వాషింగ్టన్: విశాల్ గార్గ్.. పరిచయం అక్కర్లేని పేరు. మోర్టగేజ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉన్న 'బెటర్.కామ్' మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ సీఈఓ. కోవిడ్ సమయంలో జూమ్ కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని తొలగించి సంచలనం సృష్టించారు.
ఉద్యోగుల్ని తొలగించిన ఉసురు తగిలినట్లుంది.. ఇప్పుడు అదే ‘బెటర్ డాట్ కామ్’ సంస్థ విశాల్ గార్గ్ ను నిర్ధాక్షణ్యంగా పదవి నుంచి తొలగించింది, బయటకు గెంటేసింది. దీంతో ఆయన ఇప్పుడు అదే సంస్థపై వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనను సంస్థ దొంగదెబ్బ తీసిందని, హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ తనకు వెన్నుపోటు పొడిశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ గార్గ్ అంశం వ్యాపార ప్రపంచంలో సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
అమెరికాలో ప్రముఖ డిజిటల్ మోర్టగేజ్ ప్లాట్‌ఫారమ్ ‘బెటర్.కామ్’ మాతృ సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ సంస్థ సీఈఓ విశాల్ గార్గ్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆగస్ట్ 3న హెడ్జ్ ఫండ్ మేనేజర్ డేనియల్ లూయిస్ ఆ సంస్థ బోర్డులో చేరిన కొద్ది రోజులకే సీఈఓ పగ్గాలు చేపట్టడం టెక్ సర్కిల్స్‌లో కలకలం రేపింది.
ఈ పరిణామంపై విశాల్ గార్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నమ్మించి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ‘డేనియల్ లూయిస్ నన్ను మోసం చేశాడు. కంపెనీ వ్యూహాలు బాగున్నాయని ఆయన నాతో చెప్పారు. ఎక్స్ వేదికగా మా పనితీరును ప్రశంసించారు. అలా నా నమ్మకాన్ని చూరగొని బోర్డులో సీటు సంపాదించుకున్నారు. చివరకు డైరెక్టర్లను ఒప్పించి నన్ను పదవి నుంచి దింపేశారు’అని గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్ మహమ్మారి విజృంభించిన కాలంలో హోమ్ లోన్స్ రీఫైనాన్సింగ్ ఊపందుకోవడంతో ‘బెటర్ డాట్‌కామ్’ కంపెనీ విలువ అప్పట్లో దాదాపు 8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 66 వేల కోట్లు) చేరుకుంది. అయితే ఆ తర్వాత వడ్డీ రేట్లు పెరగడంతో వ్యాపారం పడిపోయింది. 2021లో 1.5 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక అమ్మకాలు 2023 నాటికి కేవలం 70 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. మార్కెట్ విలువ కూడా గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు, 2021లో జూమ్ కాల్ ద్వారా ఉద్యోగులను తొలగించడం, విజిల్‌బ్లోయర్ దావాలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తులు వంటి అనేక వివాదాలు విశాల్ గార్గ్ హయాంలో కంపెనీని చుట్టుముట్టాయి.
కోలుకుంటున్న తరుణంలోనే షాక్..
అయితే, ఇన్ని వివాదాల తర్వాత తాము ఇప్పుడు కంపెనీని గాడిన పెట్టామని విశాల్ గార్గ్ స్పష్టం చేశారు. ఏఐని జోడించి లోన్ ప్రాసెసింగ్ ప్రక్రియను వేగవంతం చేశామని, దీనివల్ల ఉత్పాదకత రెట్టింపు అయిందని తెలిపారు. ఇంట్యూట్, కాయిన్‌బేస్, ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, లోన్ వాల్యూమ్ మూడు రెట్లు పెరిగి లాభాల బాట పట్టే దశకు చేరుకున్నామని ఆయన వివరించారు. కానీ, జూలై 27న బోర్డులో చేరిన డేనియల్ లూయిస్ కేవలం వారం రోజుల వ్యవధిలోనే తనను సీఈఓ పదవి నుంచి తొలగించారు. లూయిస్ మొదటి నుంచే సీఈఓ పదవిపై కన్నేసి ఈ వ్యూహం పన్నారని గార్గ్ ఆరోపించారు.
తిరిగి పోరాటం..
ప్రస్తుతం తన ఉద్యోగాన్ని దక్కించుకోవడానికి విశాల్ గార్గ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రముఖ లాయర్ అలెక్స్ స్పిరోను ఆశ్రయించిన ఆయన.. బోర్డు తనను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కంపెనీ లాభాల్లోకి వచ్చే వరకు తాను కేవలం సంవత్సరానికి 1 డాలర్ జీతంతో పనిచేయడానికి కూడా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని విశాల్ గార్గ్ ధీమా వ్యక్తం చేశారు.


