‘దిమాగీ’పై దుమారం  | Opposition Leaders hits out at PM Narendra Modi over dimagi Naxals | Sakshi
Sakshi News home page

‘దిమాగీ’పై దుమారం 

Aug 17 2026 1:14 AM | Updated on Aug 17 2026 1:14 AM

Opposition Leaders hits out at PM Narendra Modi over dimagi Naxals

మావోలు, వేర్పాటువాదులకు మద్దతిచ్చేవాళ్లే దిమాగీ నక్సల్స్‌   

ప్రధాని ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడలేదన్న మంత్రి రిజిజు 

విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్‌(మేధో నక్సలైట్లు) మాత్రం సమాజానికి ముప్పుగా మారారని, వారిని గుర్తించి, ఏకాకులని చేయాలని, పూర్తిగా పక్కనపెట్టాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అసమ్మతిని అణచివేయడానికే విపక్షాలపై దిమాగీ నక్సలైట్‌ అంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలను అధికార బీజేపీ నాయకులు సమర్థించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల గురించి కాకుండా.. కేవలం మావోయిస్టులకు, వేర్పాటువాదులకు మద్దతునిస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వ్యక్తుల గురించి మాత్రమే ప్రధానమంత్రి మాట్లాడారని స్పష్టంచేశారు.

 ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను  దిమాగీ నక్సల్స్‌ అనలేదు. 1.మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు. 2.వేర్పాటువాదులతో అండగా నిలుస్తూ ఆరి్టకల్‌ 370కి మద్దతిచ్చే వారు. 4.భారతదేశం నుంచి ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయడానికి కోడి మెడ(చికెన్‌ నెక్‌)ను కత్తిరించాలని కుట్రలు సాగించేవారు మాత్రమే దిమాగీ నక్సల్స్‌’’ అని కిరణ్‌ రిజిజు తేల్చిచెప్పారు.    

3 వస్తుంది, 4 కాదు: పవన్‌ ఖేరా  
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’లో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘సోదరా కిరణ్‌ రిజిజు.. ముందు మీ లెక్కింపును సరిచేసుకోండి. అప్పుడు మేము సమాధానం ఇస్తాము. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు’’ అని పోస్టుచేశారు. పవన్‌ ఖేరా ట్వీట్‌పై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ప్రతిస్పందించారు. ‘‘సమస్త రాజకీయ శాస్త్రపు అద్భుతం’’ అని పేర్కొన్నారు. ‘‘నేను దిమాగీ నక్సలైట్‌ అయినందుకు గర్విస్తున్నాను’’ అంటూ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సైతం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.    

చిదంబరంపై బీజేపీ నేతల ఆగ్రహం  
పి.చిదంబరం పోస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బి.ఎల్‌.సంతోష్‌ విమర్శలు గుప్పించారు. ‘‘ఇందులో ఆశ్చర్యం లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చిదంబరం కాషాయ ఉగ్రవాదానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు’’ అని పోస్టుచేశారు. చిదంబరం తీరుపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే ఆగ్రహం వ్యక్తంచేశారు.

 అణ్వాయుధాల అవసరంపై దేశంలోనూ, పార్లమెంట్‌లోనూ పూర్తి స్థాయి, సరైన చర్చ జరిగేంత వరకు వాటిని సమకూర్చుకోవడాన్ని, భారత సాయుధ దళాలలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చిదంబరం మాట్లాడినట్లుగా ఉన్న ఒక పాత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘నేటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తే సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పారీ్టకి చెందిన చిదంబరం చేసిన ఈ వ్యాఖ్య దిమాగీ నక్సల్‌ వ్యాఖ్య అవునా కాదా.. మీరే చెప్పండి?’’ అని దూబే పేర్కొన్నారు.

 బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర సైతం చిదంబరంపై తీరుపై మండిపడ్డారు. ఆయన దిమాగీ నక్సల్‌ అనే బిరుదు తగిలించుకోవడం ఆలస్యమైనా, అది మంచి పరిణామమేనని అన్నారు. ‘‘చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వ హయాంలో నక్సలిజం ఎందుకు బలపడిందో ఇప్పుడు అర్థమైంది. 2004–2014 మధ్య నక్సలిజంపై పోరాడుతూ దాదాపు 2,000 మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌  జవాన్లు ఎందుకు ప్రాణాలు కోల్పోయారో ఇప్పుడు మాకు తెలిసింది. 

యూపీఏ ప్రభుత్వ పాలనలో నక్సల్స్‌ దాడుల వల్ల 5,000 మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చిదంబరం హోం మంత్రిగా ఉన్నప్పుడు పోలీసు ఆయుధాగారాల నుంచి నక్సలైట్లు ఆయుధాలు దోచుకుపోవడానికి అనుమతించారు’’ అని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ చెప్పిన ‘దిమాగీ నక్సల్స్‌’ అంటే ఢిల్లీ, ముంబై, పట్నా, కోల్‌కతాల్లోని ఏసీ గదుల్లో కూర్చుని మావోయిస్టు భావజాలాన్ని పోషించే వ్యక్తులని అర్థమని  బీజేపీ సీనియర్‌ నాయకుడు రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ‘‘వారు (నక్సలైట్లు) ఉద్యమానికి నిధులు, మద్దతు సమకూర్చుకోవడానికి తమ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటారు.  మావోయిస్టుల దురాగతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నప్పుడు, దిమాగీ నక్సల్స్‌ వారిని సమర్థిస్తూ ఆంగ్ల వార్తాపత్రికలలో వ్యాసాలు రాస్తారు’’ అని 
ఆరోపించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement