ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్ | SEBI Digital KYC Proposals for NRIs OCIs Overseas Investment Rules Simplified | Sakshi
Sakshi News home page

ఎన్ఆర్ఐలు, ఓసీఐలకు గుడ్ న్యూస్

Aug 16 2026 7:51 AM | Updated on Aug 16 2026 7:51 AM

SEBI Digital KYC Proposals for NRIs OCIs Overseas Investment Rules Simplified

భారత మార్కెట్లలో పెట్టుబడులను ప్రోత్సహించడం, నియంత్రణ నిబంధనలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), విదేశీ భారతీయ పౌరులు (ఓసీఐ), ఇతర విదేశీ పౌరుల కోసం డిజిటల్ ‘నో యువర్ కస్టమర్’(కేవైసీ) ప్రక్రియను మరింత సరళతరం చేయాలని సెబీ ప్రతిపాదించింది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రత్యక్షంగా భారత్‌లోనే ఉండాల్సి వస్తోంది. అయితే, నూతన మార్గదర్శకాల ప్రతిపాదన ప్రకారం.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నిబంధనలకు కట్టుబడి ఉండే దేశాల్లో నివసిస్తున్న అభ్యర్థులు విదేశాల్లో ఉంటూనే పూర్తి డిజిటల్ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.

ఈ సంస్కరణల ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్ సంతకాలు, డిజిటల్ డాక్యుమెంట్ల సమర్పణ సులభతరం కానుంది. అంతేకాకుండా, దరఖాస్తుదారులు డిజిటల్ పద్ధతిలో క్రాప్ చేసిన సంతకం దాఖలు చేయవచ్చు. అనంతరం ‘వీడియో ఇన్-పర్సన్ వెరిఫికేషన్’ సమయంలో ఒరిజినల్ వెట్ సిగ్నేచర్‌(లైవ్‌లో సంతకం చేయిస్తారు)ను పరిశీలిస్తారు.

ఇదే కాకుండా, ఎన్‌ఆర్‌ఐ కస్టమర్ల కేవైసీ రికార్డులను ప్లాట్‌ఫారమ్‌ల మధ్య మార్చుకునేలా సెబీ డిస్కషన్ పేపర్‌లో ఆమోదం తెలిపింది. కేవైసీ నమోదు ఏజెన్సీలు అధికారిక డేటాబేస్‌ల ద్వారా వివరాలను సరిచూసుకుని ధ్రువీకరించినది(వెరిఫైడ్‌)గా ట్యాగ్ చేస్తాయి. స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంచేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని సెబీ పేర్కొంది.

మార్కెట్ వాటాదారులు, విదేశీ పెట్టుబడిదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ బ్లూప్రింట్‌పై ఆసక్తి కలిగిన వర్గాలు సెప్టెంబర్ 4 నాటికి తమ సలహాలు, సూచనలను అందజేయాలని సెబీ కోరింది. నిబంధనల సరళీకరణతో భారత సెక్యూరిటీల మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement