రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్‌! | Beaten Coffee Kashmiri Mutton Rogan Josh Dharwad Peda Recipes | Sakshi
Sakshi News home page

రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్‌!

Aug 16 2026 1:42 PM | Updated on Aug 16 2026 1:41 PM

Beaten Coffee Kashmiri Mutton Rogan Josh Dharwad Peda Recipes

స్నాక్‌ సెంటర్‌!

వేడివేడి బీటెన్‌ కాఫీ నుంచి ఘుమఘుమలాడే కాశ్మీరీ మటన్‌ రోగన్‌ జోష్‌ వరకు.. చివర్లో నోట్లో కరిగే ధార్వాడ్‌ పేడాతో ఈరోజు మీ రుచుల పండుగను పూర్తి చేసుకోండి. సులభమైన తయారీ విధానంతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మూడు వంటకాలు రుచితోపాటు ప్రత్యేకతను కూడా అందిస్తాయి. మరి ఈ వంటకాల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

బీటెన్‌ కాఫీ..
కావలసినవి:
ఇన్‌ స్టంట్‌ కాఫీ పొడి: 2 టేబుల్‌ స్పూన్లు,
పంచదార: 2 టేబుల్‌ స్పూన్లు,
వేడి నీళ్లు: 2 టేబుల్‌ స్పూన్లు,
పాలు: 2 కప్పులు (చిక్కటివి),
గార్నిష్‌ కోసం: కొద్దిగా కోకో పౌడర్‌ లేదా కాఫీ పొడి.

తయారీ:

  • ఒక కప్పులో లేదా గిన్నెలో 2 టేబుల్‌ స్పూన్ల కాఫీ పొడి, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార, రెండు టేబుల్‌ స్పూన్ల వేడి నీళ్లు పోయాలి.

  • మొదట్లో ఇది చిక్కటి నల్లని ద్రవంలా కనిపిస్తుంది.

  • ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్‌ లేదా విస్కర్‌తో వేగంగా తిప్పుతూ చిలకాలి.

  • తిప్పుతున్న కొద్దీ కాఫీ రంగు నలుపు నుంచి క్రమంగా లేత గోధుమ వర్ణంలోకి మారి, చిక్కటి నురగలాగా తయారవుతుంది.

  • ఒక పాత్రలో రెండు కప్పుల పాలను బాగా మరిగించాలి.

  • పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేయాలి.

  • ఇపుడు మనం తయారుచేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్‌ను రెండు సర్వింగ్‌ కప్పులలో సమానంగా వేయాలి.

  • దానిపై వేడివేడి పాలను కొద్దిగా పైనుంచి ధారగా పోయాలి.

  • ఇలా పోయడం వల్ల కాఫీ క్రీమ్‌ పైన తేలుతూ మంచి నురగలా వస్తుంది.

  • స్పూన్‌ తో మెల్లగా ఒకసారి కలిపి, పైన కొద్దిగా కోకో పౌడర్‌ లేదా కాఫీ పొడి జల్లి వేడివేడిగా సర్వ్‌ చేయడమే! కాఫీ చిలికేటప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే, చుక్కల చొప్పున వేడి నీళ్లను మాత్రమే చేర్చుకోవాలి.

కాశ్మీరీ మటన్‌ రోగన్‌ జోష్‌
కావలసినవి:
మటన్‌: 1/2 కేజీ,
నెయ్యి : 4–5 టేబుల్‌ స్పూన్లు,
పెరుగు: 1/2 కప్పు,
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి),
అల్లం వెల్లుల్లి పేస్ట్‌: అర టీస్పూన్,
కశ్మీరీ మిర్చి పౌడర్‌: 2 టేబుల్‌ స్పూన్లు,
సోంపు పౌడర్‌: టేబుల్‌ స్పూన్,
సొంటి పొడి: అర టీస్పూన్,
హోల్‌ గరం మసాలాలు: ఏలకులు (4), లవంగాలు (4), దాల్చిన చెక్క (2 ముక్కలు), బిర్యానీ ఆకు (2), గరం మసాలా పొడి 1/2 టీస్పూన్,
ఉప్పు: రుచికి సరిపడా.

తయారీ:

  • ముందుగా మటన్‌ ను శుభ్రంగా కడిగి, అందులో చిలికిన పెరుగు, కొద్దిగా కశ్మీరీ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

  • ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగించాలి.

  • అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

  • ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి.

  • ఇప్పుడు మ్యారినేట్‌ చేసి పెట్టుకున్న మటన్‌ ను వేసి మీడియం ఫ్లేమ్‌పై 8–10 నిమిషాలు బాగా వేయించాలి.

  • మటన్‌ నుంచి నీరు బయటకు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి.

  • అందులో సోంపు పొడి, సొంటి పొడి, మిగిలిన కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి.

  • తగినంత నీరు పోసి మూత పెట్టి మటన్‌ మెత్తగా ఉడికించుకోవాలి.

  • చివరగా పైన గరం మసాలా చల్లుకొని, నెయ్యి పైకి తేలే వరకు సన్నని మంటపై 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే! ఘుమఘుమలాడే వేడివేడి కాశ్మీరీ మటన్‌ రోగన్‌ జోష్‌ సిద్ధమైనట్లే! దీనిని వేడివేడి అన్నం, నాన్‌ లేదా పరాటాతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

ధార్వాడ్‌ పేడా
కావలసినవి:
చిక్కటి పాలు: ఒకటిన్నర లీటరు (తాజా పనీర్‌ కోసం),
నిమ్మరసం: 2 టేబుల్‌ స్పూన్లు,
చక్కెర: ముప్పావు కప్పు (తీపికోసం), మరో 2 టేబుల్‌ స్పూన్లు క్యారమెల్‌ కోసం,
నెయ్యి: 4 టేబుల్‌ స్పూన్లు,
పాలు: పావు కప్పు,
ఏలకుల పొడి: అర టీస్పూన్,
చక్కెర పొడి: 3 టేబుల్‌ స్పూన్లు.

తయారీ:

  • ముందుగా పాలను మరిగించి, అందులో  కొద్దికొద్దిగా నిమ్మరసం వేస్తూ కలపాలి.

  • పాలు విరిగి నీరు వేరయ్యాక, కాటన్‌ క్లాత్‌లో వడకట్టి, తిరిగి చల్లని నీటితో కడిగి నీళ్లన్నీ పిండేయాలి.

  • వడకట్టిన పనీర్‌ను ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసి కలుపుతూ ఎక్కడా గడ్డలు లేకుండా మెత్తటి ముద్దలా చేసుకోవాలి.

  • ఆ తరువాత ఒక బాణలిలో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి పనీర్‌ తురుమును వేయాలి.

  • సన్నని మంటపై కలుపుతూ వేయించాలి.

  • పనీర్‌ పొడిగా మారుతున్నప్పుడు మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి, పాలు చల్లుతూ వేయించాలి.

  • పనీర్‌ గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.

  • ఆ తరువాత మరొక చిన్న పాత్రలో 2 స్పూన్ల చక్కెర వేసి సన్నని మంటపై నీళ్లు పోయకుండా కరగనివ్వాలి.

  • చక్కెర బ్రౌన్‌ కలర్‌ క్యారమెల్‌గా మారిన వెంటనే వేయించిన పనీర్‌లో పోయాలి.

  • అలాగే చక్కెర, ఏలకుల పొడి, 2 స్పూన్ల పాలు వేసి చక్కెర కరిగే వరకు కలపాలి.

  • మిశ్రమం దగ్గరపడి డార్క్‌ రంగులోకి వస్తుంది. ఇపుడు దీనిని కొద్దిగా చల్లారనిచ్చి, మిక్సీ జార్‌లో వేసి ఒక్కసారి పల్స్‌ చేసి తీస్తే మెత్తగా తయారవుతుంది.

  • చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా తీసుకుంటూ కోలగా తయారుచేసుకోవాలి.

తర్వాత చక్కెర పొడిలో దొర్లించి కోటింగ్‌ ఇవ్వాలి. అంతే ధార్వాడ్‌ పేడా రెడీ! వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే వారం రోజులకు పైగా తాజాగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement