ్యక్తి నడక, అభిమన్యులో అనుమానాన్ని  పెంచింది. నేర పరిశోధనలో అతని మెదడు చురుగ్గా పని చేస్తుంది. వెంటనే తన బృందంతో శ్మశానానికి చేరుకున్న అభిమన్యు, ఆ కొత్తగా పాతిపెట్టిన శవపేటికను బయటకు తీయించాడు. లోపల విగతజీవిగా పడి ఉన్న జోసెఫ్‌ను చూసి అందరూ షాకయ్యారు. తమ్ముడిని డేవిడే చంపాడని అభిమన్యుకు పూర్తి స్పష్టత వచ్చింది.
∙∙
తలుపుల మీద బాదుతున్న  శబ్దం విని తాగుతున్న విస్కీ గ్లాస్‌ తీసి టీపాయ్‌ కింద దాచేసి తలుపులు తెరిచాడు డేవిడ్‌. ఎదురుగా ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యును చూసి కంగారు పడ్డాడు. ‘మీరా... మా తమ్ముడు దొరికాడా?’ అని తడబడుతూ అడిగాడు. ‘దొరికాడు.. నువ్వు చంపి దాచిపెట్టిన శవపేటికలో... నువ్వు  పాతిపెట్టిన శ్మశానంలో...’ అని అభిమన్యు డేవిడ్‌ వైపే చూస్తూ  చెప్పాడు. డేవిడ్‌ ముఖంలో రంగులు మారాయి. అప్పటికే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

‘నేనా... నేను నా తమ్ముడిని చంపుకుంటానా?’ డేవిడ్‌ కోపాన్ని నటిస్తూ అన్నాడు.
‘చంపుకుంటావు... ఎందుకంటే నీ తమ్ముడి ఆస్తిని కాజేయాలని... ఆర్డర్‌ చేసినవాళ్లు ఒక శవపేటిక మాత్రమే తీసుకువెళ్లారు. మరో శవపేటికలో నీ తమ్ముడిని చంపి శవపేటికలో పెట్టి, ఖాళీ శవపేటిక తీసుకువెళ్తున్నట్టు నమ్మించావు. నీ షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశావు. కానీ, శ్మశానంలో వున్న కెమెరాలు పనిచేయకుండా చేయలేకపోయావు. అక్కడి సమాధులు సాక్ష్యం చెప్పకపోవచ్చు. కానీ ఆ కెమెరాలు సాక్ష్యం చెప్పాయి.

ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేసి, అనుమానం రాకుండా తనే తయారు చేసిన శవపేటికలోనే శవాన్ని దాచి, ఆన్‌ లైన్‌ ఆర్డర్‌ పేరుతో దాన్ని బయటకు పంపి శ్మశానంలో పాతిపెట్టాలని డేవిడ్‌  ప్లాన్‌ చేశాడు. డేవిడ్‌ తన స్వార్థం కోసం చేసిన ఘాతుకాన్ని ఆధారాలతో సహా అభిమన్యు బయటపెట్టాడు. ‘ఆస్తి కోసం తమ్ముడిని శవపేటికలో పంపి, నువ్వు కటకటాల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యావు. నీ గురించి తెలియని నీ తమ్ముడు తన కోసం తానే శవపేటికను తయారు చేసుకున్నాడు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు డేవిడ్‌... నువ్వు కూడా ఏదో ఒకరోజు శవపేటికలోకి వెళ్లవలసిన వాడివే!’ అభిమన్యు హెచ్చరికగా అన్నాడు.

పోలీసులు డేవిడ్‌ను చుట్టుముట్టారు. కటకటాల్లోకి నెట్టారు.
‘చేసిన తప్పుకు శిక్షగా ఉరిశిక్షతో తమ్ముడిని చేరుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా వుండు’ చెప్పి బయటకు నడిచాడు ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు.

- శ్రీసుధామయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement