తొలి రౌండ్‌లోనే అనూహ్య ఓటమి
అనారోగ్యంతో బాధపడిన సెర్బియా దిగ్గజం
నవోనే సంచలన విజయం
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ వేటలో మరోసారి బరిలోకి... అటువైపు ప్రత్యర్థిగా 25 ఏళ్ల కుర్రాడు... తొలి సెట్‌లో ఓడినా తన స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి రెండు సెట్‌లు సొంతం... అయితే మ్యాచ్ మధ్యలో అనారోగ్యం, కోర్టులోనే వాంతి... అయినా పట్టువదలకుండా పోరాటం... కానీ చివరకు తప్పని నిష్క్రమణ... ఏకంగా 4 గంటల 36 నిమిషాల సమరం తర్వాత సెర్బియా దిగ్గజ ఆటగాడు జొకోవిచ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ఎలాగైనా గెలవాలనే కసి, అతని పట్టుదలను 39 ఏళ్ల వయసు నిరోధిస్తున్నట్లుగా ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. 20 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నిలో తొలి రౌండ్‌లోనే ఓడి అతను తన భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించాడు.
న్యూయార్క్: సెర్బియా స్టార్, 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. తొలి రౌండ్‌లో ప్రపంచ 49వ ర్యాంకర్ మరియానో నవోనే (అర్జెంటీనా) 7–6 (7/5), 5–7, 4–6, 6–2, 6–1తో నాలుగో సీడ్ జొకోవిచ్‌పై సంచలన విజయం సాధించాడు. జొకోవిచ్ తన సుదీర్ఘ ప్రస్థానంలో ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇది మూడోసారి మాత్రమే. కెరీర్‌లో తొలిసారి 2005లో, ఆ తర్వాత 2006లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనే అతను మొదటి రౌండ్‌లో పరాజయం పాలయ్యాడు. ఇటీవలే జరిగిన సిన్సినాటి ఓపెన్‌లో కూడా మొదటి రౌండ్‌లో అర్జెంటీనాకే చెందిన అగస్టీన్ చేతిలో జొకోవిచ్ ఓడాడు. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడిన అతను కొంత విరామం తీసుకొని న్యూయార్క్‌కు వచ్చాడు. తాను పూర్తిగా కోలుకొని ఫిట్‌గా మారానని అతను ప్రకటించినా... సోమ వారం జరిగిన పోరులో అతని సమస్య మళ్లీ కనిపించింది.
వరుస తప్పిదాలతో...
కెరీర్‌లో ఒకే ఒక ఏటీపీ టైటిల్ గెలిచిన ‘క్లే కోర్ట్ స్పెషలిస్ట్’ నవోనే ఈసారి హార్డ్‌కోర్టుపై సత్తా చాటాడు. జొకోవిచ్‌తో పోరు తొలి సెట్‌లో ఒకదశలో 1–4తో వెనుకబడినా నవోనే తగ్గలేదు. జొకోవిచ్ 17 అనవసర తప్పిదాలు చేయడంతో వాటిని సమర్థంగా వాడుకొని సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత జొకోవిచ్ కోలుకొని తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించాడు. రెండో సెట్‌లో కాస్త తడబడినా, మూడో సెట్‌లో మాత్రం తన స్థాయిని ప్రదర్శించాడు. 27 షాట్‌ల ర్యాలీని గెలుచుకొని ముందంజ వేసిన అతడిని అర్జెంటీనా యువ ఆటగాడు నిలువరించలేకపోయాడు.
అయితే ఆ తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. తొలి మూడు గేమ్‌లలో జొకోవిచ్ సరీ్వస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన నవోనే మరో అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లి సెట్‌ను గెలుచుకున్నాడు. నిర్ణయాత్మక చివరి సెట్‌కు ముందు తీవ్రంగా ఇబ్బంది పడ్డ జొకోవిచ్ మెడికల్ బ్రేక్ కూడా తీసుకున్నాడు. ఫిట్‌నెస్ సమస్యతో చివరి సెట్‌లో అతను కోలుకోలేకపోయాడు.మరోవైపు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారూస్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సబలెంకా 6–2, 6–4తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై విజయం సాధించింది.
నా శరీరం మొత్తం కుప్పకూలిపోతున్నట్లుగా అనిపించింది. మైదానంలో ఉన్నంత సేపూ ఇబ్బంది పడుతూనే ఆడాను. అయితే ప్రేక్షకులు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఎంతో ఉత్సాహపరుస్తూ బాగా ఆడమంటూ ప్రోత్సహించారు. మ్యాచ్ తొలి సెట్‌లోనే సమస్య మొదలైంది. మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవాలని అనుకున్నా... రెండు, మూడో సెట్‌లు గెలవడంతో మళ్లీ కొనసాగించేందుకు పట్టుదల కనబర్చాను. ఈ శారీరక సమస్యలను నేను ఎప్పుడు పరిష్కరించుకోగలుగుతానో ఇప్పుడే చెప్పలేను. ప్రయత్నం మాత్రం చేస్తున్నాను.
– జొకోవిచ్


