మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు తీవ్ర అస్వస్థత | Ram Temple Trust chief Mahant Nritya Gopal Das hospitalised | Sakshi
Sakshi News home page

మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు తీవ్ర అస్వస్థత

Jul 1 2026 1:10 PM | Updated on Jul 1 2026 1:17 PM

Ram Temple Trust chief Mahant Nritya Gopal Das hospitalised

అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అనారోగ్యంతో లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. 86 ఏళ్ల వయసున్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఈ ఏడాది ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. గత జనవరిలో ఆయన అనారోగ్యానికి గురై ‘మేదాంత’లోనే చికిత్స పొందారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆయనను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహంత్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

2022 ఏప్రిల్ 24న కూడా ఆయన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందారు. అంతేకాకుండా గతంలో ఆయన కోవిడ్-19 బారిన పడి, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుని అయోధ్యకు తిరిగి వచ్చారు. వయోభారం కారణంగా ఆయన నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.

మహంత్ నృత్య గోపాల్ దాస్ 1938 జూన్ 11న మథురలో జన్మించారు. అయోధ్యలోని అతిపెద్ద ఆలయమైన ‘మణి రామ్ దాస్ కీ చావని’కి ఆయన పీఠాధిపతిగా ఉన్నారు. 1993లో విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు చేసిన రామ్ జన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. దశాబ్దాలుగా సాగిన రామ్ జన్మభూమి ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. 2001లో ఆయనపై, ఆయన శిష్యులపై బాంబు దాడి జరగ్గా, స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత 2003లో ఆయన రామ జన్మభూమి న్యాస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement