ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పనులు వేగంగా, సులభంగా పూర్తవుతున్నాయి. అయితే.. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయా?.. అనే భయం కూడా చాలా మందిలో పెరుగుతోంది. ఇదే ఆందోళన ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఉద్యోగుల్లో కూడా కనిపిస్తోంది. దీంతో సుమారు 4500 మందికిపైగా ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఒక పిటిషన్ సమర్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
సుందర్ పిచాయ్‌కు అందించిన పిటిషన్‌లో.. ఏఐ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఉద్యోగులను తొలగించడం సరికాదని వెల్లడించారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా.. కొత్త విధానాలు తీసుకురావాలని వారు కోరారు. అంతే కాకుండా క్యాంపస్ వెలుపల 100 మంది ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కూడా చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం.. గూగుల్ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు.
ఉద్యోగుల డిమాండ్ ఏమిటంటే కంపెనీ లేఆఫ్‌లు చేయాల్సి వచ్చినా.. ముందుగా స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలే అవకాశం ఇవ్వాలి. ఉద్యోగం కోల్పోయే వారికి తగిన సెవరెన్స్ ప్యాకేజీ అందించాలి. అలాగే ఉద్యోగుల పనితీరును అంచనా వేసే విధానంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం చాలామందికి అన్యాయం చేస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు.
గతంలో కూడా గూగుల్ ఉద్యోగులు.. నైతిక అంశాలపై, ఏఐ వినియోగంపై నిరసనలు చేశారు. కానీ.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు వారి ఆందోళన పూర్తిగా తమ ఉద్యోగాల గురించే. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయం వారిని ఈ ఉద్యమానికి దారితీసింది.
ఇదీ చదవండి: వెకేషన్‌కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది!


