కథాకళి
డిటెక్టివ్‌లు ఇద్దరూ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయ్ చెప్పిన అడ్రస్‌కి చేరుకున్నారు.
హతుడి శవం బెడ్‌రూమ్‌లో మంచంమీద ఉంది. ‘ఆయన వయసు అరవై ఐదు, డెబ్భై మధ్య ఉండచ్చ’ని డిటెక్టివ్ పెద్దబ్బాయి అనుకున్నాడు.
‘‘ఈయన పేరు ఐలయ్య. కోటీశ్వరుడు. ఉదయం బట్లర్ నిద్ర లేచేసరికి ఇలా కనిపించాడు. డాక్టర్ ప్రాథమిక పరీక్ష ప్రకారం ఎనిమిది గంటల క్రితం గొంతు పిసికి చంపబడ్డాడు. తెల్లవారుజామున. ఈయన ఆస్తికి ఇద్దరు వారసులు. కొడుకు వయసు ముప్ఫై ఎనిమిది, కూతురి వయసు ముప్ఫై రెండు. రాత్రిళ్ళు ఇంట్లో పనివాడు మాత్రమే ఉంటాడు.’’ ఇన్ స్పెక్టర్ వివరించాడు.
పెద్దబ్బాయి ఆ గదిని పరిశీలనగా చూసి తల ఊపాడు. మంచం చుట్టూ తిరిగి, దాని వెనుక నేల మీద పడివున్న టూత్‌పిక్ తీసి పరిశీలించాడు.
‘‘దాని మీద వేలిముద్రలు దొరకవు.’’
ఇన్ స్పెక్టర్ చెప్పాడు.
‘‘కాని పళ్ళముద్రలు, డీఎన్‌ఏ దొరుకుతాయి. హంతకుడితో హతుడు పెనుగులాడినప్పుడు హంతకుడి నోట్లోంచి ఇది నేల మీదికి పడి ఉంటుంది.’’
‘‘అది హంతకుడిదే అని ఎలా చెప్పగలరు? హతుడిదీ అయి ఉండొచ్చుగా?’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి ప్రశ్నించాడు.
‘‘పరిశీలన. ఊహ. ఈ రెండింటినీ ఉపయోగించాను. శవం పళ్ళని పరిశీలిస్తే ఆయనవి కట్టుడు పళ్ళని తెలిసింది. వాళ్ళకి టూత్‌పిక్ అవసరం ఉండదు. రాత్రిళ్ళు నక్షత్రాల్లా డెంచర్లు కూడా బయటికి వస్తాయి. రాత్రి వాటిని నీళ్ళల్లో ఉంచి, ఉదయం శుభ్రం చేసి పెట్టుకుంటారు. మీ సార్ టూత్‌పిక్స్ వాడుతారా?’’ పెద్దబ్బాయి పనివాడి వైపు చూసి అడిగాడు.
అతను తల అడ్డంగా ఊపాడు.
‘‘నిన్న రాత్రి మీ అయ్యగారిని ఆఖరిసారి ఎప్పుడు చూశావు?’’
‘‘రాత్రి పదిన్నరకి పాలగ్లాస్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి, రెండో అంతస్తులోని నా గదికి వెళ్ళాను. ఉదయం ఆరున్నరకి కిందికి వచ్చాక చూశాను. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను.’’
‘‘దొంగతనంగా ఇంట్లోకి ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు సార్.’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఇల్లంతా తిరిగి చూసి వచ్చి చెప్పాడు.
‘‘ఈ ఇంటి డూప్లికేట్ తాళంచెవులు ఎవరి దగ్గర ఉన్నాయి?’’
‘‘వీరి పిల్లలు... కూతురు, కొడుకుల దగ్గర.’’ పనివాడు జవాబు చెప్పాడు.
‘‘వాళ్ళు నిన్న వచ్చారా?’’
‘‘ఇవాళ ఆయన విల్లు రాయాలని అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం కొడుకు వచ్చి ఆస్తిని ఆయన ఇంటి పేరుగల వారికే, అంటే తనకే రాయాలని కోరాడు. ఆయన కూతురు సాయంత్రం వచ్చి, తన తల్లి తన అన్నని ఎలా కష్టపడి కన్నదో తనని కూడా అలాగే కన్నదని, తనకి సగం ఆస్తి రాయడం న్యాయమని కోరింది.’’
‘‘వాళ్ళిద్దరిలో ఎవరికి టూత్‌పిక్ అలవాటు ఉంది?’’
‘‘కొడుక్కి ఉంది. నాకు అదే ఆశ్చర్యం. సినిమాల్లో విలన్లు టూత్‌పిక్‌లు నోట్లో పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతుంటారు కదా! అతను అచ్చం అలా తిప్పుతాడు.’’
‘‘నువ్వు ఇల్లు సరిగ్గా ఊడుస్తావా?’’
‘‘ఊడుస్తాను సార్.’’
‘‘మరి ఈ టూత్‌పిక్ ఊడవలేదే?’’
‘‘అది నిన్న రాత్రి ఏడు తర్వాత పడి ఉంటుంది. నేను ప్రతి సాయంత్రం చీకటి పడకముందే వాక్యూమ్ చేస్తాను.’’
కబురు అందుకుని ఆయన కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు వచ్చారు. కొడుకు, అల్లుడి నోళ్ళల్లో టూత్‌పిక్‌లు ఉన్నాయి. ఆ నలుగురి కళ్ళ వెంటా నీళ్ళు కారుతున్నాయి.
‘‘మీరు మీ నోట్లోని టూత్‌పిక్‌ని ఇస్తారా?’’ పెద్దబ్బాయి తనని పరిచయం చేసుకుని అడిగాడు.
‘‘దేనికి?’’ ఇద్దరూ ఇచ్చి ఆశ్చర్యంగా అడిగారు.
‘‘హంతకుడిని కనుక్కోడానికి.’’
పెద్దబ్బాయి టూత్‌పిక్‌లని పరిశీలించి,
ఇన్ స్పెక్టర్ వైపు తిరిగాడు.
‘‘మిస్టర్ ఇన్ స్పెక్టర్. దయచేసి హంతకుడిని అరెస్టు చేయండి. అల్లుడిదే ఈ గిల్లుడు.’’
‘‘ఎలా చెప్పగలరు?’’ అల్లుడు అదిరిపడి అడిగాడు.
‘‘మీ మామగారి గొంతు పిసికినప్పుడు కిందపడ్డ మీ టూత్‌పిక్ చెప్పింది.’’
‘‘అది నాదేనని ఏమిటి? నా బావమరిదిదై ఉండొచ్చుగా?’’ సీరియస్‌గా అడిగాడు.
‘‘మిస్టర్ అల్లుడు. టూత్‌పిక్స్ రెండు రకాలు ఉన్నాయి. పిసినారి వాళ్ళ కోసం చేసే వాటికి అటూ ఇటూ సూది మొనలు ఉంటాయి. కాని మామూలు వాళ్ళు వాడే వాటికి వాడి మొన ఒకవైపు మాత్రమే ఉంటుంది. అది మీ బావమరిదిదైతే రెండో వైపు మొన ఉండేది కాదు. ఇల్లు ఊడ్చాక తెల్లారజామున మీరీ హత్య చేయడంతో నా పని తేలికైంది. మీరు ఇది మీ పని కాదనడం సహజం. అది ప్రతి నేరస్తుడి వాదనే. కాని డీఎన్‌ఏ క్లూని ఎవరూ కాదనలేరు.’’
అల్లుడు బయటకి వేగంగా నడుస్తూంటే కాన్ స్టబుల్స్ ఆపారు.
లోపలకి వస్తున్న ఓ ఏభై ఏళ్ళ వ్యక్తిని చూసి పెద్దబ్బాయి చెప్పాడు.
‘‘మీరు లాయరైతే ఇక మీకు ఇక్కడ పని లేదు.’’
- మల్లాది వెంకట కృష్ణమూర్తి


