వాణిజ్య వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ సీవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 83 శాతం దూసుకెళ్లి రూ. 2,556 కోట్లను తాకింది. టాటా క్యాపిటల్‌లో పెట్టుబడులపై ఎంటూఎం లాభాలు ఇందుకు దోహదపడ్డాయి.
గతేడాది(2025–26) ఇదే కాలంలో కేవలం రూ. 1,397 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 17,324 కోట్ల నుంచి రూ. 20,667 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 15,982 కోట్ల నుంచి రూ. 18,038 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో వాహన టోకు(హోల్‌సేల్) అమ్మకాలు 26 శాతం వృద్ధితో 1,08,700 యూనిట్లకు చేరాయి.
పటిష్ట ఎగ్జిక్యూషన్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణమైన నిర్ణయాలు, విభిన్న పోర్ట్‌ఫోలియో సహకారంతో అమ్మకాలలో 26 శాతం పురోగతి సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో గిరీష్ వా పేర్కొన్నారు. ఐవెకో కొనుగోలుపై నియంత్రణ సంస్థల అనుమతులు తుది దశలో ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది.


