వెండి తాళంచెవి : ఇంట్లోకి చొరబడ్డారు.. కానీ ఒక్క వస్తువూ పోలేదు! | Silver Key Theft Three Thieves Justice Moral Story | Sakshi
Sakshi News home page

వెండి తాళంచెవి : ఇంట్లోకి చొరబడ్డారు.. కానీ ఒక్క వస్తువూ పోలేదు!

Aug 16 2026 11:59 AM | Updated on Aug 16 2026 11:59 AM

Silver Key Theft Three Thieves Justice Moral Story

ఫండే

పిల్లల కథ

చంద్రయ్య సీతాపురం గ్రామం నుంచి సంతకు బయలుదేరాడు. తోవలో వెళుతుండగా, అతడికి ఒక వెండి తాళంచెవి దొరికింది. దానిని తీసుకువెళుతుండగా, ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ‘‘నా పేరు భూషయ్య. నేను ఈ ఊరికి కొత్త. సంతకు ఎలా వెళ్లాలి?’’ అని అడిగాడు.
‘‘నాతో పాటు రా చూపిస్తాను’’ అన్నాడు చంద్రయ్య. 
కలిసి నడుస్తూ, ‘‘నీ పేరెంటి?’’ అని అడిగాడు భూషయ్య. 
‘‘నా పేరు చంద్రయ్య’’ అన్నాడు.
‘‘అబ్బో!.. నీ చేతిలో వెండి తాళంచెవి ఉంది. అంటే ఇంటికి వెండి తాళం వేసి వచ్చావన్నమాట’’ అన్నాడు భూషయ్య.

‘‘అదేం కాదు ఇది నాకు దారిలో దొరికింది. ఏం చేద్దామా? అని ఆలోచిస్తున్నాను’’ అన్నాడు చంద్రయ్య. ‘‘ఇందులో ఆలోచించడానికేముంది? ఈ తాళం చెవితో ఆ ఇంటి తాళం తెరవచ్చు’’ అన్నాడు భూషయ్య. 
‘‘అంటే దొంగతనం చేద్దామంటావా?’’ అన్నాడు చంద్రయ్య. 
‘‘అవును ఇది చాలా సులువైన పని. ఎందుకంటే తాళం చెవి ఉంది కదా! వెండి తాళం వేసి ఉన్న ఇల్లు గుర్తించడం చాలా సులువు’’ అన్నాడు భూషయ్య. 
‘‘సరే పద... ఆ ఇల్లు ఏ వీధిలో ఉందో వెదుకుదాము’’ అన్నాడు చంద్రయ్య.

దారిలో భూషయ్యకు ఒక లావుపాటి దారం దొరికింది. అది తీసుకుని చంద్రయ్య వద్ద తాళంచెవి తీసుకుని, దానిని దారానికి మధ్యలో ముడి వేసి ‘‘ఈ దారాన్ని ఇద్దరం చెరో వైపు పట్టుకుందాం’’ అన్నాడు భూషయ్య. 
‘‘అలాగే’’ అన్నాడు చంద్రయ్య. 
ఇద్దరూ వెళుతుండగా ఒక లావుపాటి మనిషి ఎదురై, ‘‘ఏంటి తాళం చెవిని చెరో వైపు పట్టుకున్నారు?’’ అని అడిగాడు. వాళ్ళు విషయం చెప్పారు.
‘‘అలాగా నా పేరు భీమయ్య నాకు బాగా బలం ఉంది. నేను కూడా దొంగతనానికి సిద్ధం!. నేను కూడా వస్తాను’’ అన్నాడు. 
‘‘సరే పద’’ అన్నారు ఇద్దరూ.

వీధిలో వెండితాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది. ముగ్గురూ ఆ ఇంటి వద్దకు వెళ్ళి ఆ తాళంచెవితో తాళాన్ని తెరిచి, ఇంటి గడియ తీసి లోపలకు వెళ్లారు. 
‘‘అబ్బో..! ఇల్లు చాలా బాగుంది. మనం అలసిపోయి ఉన్నాం. ముందుగా ఏమైనా తిందాము’’ అన్నాడు భీమయ్య. 
‘‘అలాగే’’ అన్నారు చంద్రయ్య, భూషయ్యలు. 
బల్ల మీద కొన్ని రకాల పండ్లు కనిపించాయి వారికి. వాటిని ముగ్గురూ సమంగా పంచుకుని తింటుండగా బయట నుండి గడియ పెట్టిన చప్పుడు అయ్యింది.
‘‘ఎవరో గడియ పెట్టినట్టున్నారు. ఇప్పుడెలాగ?’’ అన్నాడు చంద్రయ్య. 

‘‘ఆ... ఏం భయం లేదు నేనున్నాగా!’’ అన్నాడు భీమయ్య. 
కాసేపటికి గడియ తీసిన చప్పుడయ్యింది నలుగురు భటులతో ఒకతను వచ్చి ‘‘ఊ... ఈ దొంగలను బంధించండి’’ అన్నాడు. భటులు ఆ ముగ్గురునీ బంధించి కోటకు తీసుకెళ్లారు.
రాజు కొలువుతీరి ఉన్నాడు. ‘‘మహారాజా! నేను నా ఇంటి తాళం చెవిని పోగొట్టుకున్నాను. అది వీరికి దొరికినట్టుంది నా ఇంటి తాళం తీసి దర్జాగా కూర్చుని పండ్లు ఆరగిస్తుండగా పక్క వీధిలో మంత్రిగారి ఇంటి వద్ద ఉన్న భటులను పిలిచి బంధించి తెచ్చాను’’ అన్నాడు విదూషకుడు.

‘‘మహారాజా! మేము దొంగలం కాదు. మాకు వెండి తాళంచెవి దొరికింది. దానితో దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది’’ అన్నారు ముగ్గురూ. న్యాయాధికారి సలహా అడిగాడు రాజు.
‘‘మీ ఇంట్లో వస్తువులు ఏమైనా పోయాయా?’’ అని విదూషకుణ్ణి అడిగాడు న్యాయాధికారి.
‘‘ఏమీ పోలేదు.’’ అన్నాడు విదూషకుడు. 
‘‘నీవు కోటలో పని చేస్తున్నావని అందరికీ తెలియాలని ఇంటికి వెండి తాళం వేశావా?’’ అన్నాడు న్యాయాధికారి. 
‘‘తప్పయ్యింది’’ అన్నాడు విదూషకుడు.

‘‘మన రాజ్యంలో దొంగతనాలకు తావు లేదు. వేసి ఉన్న ఇంటి తాళం తెరవడం నేరం. ఆకలి తీరాక ఈ ముగ్గురూ కచ్చితంగా దొంగతనం చేసేవారు. మహారాజా! వీరికి మూడు మాసాలు చెరసాల శిక్షతో పాటు చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి జీవనోపాధి కల్పించగలరు. అలాగే దొంగతనానికి ప్రేరణ కలిగించింది వెండితాళం. అందుకు కారణం మన విదూషకుడు ఇతనికి కూడా పది రోజుల పాటు చెరసాల శిక్ష విధించండి మహారాజా!’’ అని అన్నాడు న్యాయాధికారి.
మహారాజు అలాగే ఉత్తరువులు జారీ చేశాడు.
- యు.విజయశేఖర రెడ్డి

హితవచనం..
'అనర్హేధికృతి శోచ్యా యథార్హస్య పదచ్యుతిః
దుష్టేషు కరుణా దూష్యా సాధుష్వపకృతిర్యథా'
అర్హుడికి అధికారం పోతే ఎంత విచారించాలో, అనర్హుడికి అధికారం దక్కినప్పుడు అంతే విచారించాలి. సజ్జనులకు అపకారం జరిగితే ఎంత బాధపడాలో, దుష్టుల పట్ల జాలి చూపినా అంతే బాధపడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement