అతను అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం వస్తుంది, పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు... ఒక అమ్మాయికి వరుడిలో ఇంతకంటే ఏం కావాలి? కానీ ఆ 34 ఏళ్ల ఒక ఎన్నారై యువకుడికి మాత్రం భారతీయ అమ్మాయిల నుంచి వరుసగా తిరస్కరణలే ఎదురవుతున్నాయి. అతను ఎంత ప్రయత్నించినా ఏ సంబంధం కూడా ముందుకు సాగలేదు. దీనికి గల కారణాన్ని ప్రముఖ మ్యాచ్‌మేకర్, డేటింగ్ కోచ్ అయిన ఓంద్రిలా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విదేశీ అమ్మాయిలు వద్దనుకుని..
సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవిష్యత్తులో ఎలాగైనా భారతదేశానికి తిరిగి వచ్చి శాశ్వతంగా ఇక్కడే స్థిరపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా, అతను విదేశాలలో నివసిస్తున్న భారతీయ అమ్మాయిలతో డేటింగ్ చేయడం లేదా పెళ్లి చేసుకోవడం పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే, ఇప్పటికే విదేశాల్లో సెటిల్ అయిన అమ్మాయిలు తిరిగి భారతదేశానికి రావడానికి ఆసక్తి చూపరని అతను భావించాడు.
ఇండియా అమ్మాయిలతో పెళ్లి పెటాకులు
ఆ తర్వాత అతను భారతదేశంలో ఉంటున్న అమ్మాయిలతో మాట్లాడటం ప్రారంభించాడు. కానీ, ఆ సంభాషణలు కూడా రెండు మూడు నెలల్లోనే ఆగిపోయేవి. దీనిపై డేటింగ్ కోచ్ ఓంద్రిలా కపూర్ అతడిని ప్రశ్నించగా ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. తాను ఇండియాకు తిరిగి వచ్చేస్తానని అమ్మాయిలకు చెబుతున్నానని, కానీ ఎప్పుడు వస్తాననే కాలపరిమితిని మాత్రం స్పష్టంగా చెప్పడం లేదని అతను ఒప్పుకున్నాడు. ‘ఈ ఏడాది చివర్లో కావచ్చు, లేదా వచ్చే ఏడాది కావచ్చు.. అంతా ఆఫీస్ వర్క్ బట్టి ఉంటుంది’ అనే అతడి సమాధానమే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది.
స్పష్టత లేకపోవడమే అతిపెద్ద లోపం
అబ్బాయి వైపు నుంచి అతను నిజాయితీగానే ఉన్నప్పటికీ, అమ్మాయిల కోణం నుంచి చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. ఎప్పుడు ఇండియాకు వస్తాడో తెలియని, కనీసం ఒక్కసారి కూడా ముఖాముఖి కలవని వ్యక్తి కోసం నెలల తరబడి సమయాన్ని వృథా చేయడానికి అమ్మాయిలు ఇష్టపడలేదు. పైగా లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిని వెనక్కి తగ్గేలా చేసింది. కేవలం కెరీర్‌లో సక్సెస్ సాధించి, పెళ్లి పట్ల సీరియస్‌గా ఉంటే సరిపోదని, భవిష్యత్తు ప్రణాళికలపై కచ్చితమైన స్పష్టత లేకపోతే అది భాగస్వామికి అభద్రతాభావాన్ని కలిగిస్తుందని ఓంద్రిలా చెబుతున్నారు.


