పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం! | US Senators Slam Pakistan And Qatar Over Terror Ties In Iran Peace Talks, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

Jun 23 2026 10:07 AM | Updated on Jun 23 2026 10:34 AM

US Senators Slam Pakistan Qatar Over Terror Ties In Iran Peace Talks

వాషింగ్టన్‌: అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న కీలకమైన శాంతి చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించడంపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పించే చరిత్ర కలిగిన దేశాలను నమ్మి చర్చలు జరపడం ఏంటని వారు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ స్విట్జర్లాండ్‌లో పాక్, ఖతార్ ప్రతినిధులతో కలిసి చర్చల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఉగ్రవాదులకు ఆశ్రయం: సెనేటర్ రిక్ స్కాట్ ఆగ్రహం
ఫ్లోరిడా సెనేటర్ రిక్ స్కాట్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా అమెరికా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అసలైన మిత్రులు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్, ఖతార్ దేశాలకు దశాబ్దాల చరిత్ర ఉందని ఆరోపించారు. ఇరు దేశాలు శాంతి స్థాపన కంటే ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని మండిపడ్డారు. అయితే, ఎలాంటి ఒప్పందం కుదిరినా ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసే అవకాశం మాత్రం శూన్యమని ఆయన స్పష్టం చేశారు.

లాడెన్‌ను దాచారు: ఐఎస్ఐపై తీవ్ర ఆరోపణలు
మరోవైపు మొంటానా సెనేటర్ టిమ్ షీహీ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌పై  ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు పదేళ్లపాటు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందనే నిజాన్ని ఎవరూ మరువలేరని ఆయన గుర్తుచేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే తిరుగుబాటుదారులకు నిధులు అందించారని, ఇరాన్ నాయకత్వానికి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అలాంటి దేశాలు ఈ చర్చల్లో నిష్పక్షపాతంగా మధ్యవర్తిత్వం వహిస్తాయని అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని ఆయన తేల్చిచెప్పారు.

అసలైన మిత్రులు వీరే
మధ్యప్రాచ్యంలో అమెరికాకు నమ్మకమైన భాగస్వాములు వేరే ఉన్నారని సెనేటర్ షీహీ అభిప్రాయపడ్డారు. ఖతార్ దేశం ఉగ్రవాద సంస్థలకు దశాబ్దాలుగా మనీలాండరింగ్ చేస్తోందని ఆరోపిస్తూ.. చర్చల్లో పాక్, ఖతార్‌లకు బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలను భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ దేశాలే అమెరికాకు నిజమైన అండగా నిలుస్తాయని, కాబట్టి యూఏఈ, ఇజ్రాయెల్‌ల వైపు అమెరికా స్పష్టమైన మద్దతుతో నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement