అయోధ్య విరాళాల స్కామ్‌ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు | Ram Mandir donation theft hide money in washrooms accused told cops | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల స్కామ్‌ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు

Jul 1 2026 11:44 AM | Updated on Jul 1 2026 11:54 AM

Ram Mandir donation theft hide money in washrooms accused told cops

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య  రామాలయంలో (Ayodhya Ram Temple) విరాళాల కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణంలో  కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తులో  నిందితులు దొంగలించిన సొత్తును వాష్‌రూమ్‌ల్లో దాచి పెట్టిన విషయం కలకలం  రేపుతోంది.  నిందితుల సమాచారంతో ఈ స్కామ్‌లో రామ్ మందిర్ ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిందితుడు అవినాష్ మిశ్రాను (శుక్లా) పోలీసులు విచారించినప్పుడు అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కూడా పాల్గొనేవారని సమాచారం.

అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. దొంగిలించిన కోట్లాది రూపాయల నగదును గుడి వెలుపలికి తీసుకెళ్లే ముందు తాత్కాలికంగా వాష్‌రూమ్‌లలో (మరుగుదొడ్లలో) దాచినట్లు ఒప్పుకున్నాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి చంపత్ రాయ్ అనుచరుడైన టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ ఉద్యోగుల వద్ద ఉండేదని నిందితుడు తెలిపాడు.

నిందితులకు ఆలయ ప్రాంగణంలోని సిసిటివి (CCTV) కెమెరాల స్థానాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే నిఘా సిబ్బంది తమ కదలికలను సరిగ్గా గమనించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కెమెరాల కంటికి చిక్కకుండా ఒకరికొకరు కవర్‌గా నిలబడి డబ్బును దొంగిలించేవారని శుక్లా వివరించాడు. దొంగిలించిన సొమ్ముతో భూములు, ఇళ్లను కొనుగోలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై దృష్టి సారించారు.

లెక్కింపు గది తాళాలు - బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కు:
అరెస్ట్ అయిన నిందితుల్లో 'టిన్నూ యాదవ్' (రామశంకర్ యాదవ్) అత్యంత కీలకమైన వ్యక్తిగా తేలాడు. విరాళాలు లెక్కించే గది ఒక తాళంచెవి టిన్నూ యాదవ్ వద్ద ఉండగా, రెండో తాళంచెవి బ్యాంక్ సిబ్బంది వద్ద ఉండేది. కేవలం లోపలి వ్యక్తులే కాకుండా, బ్యాంక్ సిబ్బందితో కూడా కుమ్మక్కై ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు.  దొంగిలించిన సొమ్ములో టిన్నూ యాదవ్‌తో పాటు సదరు బ్యాంక్ ఉద్యోగులు కూడా వాటాలు పంచుకున్నట్లు సమాచారం.

కాగా విరాళాల లెక్కింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌లు ఈ అవకతవకలపై ప్రశ్నలు తలెత్తడంతో గత వారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కుంభకోణం వ్యవహారంలో యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ SIT విచారణ ప్రారంభించడానికి ముందే పోలీసులు రూ. 58 లక్షలను రికవరీ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: కేతన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ : రూ. 10 కోట్ల డిఫమేషన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement