breaking news
World Literature
-
TANA: తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ 30న జరిగిన 68వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రల్ఙు సదస్సు ఘనంగా జరిగింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభిస్తూ “ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడంద్వారా కేవలం వారు గడిపిన జీవితమేగాక ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయి. అంతేగాక ఆయా ప్రముఖులు తమ జీవితాలలో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు, వాటిని అధిగమించిన తీరునుండి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చునని అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియలలో ‘జీవితచరిత్రలు’ లేదా ‘ఆత్మకథలు’ చాలా ముఖ్యభూమిక వహిస్తాయన్నారు. కృష్ణాజిల్లాలోని ‘ముదునూరు’ అనే గ్రామంలో “జీవితచరిత్రల గ్రంధాలయం్ఙ వ్యవస్థాపకులు డా. నాగులపల్లి భాస్కరరావు ఈ కార్యక్రమంలో విశిష్టఅతిథిగా పాల్గొని ఈ గ్రంధాలయ స్థాపన వెనుకఉన్న ఆశయాన్ని, అమలు జరుగుతున్న తీరుతెన్నులను సోదాహరణంగా వివరించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్నవారిలో సుప్రసిద్ధ రచయిత్రి, విద్యావేత్త ఆచార్య డా. సి. మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన “మా జ్ఞాపకాల్ఙు అనే జీవితచరిత్రను మరియు బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలను “బీనాదేవీయం్ఙ అనే గ్రంథాలలోని అనేక విషయాలను చాల హృద్యంగా ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డా. జి. వి. పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషిచేసిన తెలుగు ప్రముఖులు “అప్పయ్య దీక్షితుల్ఙు మరియు “అల్లూరి వేంకటాద్రిస్వామ్ఙి జీవిత చరిత్రలలోని అనేక విశేషాలను పంచుకున్నారు.ప్రముఖ సాహితీవేత్త, ప్రయోక్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును “రాగిణీదేవ్ఙి గా మార్చుకుని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషిచేసి నాట్యం నేర్చుకున్నదీ, నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలు రాసిందీ, తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితం అయిందీ లాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చాలా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. అలాగే తాను నమ్మిన సిద్దాంతంకోసం తన తుదిశ్వాస వరకు ఏవిధంగా గిడుగు ఒంటరి పోరాటం చేసినదీ, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు “గిడిగు వేంకట రామమూర్త్ఙి గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థులకోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరం అన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. https://www.youtube.com/watch?v=PpLUQ3jT2JU -
ఒక్క బైబిల్... వంద రచనలకు స్ఫూర్తి!
వరల్డ్ లిటరేచర్ బైబిల్ కథలు, జీసస్ జీవితం, బోధనల ఆధారంగా క్రైస్తవమతం తొలినాళ్లనుండే పశ్చిమ దేశాలలో కథలూ కావ్యాలూ రాస్తూ ఉన్నారు. ఈ రచయితల్లో కొందరిది మతదృష్టి అయితే మరి కొందరిది సామాజిక స్ఫూర్తి. తల్లిదండ్రుల్ని ఆదరించాలి, హత్య చెయ్యకూడదు, వ్యభిచారమూ దొంగతనమూ నిషిద్ధం, తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, పరస్త్రీనీ పరుల ఆస్తినీ కాంక్షించకూడదు అని ఆ దేవుడే స్వయంగా శాసించినా, నిజ జీవితంలో, నిత్యజీవితంలో జనం వాటిని ఏనాడూ తు.చ. తప్పకుండా ఆచరించలేదు. ఇలా చెయ్యడం పాపమని తెలిసినా, చట్టవ్యతిరేకమని భయపెట్టినా, దుష్టబుద్ధులకు ఇవేమీ అడ్డురాలేదు. సమాజ కల్యాణాన్ని కోరిన రచయితలు ఈ సమస్యలకే స్పందించారు. తమ కావ్యాలలో నిరసన తెలిపారు. ఉదాహరణకు, ఇటాలియన్ మహాకవి దాంతె అలిహెయిర్ (1265-1325) రాసిన డివైన్ కామెడీ, సమకాలీన అధి కారాల వర్గాల అవినీతిని ఎండగట్టడానికి సంధించిన వజ్రాయుధం. సెవెన్ డెడ్లీ సిన్స్ గురించీ, ఈ పాపాలు చేసిన ఆ నాటి ప్రముఖుల గురించీ ఇందులో ప్రస్తా విస్తాడు దాంతె. నరకం, పాపప్రక్షాళన జరిగే లోకం, స్వర్గం అనబడే మూడు లోకాలలో కవి ప్రయాణిస్తాడు. పాపులు నరకంలో అనుభవిస్తున్న శిక్షల్ని చూస్తాడు. జీవితకాలంలో వీళ్లందరూ అష్టయిశ్వర్యా లనూ అనుభవించినవాళ్లే. ఇప్పుడేమయింది వీళ్ల పరిస్థితి అని అన్యాపదేశంగా ప్రశ్నిస్తాడు. అలాగే మరో మూడు వందల ఏళ్ల తర్వాత, ఇంగ్లిష్ కవి జాన్ మిల్టన్ (1608-1674) ప్యారడైజ్ లాస్ట్ రాశాడు. ఈడెన్ ఉద్యానవనంలో ఆడమ్, ఈవ్లు నిషేధింపబడిన ఆపిల్ తిని, తమ అమరత్వాన్ని కోల్పోయిన వైనాన్ని చిత్రిస్తుందిది. భగవదాజ్ఞను ఉల్లంఘించకూడదంటాడు కవి. మిల్టన్ సమకాలీనుడే జాన్ బర్డన్ (1628-1682). మత విశ్వాసమే మనిషికి సంస్కృతి అంటాడు. 1678లో తొలిసారి అచ్చయిన ‘ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్’ అనే ఈయన పుస్తకం కేవలం క్రైస్తవ ప్రచార గ్రంథంగానే గాక, సత్ప్రవర్తన, సచ్ఛీలత ఎంత ముఖ్యమో వివరిస్తుంది. భాష కూడా సరళంగా ఉండడంతో ఇంగ్లిష్ భాషలోనే అత్యంత ప్రాచుర్యం చెందిన పుస్తకంగా కూడా పేరు గాంచింది. ఇప్పటి దాకా ఇది ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్లో లేదట. 200 భాషల్లోకి అనువాదమైన పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ గాంధీజీని బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి. ఈ క్లాసిక్స్ మాత్రమేగాక బైబిల్‌తో ప్రేరణ పొంది లేదా దాన్ని వ్యాఖ్యానిస్తూ (కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తూ కూడా) అనేకమంది నవలలు ప్రచురించారు. ఈ శతాబ్దపు తొలి రోజుల్లో హెవెన్, ఈడెన్, ఫ్లడ్‌ల గురించి మార్క్ ట్వెయిన్ రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలన్నీ కలిపి ‘ద బైబిల్ ఎకార్డింగ్ టు మార్క్ ట్వెయిన్’ పేరుతో వచ్చిన ప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. డి.హెచ్.లారె న్స్ (ద మ్యాన్ హూ డైడ్); జాన్ శరమాగో(కాయిన్; ద గాస్పెల్ ఎకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్) నార్మల్ మైలర్ (ద గాస్పెల్ ఎకార్డింగ్ టు ద సన్)లు తమ రచనలతో దుమారం లేపారు. ఇంకా పలు పాపులర్ నవలలు, బెస్ట్ సెల్లర్స్ కూడా బైబిల్ ప్రేరణతోనే వెలువడ్డాయి. ఉదాహరణకు హ్యారీపాటర్ చివరి పుస్తకంలో, కథానాయకుడు లోకకల్యాణం కోసం ఆత్మత్యాగం చేసి పునరుత్థానం పొందుతాడు. జోషస్టర్ సృష్టించిన సూపర్ మ్యాన్ ఏకైక లక్ష్యం దుష్టశిక్షణ- శిష్టరక్షణ. డాన్ బ్రాన్ రాసిన డావిన్సీ కోడ్‌కు మూలాలు బైబిల్లో ఉన్నాయని ప్రత్యే కంగా చెప్పక్కర్లేదు. మతగ్రంథాలు ఇష్టపడని వాళ్లకోసం, బైబిల్‌ను బుక్ ఆఫ్ గాడ్ (1996)పేరుతో వాల్టర్ వాంగెరిన్ ఒక నవలగా కూడా ప్రచురించాడు. ప్రస్తుతానికి ఇదో బెస్ట్ సెల్లర్. - ముక్తవరం పార్థసారథి