లిట్‌వరల్డ్
‘నేను ఒంటరిగా కూర్చుని రాసుకునే సమయంలోనే నాకు ఇతరులతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంద’న్న పాపానికి ఆ కవి, నాటకకర్త, నవలా రచయిత, సినిమా దర్శకుడు– రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార విజేత ‘ఉలిపికట్టె‘ అనే బిరుదు సంపాదించుకున్నాడు. ‘గడ్డకట్టించే చల్లదనం లాంటిది ఒంటరితనం; అది వేధించే శూన్యతలాంటిది.
అలాంటి సందర్భాల్లో, మనం మరీ అంత దిగజారిపోలేదని నచ్చజెప్పే తోడొకటి అవసరమ’ని చెప్పిన ఆ రచయితను పట్టుకుని ‘ఉలిపికట్టె‘గా జమకట్టడం సరైందేనా? ‘కళాకారుల సృజనలో జీవనగమనం ప్రతిఫలించినప్పుడే, వాళ్ళు ఆదర్శవ్యక్తులు కాగలుగుతార’న్న ఆ పెద్దమనిషిని పదిమందితో కలవడానికి ఇష్టపడని ‘నామాల కాకి’గా పరిగణించడం భావ్యమేనా? కానీ జెర్మన్ రచయిత పీటర్ హాంట్కె మొహాన యూరపియన్ పీఠాధిపతులు అవే ముద్రలు కొట్టారు. అలా మనుషుల మొహాలపై ముద్రలు కొట్టే పీఠాధిపతుల్లో చాలామందికి – సాధారణంగా – స్పందించే హృదయం ఉండదంటారు. హాంట్కె కథ వింటే ఆ మాట నిజమేననిపిస్తుంది! ముందు అతని కథ చెప్పుకుని, అప్పుడతని కళాకౌశలం గురించి చెప్పుకుందాం.
దాదాపు వెయ్యిన్నర సంవత్సరాలుగా ఆగ్నేయ యూరపులోని బాల్కన్ ద్వీపకల్పం సమీపంలో నివసిస్తున్నది సెర్బు జాతి. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, తదనంతర మారణకాండల్లోనూ తీవ్రంగా నష్టపోయిన జాతుల్లో అదీ ఒకటి. మొదటి ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 45 లక్షలు. వాళ్ళలో 17శాతం– ఎనిమిది లక్షల వరకు– ఆ యుద్ధానికి బలయ్యారు. రెండో ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 55 లక్షలు కాగా, వారిలో పదిశాతం ఆ యుద్ధంలో తుడిచిపెట్టుకు పోయారు. అటు తర్వాత 1990 నాటికి సెర్బుల జనాభా 85 లక్షలకు చేరుకుంది.
ఆ దశకంలో జరిగిన మారణకాండల్లో దాదాపు యాభైవేలమంది సెర్బులు బలైపోయారు; ఏడు లక్షలమంది ఇల్లూ వాకిలీ పొలమూ పుట్రా లేకుండాపోయారు. అలాంటి బాధిత జాతిలో పుట్టినవాడు పీటర్ హాంట్కె! ఇప్పుడు మనం ఆస్ట్రియాగా పిలిచే ప్రాంతమంతా ఒకప్పుడు ఐక్య జెర్మన్ సామ్రాజ్యంలో భాగంగా వుండేది. ఆరోజుల్లో– 1942లో– హాంట్కె అక్కడ పుట్టాడు. దక్షిణ ఆస్ట్రియాలో, కొండలూ కొలనులకు నెలవై వుండే ప్రాంతం కెరెంథియా. అందులో భాగంగా వుండే గ్రిఫిన్ అనే పట్టణం హాంట్కె స్వస్థలం.
హాంట్కె కుటుంబ జీవనం స్థిమితంగా సాగిన సందర్భం లేదనే చెప్పాలి. అతని తల్లి ప్రపంచయుద్ధాలూ– ఆర్థికమాంద్యం– ద్రవ్యోల్బణం తదితర పరిణామాల నేపథ్యంలో తెగిన గాలిపటంగా మారిన మనిషి. కాకుల్లా పొడిచే పలుగాకుల మధ్యన అలాంటి బతుకు బతకలేక 1971లో అతని తల్లి మారియా ఆత్మహత్య చేసుకుంది. ‘పుర్రచేతి వాటం స్త్రీ’ అనే నవలికను 1972లో తన తల్లి జ్ఞాపకంగా హాంట్కె రాశారు; తర్వాత నాలుగేళ్ళకు ఆ నవలికనే ‘కలలను మీరిన ఖేదం’ పేరిట స్వీయ దర్శకత్వంలో సినిమాగానూ రూపొందించారు. సినిమా రంగంతో అతనికి అంతకు పదేళ్ళకు ముందు నుంచీ సంబంధముంది.
తనే స్వయంగా నాలుగు సినిమాలు తీసిన హాంట్కె, 1969 నుంచి ’87 వరకూ విమ్మ్ వెండెర్స్ తీసిన నాలుగు సినిమాలకు స్క్రిప్టులు రాశాడు. వ్లాదిమిర్ గెరిక్ దర్శకత్వంలో రూపొందిన యుగోస్లావీన్ టీవీ ఫిల్మ్ ‘క్యాస్పర్’ స్క్రిప్టును కూడా హాంట్కెయే రచించారు. ‘క్యాస్పర్ హాసర్ జీవితకథ’గా పందొమ్మిదో శతాబ్దిలో ప్రచురమైన కల్పితగాథ ఆధారంగా హాంట్కె ముందో రూపకం రాశాడు. దాన్నే తర్వాత టీవీ స్క్రిప్టుగా రూపొందించాడు. (రడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘జంగిల్ బుక్’లోని మౌగ్లీ కూడా క్యాస్పర్ హాసర్ కోట్ జేబులోంచే ఊడిపడ్డాడంటారు! –అదలా వుంచండి.)
దృశ్యమాధ్యమాల కోసం హాంట్కె రూపొందించిన ఈ రెండు స్క్రిప్టులకూ కొంత సామ్యముంది– కొంత వైరుద్ధ్యమూ వుంది. హాంట్కె తల్లి లోకరీతి ప్రకారం బతికిన మనిషి కాదు; అలా బతకాలని ఆమె అనుకోనూ లేదు! క్యాస్పరుకు ‘నాగరికుల’ భాష రానట్లే, ఆమెకి లోకం పోకడ తెలీదు. వాళ్ళిద్దరూ– ఓ రకంగా– మూగవాళ్ళే! సామాజిక కట్టుబాట్లను ఖాతరు చెయ్యనివాళ్ళే!! అయితే, క్యాస్పర్ లోకంపోకడ ఒంటబట్టించుకుని, సామాజిక జీవనంలో కలిసి పోవాలనుకున్నాడు. కానీ, అలా చెయ్యలేకపోయాడు.
అతని మృతికి కారణమైన గాయం ఇతరులు చేసిందా? స్వయంగా తనను తానే పొడుచుకున్నాడా అనే ప్రశ్నకు గత రెండువందల యేళ్ళుగా సమాధానం దొరకనే లేదు! పోతే– మారియా మాత్రం తనకు నచ్చినట్లే బతకాలని ప్రయత్నించి, పదేపదే విఫలమై విసిగిపోయిన మనిషి. వాళ్ళ మూగ ఆవేదనలే ఇతివృత్తంగా హాంట్కె ఈ రెండు స్క్రిప్టులూ రచించాడు. కట్టుబాట్ల అరదండాల మధ్య ఊపిరిసలపని మూగవాళ్ళ మూలుగులను మనకు వినిపించిన పిల్లనగ్రోవే హాంట్కె కలం.
వాస్తవానికి, హాంట్కె రాసిన 40 నవలల్లోనూ, 15 రూపకాల్లోనూ, అసంఖ్యాకమైన అతని స్క్రీన్ ప్లేలలోనూ అంతర్లీనంగా వుండే సామాన్య సూత్రమిదే! ‘కళ అటు ఆనందంలోంచీ, ఇటు ఆవేదనలోంచీ కూడా పుడుతుంది; అయితే చాలామటుకు ఉత్తమ కళాఖండాలు వేదనలోంచే రూపుదిద్దుకుంటాయ’న్నాడు నార్వీజియన్ పెయింటర్ ఎడ్వాడ్ మూంక్. 2019లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న హాంట్కె అలాంటి అభిప్రాయాలను అంత సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ అతని సాహిత్యమంతటా అలముకుని వున్న తాత్త్వికత అదే!
- మందలపర్తి కిషోర్


