ధనవంతులు కాబట్టి దానధర్మాలు చేస్తుంటారు అనుకుంటాం. డబ్బులు, నిధులతో పనిలేకుండా..కనీసం తాము బతకడానికే లేకపోయినా గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న మనసున్న మారాజులే కాదు మారాణులు కూడా ఉన్నారు. ఆకలి బాధల మధ్య పెరిగి..అనునిత్యం ఆ సమస్యతో బాధపడిన ఆ మహిళే అన్నమో రామచంద్రా అని అల్లాడుతున్న వారి పాలిట అన్నపూర్ణగా మారి ఎందరికో కనువిప్పు కలిగించే మహోన్నతమైన వ్యక్తిగా నిలిచింది. దానం చేయాలంటే ధనంతో పనిలేదని..సాయం చేసే మంచి మనసు ఉండాలని చాటి చెప్పింది.
ఆ మహిళే కాజులి బిస్వాస్. ఎవ్వరిని ఆకలితో అలమటించకుండా చేసే తల్లిగా పేరు ఆమెకు. పశ్చిమబెంగాల్‌కి చెందిన కాజులి ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఒక పూట భోజనంతో రోజంతా గడపాలి. అలాంటి దుర్భర పరిస్థితుల మధ్య పెరిగింది కాజులి. పేదరిక జీవితంలో ప్రతినిర్ణయాన్ని ఆకలి ఎలా ప్రభావితం చేస్తుందో ఆమె కళ్లారా చవి చూసింది. అప్పుడే ఆమెకు తెలిసింది ఆకలి అనేది తాత్కాలికి సమస్య కానే కాదు. అది ఒక పెద్ద పోరాటం, పెను సమస్యని అర్థం చేసుకుంది.
రోడ్డు పక్కన ఆకలితో నకనకలాడుతున్న వాళ్లను చూస్తే కాజులికి మనసు కకలా వికలం అయిపోయేది. ఆ దృశ్యాలు ఆమెను తీవ్రంగా కలిచివేసేవి. వాళ్లలో తనను తాను చూసుకుని బాధపడేది. ఆ కష్టాల కొలిమిలో కాజులి జీవితం మరో ములుపు తిరిగింది. పెళ్లి చేసేస్తే అక్కడైన మంచి జీవితం లభిస్తుందని అంతా నచ్చచెప్పి మరి .. ఆమెకు 15 ఏళ్లకే పెళ్లి చేసేశారు. అందరి అమ్మాయిల్లానే ఇక నుంచి తన జీవితం హాయిగా సాగిపోతుందనుకుంది. అక్కడ మరింత ఘోరం. ఆకలి కోసం అత్యంత ఘోరమైన పోరాటం కనిపించిందామెకు.
ఈలోగా ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టేశాడు. చిన్నప్పటి నుంచి బాధలు, పెళ్లాయ్యాక కూడా అవే బాధలతో నలిగిపోయిన ఆమె మనసు ఒక అనుహ్య నిర్ణయం తీసుకునేందుకు దారితీసింది. ఈ ఆకలిని చూసి విసుగుపుట్టింది..అందుకే ఆకలి అని బాధపడుతున్న వాళ్లందరికీ అన్నం పెట్టాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలాగని ఆమె వద్ద ఎలాంటి నిధులు, డబ్బులు లేవు. సహాయం చేసే వ్యక్తులు కూడా లేరు.. తన వల్ల అయ్యింది చేసైనా ఈ మహత్తర కార్యానికి పూనుకోవాలి, ఆకలి బాధలు అడ్డుకట్టవేయాలి.. అని గట్టిగా నిర్ణయించుకుంది.
అయితే ఆమె అసాధ్యమైన నిర్ణయానికి భర్త, అతడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఈ సేవకార్యక్రమాలు చేయాలనుకుంటే తనతో ఉండటమో లేదా రోడ్లపై ప్రజలకు అన్న పెట్టే సేవనో .. ఏదో ఒకటే ఎంచుకోవాల్సిందిగా తెగేసి చెప్పారు. ఇక్కడ కాజులి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆకలితో అలమటించే అన్నార్తుల కడుపు నింపడమే తన ఆశయం అంటూ దానివైపుకే మొగ్గు చూపింది. ఏదో తీసుకుంది గానీ..అంత మందికి కాదు కదా..తనకే తింటానికి తిండి లేదు ఎలా పెట్టాలన్నది ఆమె ముందున్న ప్రశ్న. అయినాసరే తన చెవిపోగులను తాకట్టు పెట్టి తొలి రోజు రోడ్లపై అలమటిస్తున్న వాళ్ల ఆకలిని నింపింది.
తన కొడుకుతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఈ సేవా పనులు చేస్తుండేది. వనరులు తక్కువగా ఉన్నా, సాయం చేసే వాళ్లు లేకున్నా..తనవల్ల అయ్యింది చేస్తూనే ఉండేది. అందుకోసం డబ్బు సంపాదించడానికి ఆహర్నిశలు కష్టపడేది. సంపాదించిన మొత్తం తన జీవనం కోసం కాకుండా..ఇతరుల పొట్ట నింపడమే ధ్యేయంగా వంటలు చేస్తుండేది. కాజులి ప్రచారం కోసం లేదా గుర్తింపు కోసమో ఇది చేయడం లేదని కొద్దిరోజుల్లోనే స్థానిక ప్రజలు గుర్తించారు.
ఇవాళ ఆమెకు చాలామంది మద్దతిచ్చేందుకు ముందుకు రావడమే కాదు..కొందరు ఆహార పదార్థాలను విరాళంగా కూడా ఇస్తున్నారు. మరికొందరు ఆమెకు అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇవాళ ప్రతి రోజు దాదాపు 100 మందికి పైగా ఆహారం అందిస్తోంది. అంతేగాదు వీధుల్లో కాజులి రాక కోస ఎదురు చూడటం మొదలైంది. ఆహారం అంటే ఆకలి మాత్రమే కాదని, శ్రద్ధ చూపడం, ఆకలి భయాన్ని పోగొట్టడం అని అంటుందామె. అంతేగాదు అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు కాజులి.
ఒక అనాథశ్రమాన్ని నిర్మించి అవసరంలో ఉన్న ప్రజలకు సురక్షితమైన వసతి అందించాలన్నదే తదుపరి ధ్యేయమని చెబుతోంది. ఇక్కడ కాజులి కథ సంపద, హోదా వంటి స్థాయిలతో కొలిచేది కాదు. ఆమె ఎంచుకున్న మార్గంలో సాధించిన విజయాన్ని వడ్డించే ప్రతి భోజనపు పళ్లెంలోనో లేక ఇకపై ఆకలితో నిద్రపోని ప్రజల కృతజ్ఞతలోనో చూడొచ్చు. ఆమె కథ తను ఉన్న స్థితికి మించిన నిర్ణయమే అయినా..ఇతరుల మేలు కోరడంతోనే విజయం తనంతాట తాను వొళ్లోకొచ్చి వాలుతుంది అనే చెప్పే స్టోరి.
(చదవండి: అరుదైన ఆరోగ్య సమస్యతో పోరాడుతూ..డాక్టర్ అయ్యింది!)


