భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్‌ షా | Vande Mataram Row, Amit Shah Slams Congress And Demands Sonia Gandhi Apologise Over Independence Day Controversy | Sakshi
Sakshi News home page

భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్‌ షా

Aug 16 2026 1:30 PM | Updated on Aug 16 2026 2:40 PM

Minister Amit Shah Serious Comments On Congress Party

ఢిల్లీ: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ దేశ ప్రజలను అవమానించిందని అమిత్‌ షా మండిపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా భావించే ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15 సందర్బంగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరిగాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ తదితరులు వేదికపై ఉన్నారు. వందేమాతరం పాట ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గేతో మాట్లాడటం, కొన్ని సంజ్ఞలు చేయడం కనిపించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. బీజేపీ ఆరోపణ ఏమిటంటే.. పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసి, దాన్ని ఆపేలా సంకేతాలు చేశారని మండిపడుతున్నారు.

కాంగ్రెస్‌ ఏం చెబుతోంది?
కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్‌ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని సూచించలేదని, ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని కాంగ్రెస్‌ వివరణ ఇచ్చింది. దీంతో, రాజకీయం దుమారం రేగింది.  ఇక్కడ ఒక చారిత్రక అంశం ఉంది. 1937లో కాంగ్రెస్‌ వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే బహిరంగ కార్యక్రమాల్లో పాడే విధానాన్ని అనుసరించింది. అయితే, 2026లో వందేమాతరం పూర్తి రూపంపై కేంద్రం కొత్తగా ప్రాధాన్యత ఇవ్వడంతో, పూర్తి ఆరు చరణాల ఆలాపనపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కార్యక్రమంలో పూర్తి రూపం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ చేసిన సంజ్ఞల వీడియో బీజేపీ చేతికి రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. కాంగ్రెస్‌ మాత్రం తమ నేతలు వందేమాతరాన్ని అవమానించారనే ఆరోపణను తిరస్కరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement