'యూఎస్‌' కిరీటం ఎవరిదో! | The stage is set for the US Open | Sakshi
Sakshi News home page

'యూఎస్‌' కిరీటం ఎవరిదో!

Aug 30 2026 3:49 AM | Updated on Aug 30 2026 3:49 AM

The stage is set for the US Open

నేటి నుంచి చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

టైటిల్‌పై అల్‌కరాజ్, సబలెంకా గురి  

రా.9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లు ప్రసారం

న్యూయార్క్‌: టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ‘యూఎస్‌ ఓపెన్‌’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టోర్నీ సెప్టెంబర్ 13న ముగుస్తుంది. పురుషుల విభాగంలో కార్లోస్‌ అల్‌కరాజ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, గత రెండేళ్లు టైటిల్‌ సాధించిన అరైనా సబలెంకా వరుసగా మూడో ట్రోఫీపై కన్నేసింది. గాయం కారణంగా వరల్డ్‌ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ ఈ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో అల్‌కరాజ్‌కు అవకాశాలు మరిన్ని పెరిగాయి. మరో వైపు దిగ్గజ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన 25వ గ్రాండ్‌స్లామ్‌ గెలిచే ప్రయత్నంలో మరోసారి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 

గాయంతో గత ఏప్రిల్‌ నుంచి ఆటకు దూరంగా ఉన్న అల్‌కరాజ్‌ కోలుకొని పునరాగమనం చేయడంతో అభిమానుల అంచనాలు పెరిగాయి. తాను గెలిచిన 7 గ్రాండ్‌స్లామ్‌లలో అతను ఇక్కడే రెండు టైటిల్స్‌ సాధించాడు. ఈ సీజన్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ఈ టోర్నీలో టాప్‌ సీడ్‌ కాగా, 2021 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కూడా పోరాడేందుకు సై అంటున్నాడు. 

2003లో ఆండీ రాడిక్‌ యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన తర్వాత పురుషుల విభాగంలో ఏ అమెరికన్‌ ఆటగాడు కూడా టైటిల్‌ గెలవలేకపోయాడు. ఇప్పుడు బెన్‌ షెల్టన్, టేలర్‌ ఫిట్జ్, ఫ్రాన్సిస్‌ టియాఫో తమ వైపునుంచి ప్రయత్నం కొనసాగించనున్నారు. మహిళల విభాగంలో 2024, 2025 విజేత, వరల్డ్‌ నంబర్‌వన్‌ సబలెంకా మళ్లీ యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సారి గెలిస్తే సెరెనా విలియమ్స్‌ తర్వాత వరుసగా మూడు సార్లు యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన ప్లేయర్‌గా ఆమె నిలుస్తుంది. అయితే ఆమె తాజా ఫామ్‌ అంత గొప్పగా లేదు. గత కొన్ని టోర్నీలో ఆమె కనీసం నాలుగో రౌండ్‌ కూడా దాటలేకపోయింది. 

యూఎస్‌ ఓపెన్‌కు ముందు ఆడిన హార్డ్‌ కోర్ట్‌ టోర్నీలు టొరంటో, సిన్సినాటిలలో ఆమె ఓటమిపాలైంది. 2026 వింబుల్డన్‌ చాంపియన్‌ లిండా నొస్కొవా, ఇగా స్వియాటెక్‌ల నుంచి సబలెంకాకు గట్టి పోటీ ఎదురవుతుండగా... రిబాకినా, పెగులా, పౌలా బడోసా, కోకో గాఫ్, స్వితోలినా వంటి ప్లేయర్లు కూడా టైటిల్‌ వేటలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో 46 ఏళ్ల వీనస్‌ విలియమ్స కూడా పోటీ పడుతుండగా...డబుల్స్‌లో వీనస్‌ – సెరెనా విలియమ్స్‌ జోడీకి నిర్వాహకులు వైల్డ్‌ కార్డ్‌ ద్వారా అవకాశం కల్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement