అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా? | Trump Says He Can Stop Netanyahu From Derailing Iran-US Peace Deal Amid Lebanon Tensions, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

Jun 23 2026 8:20 AM | Updated on Jun 23 2026 9:45 AM

Can Trump Restrain Netanyahu Tensions Rise Over US-Iran Deal

జెరూసలెం: వాషింగ్టన్ వేదికగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విచ్ఛిన్నం చేయకుండా ఎలా అడ్డుకుంటారన్న రిపోర్టర్ల ప్రశ్నకు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘బీబీ’గా పిలిచే నెతన్యాహుతో సహా ఎలాంటి సమస్యనైనా తాను చాలా వేగంగా పరిష్కరించగలనని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో కీలకమైన 14 సూత్రాల ప్రతిపాదనల్లో లెబనాన్ సంక్షోభం ఒకటైనప్పటికీ, ఇజ్రాయెల్ అక్కడ తన దాడులను ఆపకపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నెతన్యాహును ట్రంప్ నిలువరించగలరా?
శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ తన వ్యూహాత్మక నైపుణ్యాలను చాటుకున్నారు. ‘నేను ఏం చేయబోతున్నానో ఇప్పుడే చెప్పను. కానీ ఈ సమస్య పరిష్కారమవుతుంది. నేను సమస్యలను పరిష్కరించే వ్యూహకర్తను. బీబీతో ముడిపడి ఉన్న విషయాలతో సహా ఎలాంటి కఠినమైన సమస్యలనైనా నేను చాలా వేగంగా సర్దుబాటు చేయగలను’ అని ట్రంప్ అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు సబోటాజ్ (విధ్వంసం) చేయకుండా చూసేందుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని ఆయన పరోక్షంగా సూచించారు.

లెబనాన్‌లోనే ఉంటాం: ఇజ్రాయెల్ పట్టు
ట్రంప్ వ్యాఖ్యలు ఇలా ఉంటే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం లెబనాన్ విషయంలో అస్సలు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. తమ సరిహద్దుల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నంత కాలం దక్షిణ లెబనాన్‌లోని భద్రతా వలయంలో ఇజ్రాయెల్ దళాలు కొనసాగుతాయని ఆయన తేల్చి చెప్పారు. శాంతి చర్చల్లో ఏం జరిగినా, ఒప్పందాలు కుదిరినా, కుదరకపోయినా సరే.. తాను అధికారంలో ఉన్నంత కాలం ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా ఎదగనివ్వబోనని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు.

అమెరికాను ప్రశ్నించిన నెతన్యాహు
తమ దేశ చర్యలను గట్టిగా సమర్థించుకుంటూ నెతన్యాహు అమెరికాకే ఒక సూటి ప్రశ్న విసిరారు. ‘ఒకవేళ అమెరికా సరిహద్దుల్లో వేలాది మంది ఉగ్రవాదులు చేరి, రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణులు, కిల్లర్ డ్రోన్లతో దాడి చేస్తూ, పౌరులను, పిల్లలను చంపుతుంటే అమెరికా ఊరుకుంటుందా? చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? కచ్చితంగా కూర్చోదు. సరిహద్దు దాటి వెళ్లి, భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ఆ ముప్పును పూర్తిగా తొలగించే వరకు ఉగ్రవాదులను ఏరిపారేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నది కూడా సరిగ్గా అదే’ అని నెతన్యాహు ఘాటుగా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement