బెంగాల్‌లో మిస్టరీ మరణాలు.. టీఎంసీకి వరుస షాకులు! | Story On West Bengal Political Situation And TMC Leaders Deaths | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో మిస్టరీ మరణాలు.. టీఎంసీకి వరుస షాకులు!

Aug 16 2026 11:16 AM | Updated on Aug 16 2026 11:23 AM

Story On West Bengal Political Situation And TMC Leaders Deaths

బెంగాల్‌లో అధికారం మారింది.. కానీ రాజకీయ మంటలు మాత్రం చల్లారలేదు! బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీఎంసీ నేతలు, కార్యకర్తలపై దాడులు, వరుస మరణాలు, పోలీస్‌ కస్టడీలో డెత్‌, అనుమానాస్పద ఘటనలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకవైపు “టీఎంసీని టార్గెట్‌ చేస్తున్నారు” అంటూ మమతా బెనర్జీ పార్టీ ఆరోపిస్తుంటే.. మరోవైపు బీజేపీ “ప్రతి ఘటనను రాజకీయ హింసగా చిత్రీకరిస్తున్నారు” అని కౌంటర్‌ ఇస్తోంది. ఇంతకీ బెంగాల్‌లో నిజంగా ఏం జరుగుతోంది? ఎవరు చనిపోయారు? ఎవరి మీద దాడులు జరిగాయి? ఏ కేసుల్లో రాజకీయ కోణం ఉంది? ఏ మరణాల వెనుక అసలు కారణం ఇంకా మిస్టరీగానే ఉంది? అధికార మార్పు తర్వాత బెంగాల్‌లో చోటుచేసుకున్న కీలక ఘటనల ఇవే..

బీజేపీ ప్రభుత్వం అధికారికంగా 2026 మే 9న ఏర్పడింది. సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే మే 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. ప్రమాణం చేయకముందే పోస్ట్‌ పోల్‌ హింస మొదలైంది.

1. అభిషేక్‌ బెనర్జీపై దాడి.. మే 30
సోనార్పూర్‌లో పోస్ట్‌-పోల్‌ హింసలో మరణించిన టీఎంసీ కార్యకర్త సంజు కర్మాకర్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై గుంపు దాడికి దిగింది. రాళ్లు, గుడ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో ఆయన షర్ట్‌ చిరిగింది, కళ్లజోడు దెబ్బతింది. రక్షణ కోసం హెల్మెట్‌ ధరించాల్సి వచ్చింది. ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీఎంసీ దీనిని బీజేపీ మద్దతుదారుల దాడిగా ఆరోపించగా, బీజేపీ మాత్రం స్థానికుల ఆగ్రహంగా పేర్కొంది.

2. కల్యాణ్‌ బెనర్జీపై దాడి.. మే 31
అభిషేక్‌పై ఘటన జరిగిన మరుసటి రోజే టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీపై హూగ్లీ జిల్లా చందీతలలో దాడి జరిగిందని టీఎంసీ ఆరోపించింది. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే తనపై కఠినమైన వస్తువుతో దాడి జరిగి తలకు గాయమైందని కల్యాణ్‌ చెప్పారు. బీజేపీ మాత్రం దాడి ఆరోపణలను ఖండించింది.

3. బిశ్వజిత్‌ పట్టనాయక్‌ మృతి..
మే 5న కోల్‌కతాలోని బెలేఘాటాలో టీఎంసీ కార్యకర్త బిశ్వజిత్‌ పట్టనాయక్‌ మృతదేహం లభించింది. టీఎంసీ దీనిని బీజేపీ దాడిగా ఆరోపించింది. పోలీసులు మాత్రం మరో కోణం చెప్పారు. కొంతమంది తన కోసం రావడంతో తప్పించుకునే క్రమంలో టెర్రస్‌ నుంచి పడిపోయి మరణించి ఉండొచ్చని తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగింది. అందువల్ల ఇది “అనుమానాస్పద మరణం”గా చిత్రీకరించబడింది.

4. అబీర్‌ షేక్‌ హత్య.. మే 5
బీర్భూమ్‌ నానూర్‌లో టీఎంసీ స్థానిక నేత అబీర్‌ షేక్‌ హత్యకు గురయ్యారు. పోలీసులు ఆయన మరో వర్గంతో జరిగిన ఘర్షణలో హత్యకు గురైనట్లు చెప్పారు. టీఎంసీ, కుటుంబ సభ్యులు మాత్రం బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు.

