లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆలీగంజ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం 15 మందిని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో కాన్పూర్‌కు చెందిన ఇద్దరు ప్రాణస్నేహితులు, యానిమేషన్ స్టూడియో సహోద్యోగులు అయిన సంయమ్ విజ్ (28), సూరజ్‌భన్ సింగ్ (25) కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
నాన్నమ్మ అంత్యక్రియలకు రావాల్సిన వాడు..
కాన్పూర్‌లోని గోవింద్ నగర్ బ్లాక్-11 నివాసి అయిన సంయమ్ విజ్ కుటుంబం ఇప్పటికే శోకంలో మునిగి ఉంది. ఇటీవలే సంయమ్ నానమ్మ మరణించగా, మంగళవారం రోజున ఆమె 13వ రోజు ఆబ్ధికం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంయమ్ లక్నో నుంచి ఇంటికి రావాల్సి ఉండగా, అంతలోనే అతను మరణించాడనే వార్త కుటుంబ సభ్యులను కుదిపేసింది. కొన్ని సంవత్సరాల క్రితమే తండ్రి పుష్పరాజ్ విజ్ మరణించడంతో, సంయమ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు.
తల్లికి తెలియని కొడుకు మరణవార్త
మరో మృతుడు కాన్పూర్ బర్రా-7 నివాసి అయిన సూరజ్‌భన్ సింగ్ కథ కూడా గుండెల్ని పిండేసేలా ఉంది. తండ్రి లేని ఆ కుటుంబంలో తల్లి మీరా దేవి, తమ్ముడు సామ్రాట్‌లకు సూరజ్‌భనే ప్రధాన ఆధారం. ప్రతి వారాంతంలో ఇంటికి వచ్చే సూరజ్‌భన్, ఆదివారమే తిరిగి లక్నోలో విధులకు హాజరయ్యాడు. అదే తన చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కొడుకు మరణవార్త వింటే ఎక్కడ గుండె పగిలిపోతుందోనని, ఆమె అనారోగ్యానికి గురవుతుందనే భయంతో బంధువులు ఇప్పటివరకు ఆ తల్లికి ఈ చేదు నిజం చెప్పలేదు.
మరణంలోనూ విడిపోని స్నేహం
సంయమ్, సూరజ్‌భన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఒకే యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగంలో చేరారు. చివరకు మరణంలోనూ కలిసేవున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నిపుణులు ఇలా అకాల మరణం చెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లిళ్లు, కుటుంబ వేడుకల గురించి చర్చించుకోవాల్సిన ఇళ్లలో ఇప్పుడు అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!


