మెన్‌సిక్‌–ముకోవా జోడీకి మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ | Mensik and Mukova win mixed doubles title | Sakshi
Sakshi News home page

మెన్‌సిక్‌–ముకోవా జోడీకి మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌

Aug 28 2026 4:13 AM | Updated on Aug 28 2026 4:13 AM

Mensik and Mukova win mixed doubles title

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కొత్త జోడీకి తొలిసారి టైటిల్‌ లభించింది. గురువారం జరిగిన ఫైనల్లో జాకుబ్‌ మెన్‌సిక్‌–కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో విజేతగా అవతరించింది. బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)–ఫ్లావియో కొబోలి (ఇటలీ) ద్వయంతో జరిగిన తుది పోరులో మెన్‌సిక్‌–ముకోవా జంట 6–3, 1–6, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో విజయం సాధించింది.

అంతకుముందు సెమీఫైనల్లో మెన్‌సిక్‌–ముకోవా 5–4 (8/6), 3–5, 11–9తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మిరా ఆండ్రీవా–ఆండ్రీ రుబ్లెవ్‌ (రష్యా)లపై గెలుపొందారు. సెమీఫైనల్లో మెన్‌సిక్‌–ముకోవా రెండు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. విజేత మెన్‌సిక్‌–ముకోవా జోడీకి 10 లక్షల డాలర్లు (రూ. 9 కోట్ల 55 లక్షలు), రన్నరప్‌ బెన్‌చిచ్‌–కొబోలి జంటకు 5 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 77 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకుల భారీ సంఖ్యలో రావాలనే ఉద్దేశంతో యూఎస్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధికారులు గత ఏడాది మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫార్మాట్‌ను మార్చారు. సింగిల్స్‌ టాప్‌ స్టార్‌ ఆటగాళ్లకు కూడా మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడేందుకు అవకాశం ఇచ్చారు. రెండు రోజుల్లోనే మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం మ్యాచ్‌లను ముగించేలా ప్రణాళిక చేశారు. ఈసారి కూడా అదే ఫార్మాట్‌ను కొనసాగించారు. 

ఈ ఏడాది సింగిల్స్‌ స్టార్స్‌ జొకోవిచ్‌ (సెర్బియా), అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), కాస్పర్‌ రూడ్‌ (నార్వే), రుబ్లెవ్‌ (రష్యా), ఫెలిక్స్‌ అగుర్‌ అలియాసిమ్‌ (కెనడా)... సబలెంకా (బెలారస్‌), సెరెనా విలియమ్స్‌ (అమెరికా), మిరా ఆండ్రీవా, బెన్‌చిచ్, ముకోవాలకు అవకాశం ఇచ్చారు. సింగిల్స్‌ స్టార్స్‌తోపాటు డబుల్స్‌లో టాప్‌–10లోపు జోడీలను ఆడించారు. గత ఏడాది మిక్స్‌డ్‌ డబుల్స్‌ విజేత సారా ఎరాని–వావసోరి (ఇటలీ) జోడీ ఈసారి తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. పురుషుల సింగిల్స్, డబుల్స్‌... మహిళల సింగిల్స్, డబుల్స్‌ మ్యాచ్‌లు ఈ ఆదివారం మొదలవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement