రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్‌ షాక్‌.. ఒకరి మృతి | Father dies as School Thik Karo audit ends in attack on Bengal man | Sakshi
Sakshi News home page

రెండో ఉద్యమం మొదలు పెట్టిన సీజేపీకి బిగ్‌ షాక్‌.. ఒకరి మృతి

Aug 16 2026 8:33 PM | Updated on Aug 16 2026 8:46 PM

 Father dies as School Thik Karo audit ends in attack on Bengal man

న్యూఢిల్లీ: ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం చేపట్టిన రెండో రోజే సీజేపీకి భారీ షాక్‌ తగిలింది. పాఠశాల సమస్యలను అందరి దృష్టికి తీసుకురావాలనుకున్న సీజేపీ మద్దతుదారుడి తండ్రిని కొందరు కొట్టి చంపారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురాకు చెందిన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుడి తండ్రి ఆగస్టు 15న మృతి చెందారు. 

సీజీపీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా తన చిన్నతనంలో చదువుకున్న పాఠశాల పరిస్థితులను అతడి కుమారుడు వీడియో తీసినందుకు ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఇంట్లోనే ఆయనపై దాడి చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులు ఆదివారం జాతీయ మీడియాకు తెలిపారు.

మృతుడి కుమారుడి పేరు అబ్దుల్ హఫీజ్. దాడికి బీజేపీ కార్యకర్తలే కారణమని ఆరోపించిన అబ్దుల్ హఫీజ్.. దాడిలో గాయపడిన తన తండ్రి బంకురాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. “ఈ బీజేపీ స్థానిక నేతలు దారుణంగా దాడి చేసిన తర్వాత నా తండ్రి శనివారం మృతి చెందారు” అని హఫీజ్ చెప్పారు.

బంకురా ఎస్పీ వీజీ సతీష్ పసుమర్తి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. “హఫీజ్ తల్లి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నట్లు మాకు సమాచారం అందింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.

ఇదిలా ఉండగా, తమ కార్యకర్తలకు ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు తేలి, వారిపై పేర్లతో పోలీసులకు ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ తెలిపింది.

“అయితే, టీఎంసీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి సామాజిక తనిఖీ చేసే ధైర్యం చేశారా? కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీని చెడుగా చూపించేందుకు టీఎంసీ, వామపక్షాలు చేస్తున్న పద్ధతి ఇది మాత్రమే” అని బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి కేయా ఘోష్ చెప్పారు.

జంతర్ మంతర్‌లో జరిగిన సీజీపీ నిరసనల్లో కూడా పాల్గొన్న హఫీజ్.. పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సామాజిక తనిఖీలో భాగస్వామి కావాలని అనుకున్నట్లు తెలిపారు. తాను చదువుకున్న కరిసుంద ప్రాథమిక విద్యాలయానికి వెళ్లి కొన్ని వీడియోలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చానని చెప్పారు.

రాత్రి 8 గంటల సమయానికి కొందరు వ్యక్తులు తన ఇంటికి వచ్చి చుట్టుముట్టారని, తనపై కూడా దాడి చేయడంతో పాటు వృద్ధుడైన తన తండ్రిని కొట్టారని హఫీజ్ తెలిపారు. తన ఫోన్‌ను లాక్కుని, పాఠశాలకు సంబంధించిన వీడియోలు, జంతర్ మంతర్‌లో తాను తీసిన వీడియోలను తొలగించాలని బలవంతం చేశారని చెప్పారు.

నా రక్తం మరిగిపోతోంది: దీప్కే
అబ్దుల్‌కు కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అబ్దుల్‌కు మద్దతు తెలిపారు. అతడి తండ్రి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై మాట్లాడిన తర్వాత అబ్దుల్ ఆ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లారని దీప్కే ఎక్స్‌లో చేసిన పోస్టులో తెలిపారు. అబ్దుల్, ఆయన కుటుంబంపై బీజేపీతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దాడి చేసిన తర్వాత ఆయన తండ్రి హత్యకు గురయ్యారని దీప్కే ఆరోపించారు.

“మెరుగైన పాఠశాలలు కావాలని డిమాండ్ చేసినందుకు ప్రజలను హత్య చేస్తున్నారంటే నా రక్తం మరిగిపోతోంది” అని దీప్కే పోస్టులో పేర్కొన్నారు. సీజీపీ బృందం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అబ్దుల్, ఆయన కుటుంబంతో కలిసి న్యాయం కోసం పోరాడుతుందని దీప్కే తెలిపారు. బెదిరింపులు, భయపెట్టే ప్రయత్నాలు ఎదురైనా.. మెరుగైన ప్రభుత్వ పాఠశాలల కోసం తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్న ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని దీప్కే ప్రారంభించిన తర్వాత ఆయన ఈ పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement