అమెరికాలోని పశ్చిమ ఇడాహోలోని ఓ రెస్టారెంట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. నిందితుడు కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ట్విన్ ఫాల్స్‌లోని 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్' రెస్టారెంట్ దగ్గర జరిగిన ఈ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని ట్విన్ ఫాల్స్ నగర ప్రతినిధి జోష్ పాల్మర్ తెలిపారు. అయితే మృతుల్లో దుండగుడు కూడా ఉన్నాడా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదన్నారు.
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియో ఫుటేజ్‌లో ఒక యువకుడు రెస్టారెంట్ వెలుపల లాంగ్ గన్‌తో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల్లో ప్రజలు రెస్టారెంట్ నుండి బయటకు పరుగులు తీయడం కనిపించింది. ట్విన్ ఫాల్స్.. ఇడాహో దక్షిణ ప్రాంతంలో సుమారు 56,000 జనాభా కలిగిన ఒక నగరం. ఇది సాల్ట్ లేక్ సిటీకి వాయువ్యంగా సుమారు 290 కిలోమీటర్లు దూరంలో ఉంది.


