breaking news
Tooth picks
-
అడవిలో పెద్దపులికైనా తప్పని కష్టంరా సామీ అది!
మాంసాహారం తిన్నతరువాత ఒక విచిత్రమైన ఇబ్బంది ఉంటుంది. చికెన్ లేదా మటన్ కర్రీని లొట్టలేసుకుంటూ తిన్నంత సేపు బాగానే ఉంటుంది కానీ మాంసపు తునకలు పళ్ల సందుల్లో ఇరుక్క పోయినపుడు ఇబ్బంది ఉంటుంది కదా నా సామి రంగా. వాటిని తొలగించేందుకు టూత్ పిక్‌లు, పిన్సీసులతో పెద్ద యుద్ధమే చేయాలి. ఏదీ లేకపోతే.. చివరికి నాలుకతో అయినా సరే దాన్ని లాగి పడేసేదాకా మనశ్శాంతి ఉండదు. అడవిలో ఒక పులికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఒక పెద్ద మాంసం ముక్క దాని పంటిలో చిక్కుకుంది. దీంతో నానా కష్టాలు పడుతున్న పులిని చూసిన వెటర్నరీ వైద్యులు దాని కోరల్లో ఇరుక్కున్న మాంసం ముక్కను లాగి పడేశారు. కేవలం 16 సెకన్లుఉన్న ఈ వీడియో 30.3 లక్షలకుపైగా వ్యూస్‌ను దక్కించుకుంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.Vet removing a bone stuck to a tigers tooth pic.twitter.com/WjmqFNw8fZ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 15, 2024 -
భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడుతున్నారా?
కొందరికి పళ్ల సందుల్లోనూ, చిగుర్ల మధ్య సందులు కాస్త ఎక్కువగా ఉంటాయి. భోజనం చేసిన ప్రతిసారీ ఆహారపదార్థాలు ఇరుక్కుంటుంటాయి. ఏదో నాన్‌వెజ్ తిన్నప్పుడో లేదా పీచుపదార్థాల్లాంటివి ఇరుక్కున్నప్పుడో ఎప్పుడో ఓసారి టూత్‌పిక్ వాడాల్సి వస్తే పట్టించుకోనక్కర్లేదుగానీ... ఇలా ప్రతిసారీ చేయాల్సివస్తే... జింజివైటిస్ అనే సమస్యకు అవకాశాలెక్కువ. దంతాలు ఇమిడి ఉండే చిగుర్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షనే జింజివైటిస్. ఈ సమస్య తీవ్రమైతే చిగుర్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకూ వ్యాపిస్తుంది. ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుర్ల వ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ వ్యాధి అడ్వాన్స్డ్ దశలోకి వెళ్తే ఫ్లాప్ సర్జరీ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇందులో ఎముక చుట్టూ ఉండిన చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. దీన్ని లేజర్ ద్వాదా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స సాధ్యమవుతుంది. లేజర్ చికిత్సలో సంప్రదాయ చికిత్స కంటే వేగంగా కోలుకుంటారు. భోజనం తర్వాత ప్రతిసారీ టూత్‌పిక్ వాడాల్సి వస్తే... ఒకసారి చిగుర్ల సమస్య ఏదైనా వచ్చిందేమో పరీక్షింపజేసుకోవాలి. చదవండి: ‘తిట్టే నోరే కాదు, అతిగా తినే నోరు కూడా ప్రమాదకరమే’ -
ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?
నా వయసు 35. ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. భోజనం చేసిన వెంటనే పుల్లలతో కుట్టుకుంటే తప్ప తృప్తిగా ఉండదు. పళ్ల మధ్య ఏర్పడిన జాగాలో ఫిల్లింగ్ చేయించవచ్చంటారా? సలహా ఇవ్వండి. - పరమేశ్, హైదరాబాద్ ఇది చాలామంది సమస్య. మనం ఏ హోటల్‌కెళ్లినా బిల్లుతోబాటు టూత్‌పిక్స్ కూడా ఇవ్వడం పరిపాటి. ప్రతి పదిమందిలో ఎనిమిదిమంది పుల్లలతో పళ్లసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం చూస్తుంటాం. అందరి దృష్టిలో ఇది సాధారణమైన పనే. ఇదేదో సాధారణమైన పనే అనే భావన అందరిలోనూ ఉంది. కాని, ఎవరైతే ఇలా టూత్‌పిక్ వాడాల్సి వస్తోందో, వీళ్లందరికీ కూడా చిగుళ్ల జబ్బులున్నట్టు లెక్క. ఏదోరకమైన చిగుళ్ల జబ్బు లేదా ఇన్ఫెక్షన్ వల్ల రెండు పళ్లమధ్య సందుల్లో ఉన్న చిగుళ్లు కిందకు జారిపోతాయి. దాంతో ఆహారం అక్కడికి చేరుతుంది. దాంతో అసౌకర్యంగా ఉండి అలా పళ్లు కుట్టుకుంటుంటారు. పుల్లలతో కానీ, పిన్నులతో కానీ పూర్తిస్థాయిలో క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా చేయడం మంచిది కూడా కాదు. అలాగే ఇట్లా కుట్టుకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా చూస్తుంటాం. అలా ఇరుక్కున్న ఆహారాన్ని తీసేటప్పుడు మనకు తెలీకుండానే సగం చిగుళ్ల లోపలికి తోసేస్తుంటాం. దాంతో ఇన్ఫెక్షన్లు పెరిగి, సమస్య మరింత తీవ్రమవుతుంటుంది. అలాంటప్పుడు తగిన చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం. చిత్రం ఏమిటంటే... పుల్లలతో కుట్టుకుంటున్న వారిని వారికి చిగుళ్ల జబ్బు ఉందంటే ఒప్పుకోరు. కారణం వారికి ఎటువంటి నొప్పి, బాధ లేకపోవడమే. డెంటిస్ట్‌ని కలిస్తే ఎక్స్‌రే తీసి చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఎంతుందో చూసి, ప్రత్యేకమైన చిగుళ్ల చికిత్స చేయడం ద్వారా సమస్యను దూరం చేస్తారు. సందులు కనుక మరీ పెద్దవిగా ఉంటే పంటికి తొడుగులు వేయడం ద్వారా కూడా సందును మూసేస్తారు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకోవడానికి డెంటల్ ఫ్లాస్ అనబడే సన్నటి నైలాన్ దారాన్ని వాడాలి. ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్లలో కూడా దొరుకుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ డెంటల్ ఫ్లాస్ అన బడే దారాన్ని రెండు చేతుల వేళ్లతో పళ్లమధ్య పోనిచ్చి ఇటు, అటు లాగుతూ శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మొత్తం పాచిని, ఆహారపదార్థాలను ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా చూసుకోవచ్చు. ఈ డెంటల్ ఫ్లాస్ సుమారు 5-6 మీటర్ల దూరం చిన్న బాక్స్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంతవరకైతే ఈ దారాన్ని వాడతామో, దాన్ని తుంచేసి, మిగిలిన దానిని తర్వాత వాడుకోవచ్చు. మీ పళ్లమధ్య సందులని డాక్టర్‌తో పరీక్ష చేయించుకుని, డెంటిస్ట్ సూచనల మేరకు చిగుళ్ల చికిత్స చేయించుకోవడం, సందును పూడ్చడానికి ఫిల్లింగ్ లేదా క్యాప్ చేయించడం ద్వారా మీ సమస్య నుంచి బయట పడవచ్చు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్