5. సంజు కర్మాకర్‌ మరణం..
సోనార్పూర్‌కు చెందిన 40 ఏళ్ల టీఎంసీ కార్యకర్త సంజు కర్మాకర్‌ మే 5న దాడికి గురై, కొద్దిరోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీ వర్గాలు, కొందరు స్థానికులు ఆయనకు మెడికల్‌ ఎమర్జెన్సీ/బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి ఉండొచ్చని, కుటుంబం రాజకీయ హింసపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ వివాదమే తర్వాత అభిషేక్‌ బెనర్జీ సోనార్పూర్‌ పర్యటనకు కారణమైంది.

6. సహదేవ్‌ బాగ్‌ మృతదేహం.. మే 10
హూగ్లీ జిల్లాలోని గోఘాట్‌లో టీఎంసీ పంచాయతీ సభ్యుడు సహదేవ్‌ బాగ్‌ మృతదేహం పొలంలో లభించింది. టీఎంసీ దీనిని పోస్ట్‌-పోల్‌ రాజకీయ హత్యగా పేర్కొంది. బీజేపీ మాత్రం తమ కార్యకర్తలకు సంబంధం లేదని, వ్యక్తిగత లేదా ఆర్థిక వివాదం కారణం కావచ్చని చెప్పింది. పోలీసులు కూడా రాజకీయ కోణంతో పాటు వ్యక్తిగత/బిజినెస్‌ వివాదాలన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు.

7. మహువా మోయిత్రాపై దాడి.. జూలై 1
నదియా జిల్లాలోని కలిగంజ్‌లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా పార్టీ సమావేశానికి వెళ్లిన సమయంలో ఆమె కార్యాలయం వెలుపల గుంపు నిరసనకు దిగింది. గుడ్లు, బురద, రాళ్లు విసిరారని మహువా ఆరోపించారు. దాదాపు నాలుగు గంటలపాటు తాను కార్యాలయంలో చిక్కుకుపోయానని చెప్పారు. ఆమె 16 మందిపై ఆరోపణలు చేశారు. పోలీసులు మాత్రం పరిస్థితిని అదుపులో ఉంచి, ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు.

8. బరుయిపూర్‌ ‘ఎన్‌కౌంటర్‌’.. జూలై 7
ఇది టీఎంసీ నేత మరణం కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెంగాల్‌లో జరిగిన తొలి ప్రధాన పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ కావడంతో రాజకీయంగా కీలకమైంది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్‌ మండల్‌ను పోలీసులు కాల్చిచంపారు. పోలీసులు అతడు ఆయుధం లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపామని చెప్పారు. టీఎంసీ దీనిని “జంగిల్‌ రాజ్‌”గా విమర్శించగా, బీజేపీ “దైవ న్యాయం”గా అభివర్ణించింది.

9. బిర్జు కియోట్‌ కస్టడీ మరణం..
ఇది ప్రస్తుతం అత్యంత సీరియస్‌గా పరిశీలించాల్సిన కేసుల్లో ఒకటి. 48 ఏళ్ల టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్‌ పోలీస్‌ కస్టడీలో మరణించారు. కుటుంబం పోలీసు హింస వల్లే మరణించారని ఆరోపించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఘటనపై స్పందిస్తూ, ఆయన పోలీస్‌ కస్టడీలోనే మరణించిన విషయం స్పష్టంగా ఉందని అన్నారు. అనంతరం దర్యాప్తు అధికారిని విధుల నుంచి తప్పించి, ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జ్‌ను కూడా పక్కకు తప్పించి, మేజిస్ట్రియల్‌ విచారణకు ఆదేశించారు. ఇదే ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆమె కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరారని ఆమె ఆరోపించారు. దాడి చేసిన వారి రాజకీయ అనుబంధం మాత్రం స్పష్టంగా నిర్ధారించబడలేదు.

10. మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఆశిష్‌ బెనర్జీ హత్య.. ఆగస్టు 16
ఈరోజు వెలుగులోకి వచ్చిన తాజా షాకింగ్‌ ఘటన ఇదే. మాజీ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే ఆశిష్‌ బెనర్జీ బీర్భూమ్‌లోని టీఎంసీ పార్టీ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇది రాజకీయ హత్య అని ప్రస్తుతం చెప్పడానికి ఆధారం లేదు. మరణానికి అసలు కారణం, ఆత్మహత్యా? ఇతర పరిస్థితులా? అన్నది దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement