‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్‌లో తెలంగాణ పిల్ల | Interesting Facts About Idupu Kayitham Movie Actress, Folk Dancer Naga Durga | Sakshi
Sakshi News home page

‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్‌లో తెలంగాణ పిల్ల

Jun 28 2026 1:34 PM | Updated on Jun 28 2026 1:56 PM

Interesting Facts About Idupu Kayitham Movie Actress, Folk Dancer Naga Durga

‘ఇడుపు కాయితం’.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా టైటిల్‌ గురించే చర్చ. ఈ సినిమాని ఏపీలో తెలుగులో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేయడంతో ఈ వివాదం మొదలైంది. మా యాసని అవమానిస్తారా అంటూ తెలంగాణ నెటిజన్స్‌, మెధావులు ఫైర్‌ అవుతున్నారు. టైటిల్‌ని అవమానిస్తూ వెతకారంగా పెట్టిన పోస్టులకు కౌంటర్‌గా తెలంగాణ నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల నెటిజన్స్‌ మధ్య పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈ క్రమంలో ‘ఇడుపు కాయితం’ హీరోయిన్‌ నాగదుర్గ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆమె చేసిన ఫోక్‌ సాంగ్స్‌ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి, ఆమె కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు..

తెలంగాణ జానపద పాటలకు ఈ మధ్య ఆదరణ పెరిగింది. సినిమాల్లోనూ తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ని వాడుతున్నారు. సోషల్‌ మీడియా పుణ్యమా అని పల్లె మట్టివాసనలు గల ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. వారిలో డిజిటల్ స్క్రీన్‌పై, యూట్యూబ్ జానపద గీతాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ 'ఫోక్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నృత్యకారిణి నాగదుర్గ (గుత్తా నాగదుర్గ) ఒకరు.

నాగదుర్గ స్వస్థలం నల్గొండ జిల్లా అడ్డగూడూరు. ఆమె తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. పదో తరగతి వరకు నల్గొండలోనే చదివిన నాగదుర్గ.. ఇంటర్‌, డిగ్రీ, పీజీ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ (పీజీ) పూర్తి చేశారు.

నాగదుర్గకు చిన్నతనం నుంచే నృత్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. స్థానిక రామాలయంలో జరిగే భజనలు, నృత్యాలను చూసి ఇంటికొచ్చాక చున్నీ కట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. కూతురిలోని ఈ తపనను గమనించిన తల్లి వాసవి.. ఆమెను నాట్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గనే చెప్పారు.

జానపదంతో జాతకం మారింది
కూచిపూడి బ్యాక్‌గ్రౌండ్‌  ఉన్న నాగదుర్గ కోవిడ్‌ సమయంలో జానపద గీతాల వైపు అడుగులు వేసింది. కోవిడ్‌ టైమ్‌లో అప్పటికే యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన 'ధన్ ధన ధన్' అనే ఫోక్‌ సాంగ్‌కి స్టెప్పులేసి ఆ వీడియోని తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసిందట. అది చూసే తొలి పాట ‘తిన్నా తీరం పడతలే’ చాన్స్‌ వచ్చింది. ఫోక్‌ డ్యాన్సర్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలి పాటనే సూపర్‌ హిట్‌ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. ఆ తర్వాత నాగదుర్గు జాతకమే మారిపోయింది.

కూచిపూడి నేర్చుకోవడం వల్ల నాగదుర్గకు ముఖ కవళికలు (ఎక్స్‌ప్రెషన్స్) పలకడం చాలా సులువైంది. జానపద పాటల్లోని ఎనర్జిటిక్ స్టెప్స్‌కు తన క్లాసికల్ హావభావాలను జోడించి ఆమె చేసిన డ్యాన్స్ వీక్షకులను కట్టిపడేసింది. అందుకే ఆమె చేసిన తొలి సాంగ్‌ ‘తిన్నా తీరం పడతలే’ నుంచి  ఇటీవల వచ్చిన ‘లగారే సౌండ్‌ సాలా’ వరకు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఆమె కట్టు బొట్టు, పల్లెటూరి పడచులా అమాయకత్వంతో కూడిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఆమెను స్టార్‌ను చేశాయి.

నాగదుర్గకు గ్లామర్‌ దుస్తుకంటే సాంప్రదాయ చీరకట్టు, హాఫ్ శారీస్ అంటేనే ఇష్టం. స్క్రీన్‌పై కూడా మితిమీరిన గ్లామర్‌కు ఆమె ఒప్పుకోరు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుంది.

సినిమా ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎనలేని అభిమానమని, ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా చాలని ఓ  ఇంటర్వ్యూల్లో నాగదుర్గ చెప్పింది.

తెలుగులోలో కలివి వనం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘లవ్‌ ఓ లవ్‌’ అనే సినిమా చేసింది. ఇప్పుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్‌ చేశారు. ఇందులో ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిలే ఇప్పుడు నెట్టింట నాగదుర్గను ట్రెండింగ్‌గా మార్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement