ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..? | food is going in between teeth.. any solution? | Sakshi
Sakshi News home page

ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?

Aug 31 2013 12:44 AM | Updated on Sep 1 2017 10:17 PM

ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?

ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటోంది..?

ఇది చాలామంది సమస్య. మనం ఏ హోటల్‌కెళ్లినా బిల్లుతోబాటు టూత్‌పిక్స్ కూడా ఇవ్వడం పరిపాటి. ప్రతి పదిమందిలో ఎనిమిదిమంది పుల్లలతో పళ్లసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం చూస్తుంటాం.

నా వయసు 35. ఏమి తిన్నా పళ్ల సందుల్లో ఇరుక్కుంటుంది. భోజనం చేసిన వెంటనే పుల్లలతో కుట్టుకుంటే తప్ప తృప్తిగా ఉండదు. పళ్ల మధ్య ఏర్పడిన జాగాలో ఫిల్లింగ్ చేయించవచ్చంటారా? సలహా ఇవ్వండి.
 - పరమేశ్, హైదరాబాద్

 
ఇది చాలామంది సమస్య. మనం ఏ హోటల్‌కెళ్లినా బిల్లుతోబాటు టూత్‌పిక్స్ కూడా ఇవ్వడం పరిపాటి. ప్రతి పదిమందిలో ఎనిమిదిమంది పుల్లలతో పళ్లసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం చూస్తుంటాం. అందరి దృష్టిలో ఇది సాధారణమైన పనే. ఇదేదో సాధారణమైన పనే అనే భావన అందరిలోనూ ఉంది.

కాని, ఎవరైతే ఇలా టూత్‌పిక్ వాడాల్సి వస్తోందో, వీళ్లందరికీ కూడా చిగుళ్ల జబ్బులున్నట్టు లెక్క. ఏదోరకమైన చిగుళ్ల జబ్బు లేదా ఇన్ఫెక్షన్ వల్ల రెండు పళ్లమధ్య సందుల్లో ఉన్న చిగుళ్లు కిందకు జారిపోతాయి. దాంతో ఆహారం అక్కడికి చేరుతుంది. దాంతో అసౌకర్యంగా ఉండి అలా పళ్లు కుట్టుకుంటుంటారు. పుల్లలతో కానీ, పిన్నులతో కానీ పూర్తిస్థాయిలో క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. ఇలా చేయడం మంచిది కూడా కాదు. అలాగే ఇట్లా కుట్టుకుంటున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం కూడా చూస్తుంటాం.

అలా ఇరుక్కున్న ఆహారాన్ని తీసేటప్పుడు మనకు తెలీకుండానే సగం చిగుళ్ల లోపలికి తోసేస్తుంటాం. దాంతో ఇన్ఫెక్షన్లు పెరిగి, సమస్య మరింత తీవ్రమవుతుంటుంది. అలాంటప్పుడు తగిన చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం. చిత్రం ఏమిటంటే... పుల్లలతో కుట్టుకుంటున్న వారిని వారికి చిగుళ్ల జబ్బు ఉందంటే ఒప్పుకోరు. కారణం వారికి ఎటువంటి నొప్పి, బాధ లేకపోవడమే. డెంటిస్ట్‌ని కలిస్తే ఎక్స్‌రే తీసి చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఎంతుందో చూసి, ప్రత్యేకమైన చిగుళ్ల చికిత్స చేయడం ద్వారా సమస్యను దూరం చేస్తారు. సందులు కనుక మరీ పెద్దవిగా ఉంటే పంటికి తొడుగులు వేయడం ద్వారా కూడా సందును మూసేస్తారు.

రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని శుభ్రం చేసుకోవడానికి డెంటల్ ఫ్లాస్ అనబడే సన్నటి నైలాన్ దారాన్ని వాడాలి. ఇది అన్ని మెడికల్ షాపుల్లోనూ, సూపర్ బజార్‌లలో కూడా దొరుకుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ డెంటల్ ఫ్లాస్ అన బడే దారాన్ని రెండు చేతుల వేళ్లతో పళ్లమధ్య పోనిచ్చి ఇటు, అటు లాగుతూ శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మొత్తం పాచిని, ఆహారపదార్థాలను ఎటువంటి సైడ్ ఎఫెక్టులూ లేకుండా చూసుకోవచ్చు. ఈ డెంటల్ ఫ్లాస్ సుమారు 5-6 మీటర్ల దూరం చిన్న బాక్స్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎంతవరకైతే ఈ దారాన్ని వాడతామో, దాన్ని తుంచేసి, మిగిలిన దానిని తర్వాత వాడుకోవచ్చు.
 
మీ పళ్లమధ్య సందులని డాక్టర్‌తో పరీక్ష చేయించుకుని, డెంటిస్ట్ సూచనల మేరకు చిగుళ్ల చికిత్స చేయించుకోవడం, సందును పూడ్చడానికి ఫిల్లింగ్ లేదా క్యాప్ చేయించడం ద్వారా మీ సమస్య నుంచి బయట పడవచ్చు.
 
 డాక్టర్ పార్థసారథి,
 కాస్మటిక్ డెంటల్ సర్జన్,
 పార్థా డెంటల్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement