మనీలా: ఫిలిప్పీన్స్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక పాఠశాల లోపల దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పులు కలకలం రేపాయి. నిత్యం విద్యార్థుల సందడితో ఉండే క్లాస్‌రూమ్‌ల మధ్యే బుల్లెట్ల వర్షం కురవడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.
పాఠశాల ఆవరణలోకి చొరబడి..
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ సిటీ పరిధిలో గల ‘బారంగే సాన్ జోస్’ లోని ఒక పాఠశాలలో సోమవారం ఉదయం దాదాపు 9 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. పాఠశాల ఆవరణలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో మొత్తం ఎనిమిది మందికి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం అందిన వెంటనే టాక్లోబన్ సిటీ పోలీస్ స్టేషన్-1 అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
ఒకరి అరెస్ట్.. మరొకరి కోసం వేట
ఈ ఘటన అనంతరం పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని మైనర్‌గా గుర్తించారు. ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న రెండో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితులిద్దరూ స్థానిక బారంగే సాన్ జోస్ ప్రాంతానికి చెందినవారేనని ప్రాథమిక సమాచారం.
ఆస్పత్రిలో క్షతగాత్రులు.. దర్యాప్తు ముమ్మరం
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాతే పేర్లను ప్రకటిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి గల కారణాలు, వారి లక్ష్యం ఏమిటనే దానిపై టాక్లోబన్ సిటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’


