సువేందు దూకుడు.. బెంగాల్‌లో ‘యోగీ’ స్టయిల్‌ గుండా బిల్లు! | Bengal to Introduce Yogi Style Anti-Goonda Bill | Sakshi
Sakshi News home page

సువేందు దూకుడు.. బెంగాల్‌లో ‘యోగీ’ స్టయిల్‌ గుండా బిల్లు!

Jun 29 2026 11:33 AM | Updated on Jun 29 2026 11:40 AM

Bengal to Introduce Yogi Style Anti-Goonda Bill

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో  వ్యవస్థీకృత నేరాలు, హింసాత్మక అల్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన కఠిన చట్టాల తరహాలోనే,  రాష్ట​ంలో ‘పశ్చిమ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ బిల్, 2026’ను ప్రవేశపెట్టనున్నారు. శాంతిభద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

యోగీ మార్క్.. ఆస్తుల రికవరీ
ఈ ప్రతిపాదిత చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఆస్తుల నష్టం రికవరీ నిబంధన. ఉత్తరప్రదేశ్ తరహాలోనే బెంగాల్‌లో కూడా ఇకపై నిరసనలు, ఊరేగింపులు లేదా అల్లర్ల పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు. హింసకు కారణమైన వారి నుంచే ఆ నష్టాన్ని పైసలతో సహా వసూలు చేసేందుకు ఈ బిల్లు ప్రభుత్వానికి సర్వాధికారాలు కల్పిస్తుంది. దీంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, గుండాలను నిర్దేశిత ప్రాంతాల నుండి బహిష్కరించే కఠిన నిబంధనను కూడా ఇందులో చేర్చారు.

ముందస్తు అరెస్టులు.. పెరగనున్న పవర్స్
నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, ముందస్తుగానే అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు 'ప్రివెంటివ్ డిటెన్షన్' (ముందస్తు నిర్బంధం) నిబంధనను ప్రవేశపెడుతున్నారు. సమాజంలో అలజడులు సృష్టించే అవకాశం ఉన్నట్లు అనుమానం వస్తే చాలు, వారిని ముందస్తుగా అరెస్టు చేయవచ్చు. ఇది గత నేరాలకు శిక్ష కాదని, భవిష్యత్తులో అల్లర్లను ఆపేందుకేనని ప్రభుత్వం చెబుతోంది. దీనికి తోడుగా పోలీసులకు తనిఖీలు (సెర్చ్), ఆస్తుల జప్తు (సీజర్) విషయంలో మరింత విస్తృతమైన అధికారాలను ఈ చట్టం కల్పించనుంది.

హక్కుల రక్షణ.. రానున్న సవాళ్లు
అయితే ఈ ముందస్తు నిర్బంధాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు బిల్లులో కొన్ని రక్షణలు కూడా కల్పించారు. ప్రతి నిర్బంధ ఉత్తర్వును ఒక ఉన్నత స్థాయి ‘అడ్వైజరీ బోర్డు’ సమీక్షిస్తుంది. అరెస్ట్ అయిన వారికి తమ వాదనను వినిపించుకునే హక్కు ఉంటుంది. ప్రజా ప్రయోజనాలకు భంగం కలగనంత వరకు అరెస్టయిన వ్యక్తికి కారణాలను వెల్లడిస్తారు. ఈ బిల్లు పౌర హక్కులకు, చట్టపరమైన ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందంటూ విపక్షాలు, విమర్శకులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement